Friday, April 24, 2015

ఉగాది సంబరాలు


విదేశాల్లో నివసిస్తున్న మన ప్రవాసాంధ్రులు తెలుగు భాష మీద మరియూ తెలుగు పండుగలమీద అభిమానంతో ముఖ్యమైన పండుగలకు తెలుగువారంతా ఒకచోట చేరి వేడుక చేసుకోవడం చాలా ప్రాంతాల్లో ఆనవాయితీగా ఉన్న సంగతి తెలిసిందే, ప్రధాన నగరాల్లో జరిగే ఈ వేడుకలు అప్పుడప్పుడూ మన తెలుగు టీ వీ చానల్స్ లో కవరేజి కూడ ఉంటుంది.

  గత నెలలో మన తెలుగు వారందరం ఉగాది పండగ జరుపుకున్నాం,  మేము ఉన్న ఊరులో (అల్బని, న్యూయార్క్)  ఈమధ్యే  ఈ సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి...

  సాధారణంగా తెలుగు వారిని ఆహ్వానించి , ఉచితంగా కాదండోయ్ డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కుని రమ్మని ఆహ్వానం, అలా కొనుక్కుని వెళ్లేవాళ్లలో తెలుగు పండగ కాబట్టి తొంభై శాతం పైన తెలుగు వారు  మిగిలిన వారు దక్షణ భారతదేశపు మిత్రులు ఉంటారు,   ఈ కార్యక్రమానికి ఆంధ్రా / తెలంగాణ నుంచి   తెలుగు టీ వీ యాంకర్లు లేదంటే సినిమా ఆర్టిస్ట్ లు ఎవరో ఒకరు లేదంటే వీలున్న చోట ముగ్గురు నలుగురు అతిధుల ని పిలిపిస్తారు చాలా సంధర్భాల్లో ఈ అతిధులకు తెలుగు వచ్చినా మైకు తీసుకోగానే ఇంగ్లీష్ లేదంటే హిందీ విచ్చల విడిగా మాట్లాడేస్తుంటారు,  కాకపోతే ఈసారి ఒక్కరు మాత్రం నేను తెలుగులోనే మాట్లాడ్డానికి ప్రయత్నిస్తా అని ఇంగ్లీషు లో చెప్పి ఇంగ్లిషు లో వాయించింది మిగిలిన వాళ్లు కొంచం పరవాలేదు తెలుగు లోనే మాట్లాడారు

  అసలు ఇలాంటి వేడుకలు చేయడానికి  గల  ముఖ్య ఉద్దేశ్యం  మన పిల్లలు సంస్కృతి సంప్రదాయాలకు దూరం కాకుండా మన పండుగల ఔన్నత్యం గురించి పండుగల  గొప్పతనం గురంచి తెలియజేయడం, పెద్దవాళ్లు ఇండియాలో జరుపుకున్న పండుగల గ్ఞాపకాలను ఒకరికొకరు పంచుకుని మనమేమి మిస్సవుతున్నామో దానిని మరచిపోయి కొంతవరకన్నా తృప్తి పడడం  , కానీ ఇక్కడ జరిగేది మాత్రం పూర్తిగా   వేరు.  

  మూడు సంవత్సరాల పిల్లల నుండి వయసు మీడపడ్డ పెద్దవాళ్ల వరకు అందరూ స్టేజ్ మీద కనిపించి ఫోటోలు  , వీడియోలు తీసి అంతర్జాలం లో బందువులకు , మిత్రులకు పంచుకోవడం, ఇక్కడ జరిగే కార్యక్రమాలు కొన్ని ఝుగుప్సను కలిగింఛేవిలా ఉంటాయని ఈ వేడుకలకు విచ్చేసిన ప్రేక్షకులలో ఎవరినడిగినా నిర్భయంగా చెప్పగలరు.

    " అమ్మాయ్ మనసులో అబ్బాయ్ దూరేసి కిత కితలే పెట్టేస్తే ఏమవుతుంది...  " అనే ఈ పాటకి ఐదు ఆరు సంవత్సరాల వయసున్న చిన్న పిల్లలతో చిందులేయించడం

    తొమ్మిది పది సంవత్సరాల పిల్లలచేత ఒకదానికొకటి  సంబందంలేని ముడు నాలుగు ఐటెం సాంగ్స్ ని కలిపి ఆపాటలకు డాన్సులు చేయిస్తూ మనం పిల్లలకు ఏమి నేర్పుతున్నామో అర్ధమవుతందా?

