Friday, January 17, 2020

తస్మాత్ జాగ్రత్త !!

శివరామ కృష్ట్నన్ కమీషన్ నివేదికను ఎవరికీ తెలీకుండా చాటుగా భోగిమంటల్లో తగలెట్టి ,  ఇప్పుడు బోస్టన్ కమిటి నివేదికను ప్రజల ముందుకు తెచ్చి భోగిమంటల్లో తగలెడితే , ఆలోచించలేని స్దితితో ఆంధ్రా ప్రజలు లేరు అని నా బలమైన నమ్మకం.  

తన కేబినెట్ మంత్రి, మంత్రికన్నా ముందు వ్యాపార వేత్త తో ఒక కమిటీ వేసి , నారాయణ కమిటీ చెప్పిందని శివరామ కృష్ట్నన్ కమిటీ నివేదికను పక్కన పెట్టి, నలభై సంవత్సరాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి అమరావతి రాజధాని అంటే ఎవరూ నోరు మెదపలేదు , ఎందుకంటే అనుభవం ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్రం కష్టాల్లో ఉంది మంచి చేస్తాడు అని నమ్మకం, అదే నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారు అదే నమ్మకంతో రాజధాని ని అంగీకరించారు, మరి ఆ నలభై సంవత్సరాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి తన ఐదు సంవత్సారాల కాలంలో చేసిందేంటి అంటే తన కుటుంబానికి, తన పార్టీ నాయకులకు , పార్టీలో కొద్దో గొప్పో పేరున్న ప్రతి ఒక్కరికీ ఏదో ఒకరకంగా లబ్ది చేకూరే విధంగా వ్యవహరించి, పార్టీ కార్యకర్తల చెవుల్లో నమ్మి గెలిపించిన ప్రజల చెవుల్లో పూలు పెట్టాడన్నమాట నిజం.    

మనం భారతీయులం, మనకు చిన్నప్పటినుండి నేర్పేది పెద్దలను గౌరవించడం పెద్దల ను చూసి నేర్చుకోవడం , బహుశా కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి అదే చేస్తున్నాడేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇతను చేసే ప్రతి పనిలోనూ గత గ్నాపకాలు వెంటాడుతున్నాయి,  అతను తనవాడైన నారాయణ తో కమిటి వేస్తే ఇతను కొంచం ఎక్కువ తెలివిగలవాడు కాబట్టి కొంచం దూరం ఆలోచించి బోస్టన్ కమిటి అని ఇంకా ఎక్స్పర్ట్ కమిటీ అని నివేదికలు తెప్పించి తను అనుకున్నదే కమిటీ నివేదికల ద్వారా చెప్తున్నాడనడంలో ఏ సందేహమూ లేదు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే ,రాజధాని అమరవతిలో ఐదువేల ఎకరాల పైన  అంతర్గ వ్యాపారం  (Insider Trading) జరిగిందని అభియోగం , నిజంగా అదే నిజమైతే చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలి  , ఆ ఐదువేల ఎకరాలు ప్రభుత్వం స్వాదీన పరుచుకుని అభివృద్ది చేసే మార్గం ఆలోచించాలి అంతేకాని ఒక పార్టినో లేద ఒక మనిషో చేసిన తప్పుకు ప్రజలను ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. చట్టం లో ఉన్న లొసుగులు ఉపయోగించుకుని పకడ్బందీగా చేశారు అని ఒక సమూహం చెప్తున్న మాట, నిజంగా అలా జరిగి ఉంటే తగిన కార్యాచరణ ద్వారా చట్టంలో మార్పులు చేసేందుకు ఎందుకు ప్రయత్నించడంలేదు ? బహుశా ఇప్పుడు మీరు చేసేవి భవిష్యత్తులో బయటపడిపోతాయేమో అని ముందు జాగ్రత్తా ? లేక ఇంకేమైనా కారణమా? ఎదేమైనప్పటికి నమ్మి గెలిపించిన ప్రజలు సమాధానం చెప్పాల్సిన భాధ్యత ప్రభుత్వానికి ఉంది , నాకు మెజారిటీ ఉంది నేను ఏమైనా చెయ్యగలను అని విర్రవీగే క్షణంలో ఆ మెజరిటీ ఇచ్చింది ప్రజలే అన్న సంగతి మరచిపోకండి,  మీకిచ్చిన సమయం కేవలం ఐదు సంవత్సరాలే అన్న సంగతి గ్ణాపకం ఉంచుకోవడం మంచిది.  

మూడు ప్రాంతాల అభివృద్దే మీ ఆకాంక్ష అయితె, అదెలానో రాష్ట్ర ప్రజలకు వివరించండి, అలానే అమరావతి రైతులను ఏవిధంగా సంతృప్తి పరుస్తారో సవివరంగా చెప్పి వారి సమ్మతి తీసుకుని ముందుకు వెల్తే మనుగడ ఉంటుంది అంతే కాని ఒక పార్టీ మీద కోపంతో లేదా మనిషిమీద ద్వేషంతొ మీరు చేసే పనుల వల్ల మీమీదే ప్రజలు కోప్పడేలా ప్రవర్తించకండి  

ఎన్ని మంచి పనులు చేసినా ఒక్క తప్పు చాలు ప్రజలు వ్యతిరేకించడానికి అది తెలుసుకుని సరిదిద్దుకుంటే ప్రజలు బ్రహ్మరధం పడతారు లేదంటే తిరగబడతారు.  

-- వరప్రసాద్ కార్యంపూడి