    ఈ కార్యక్రమంలో తొంభై ఐదు శాతం కార్యక్రమాలు పిల్లలతో సినిమా పాటలకు చేయించిన (రికార్డింగ్) డాన్సులు  మాత్రమే.

    సినిమా పాటలకు చిన్నపిల్లలతో డాన్సులు చేయించడమా మన సంప్రదాయం?  ఇవేనా మన పిల్లలకు నేర్పించాల్సింది? మన తెలుగు జానపదాలు, సంగీతం , నృత్యం ఇలాంటి ఎన్నో కళలు మరుగునపడుతున్నాయ్ అని గగ్గోలుపెట్టే మనం మరి వాటినెందుకు మన పిల్లలతో చేయించలేకపోతున్నాం?  టీ వీ యాంకర్లు , సినిమా ఆర్టిస్టులు తప్ప మనకు వేరే ఎవరూ కనిపింఛడంలేదెందుకు మన హరికథలు బుర్ర కథలు , తోలుబొమ్మలు మనం చిన్నప్పుడు చూసిన ఇలాంటి ఎన్నో మరుగున పడుతున్న కళలను మన పిల్లలకు ఇలాంటి  వేడుకల ద్వారా పరిచయం  చేయలేకపొతున్నామెందుకు?  అన్న నా ప్రశ్నకు "అవన్నీ ఇప్పుడెవరు చూస్తారండి "  అన్నారు ఒకాయన "ఎందుకు చూడరండి మనం చూపిస్తే , ప్రయత్నిస్తే కదా చూస్తారో లేదో తెలిసేది అలా కాకుండా పోలో మని సినిమా పాటలకు డాన్స్ చెయ్యడం నేర్పింఛేసి వీడియోలు తీసుకుంటూ కూర్చుంటే అవి మన పిల్లలకు ఏవిధంగా ఉపయోగపడుతాయో చెప్పండి,   ఖర్మ కాలి ఎవరైనా విదేశీయులు  ఈ వేడుకలు చూస్తే వీల్ల సంస్కృతి ఇదేనేమో చిన్న పిల్లలతో చిందులేయించడం అనుకునే ప్రమాదం ఉంది కదా " అంటే " వాళ్ల సంస్కృతేమంత గొప్పదికాదుకదండీ అని సమాధానం " ఇలా వితండవాదం చేసేవాళ్ల వళ్లే  కాదా ఇలాంటి కార్యక్రమాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయ్..

   ఇకపోతే ప్రత్యేక అథిధులుగా విచ్చేసిన టీ వీ ఆర్టిస్టులు మాట్లాడిన భాష ఏంటి ? ఒక స్త్రీ , ఒక పురుషుడు స్టేజి మీద వాడిన భాష తెలుగా? ప్రతి మాటలో ద్వంద్వార్ధం, దానికి పెద్దవాల్లు అరుపులు కేరింతలు , ఎందుకు నవ్వుతున్నారు అని పక్కన కూర్చున్న మన పిల్లలు అడిగితే మనమెందుకు నవ్వుతున్నామో మనస్సాక్షిగా  మన పిల్లలకు చెప్పగలమా?    ఒరే అని అమె అంటే వసే అని అతను ఇదెనా మనం పండుగ సంబరాల పేరుతో భావితరాల వాల్లకు నేర్పించేది

   పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందన్న చందాన  టీ వీ ఆర్టిస్టులు స్టేజి మీద వాళ్లకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే అది చూసి రెచ్చిపోయి మా స్దానిక యాంకరు   వచ్చి " నన్ను లోపల దొబ్బేస్తున్నారు " అని మైకు పట్టుకుని స్టేజి మీద మాట్లాడుతుంటే వీల్లను చూసి చప్పట్లు కొడుతున్న మన చేతకాని తనాననికి ఏమి పేరుపెట్టాలి?  

ఈ మొత్తం కార్యక్రమం లో చూడదగ్గ  కార్యక్రమాలేమైన ఊన్నాయా అంటే అవి


1.   క్లాసికల్ డాన్స్ (థిల్లానా)
2.   గంగావతరణం 

    నిజమైన మన సంప్రదాయాలను మనపిల్లలకు మన పిల్లలకు పరిచయం చేయలేమా?

   నేపద్యం లో కట్టిన బ్యానర్ లో కనిపించిన ఉగాది మచ్చుకైనా ప్రదర్షణలలో కనిపించలేదు .