Saturday, December 31, 2011

నూతన సంవత్సర శుభాకాంక్షలు !!!

నూతన సంవత్సర శుభాకాంక్షలు !!!

Sunday, May 08, 2011

తొలి మలుపు

ప్పుడు నా వయసు ఐదు సంవత్సరాలు....


నేనూ అందరు పిల్లల్లానే బడి అంటే ఏదో ఒక వంక చెప్పి ఎగ్గొట్టేందుకు ప్రయత్నించేవాన్ని, కాని పక్షంలో ఏడుపు ముఖంతో నాన్న దగ్గరకెళ్తే ఇక ఆరోజు బడికిపోనవసరంలేదు ఇలా ఎంతకాలం జరిగిందో గుర్తురావడంలేదు కానీ - అమ్మకి ఈ విషయంలో బాగా కోపం తెప్పించేంత కాలం జరిగిందని తరువాత తెలిసొచ్చింది నాకు .


ఎప్పుడూ లేనిది ఆ రోజు నాన్నగారు ఉదయం ఏడు గంటలకే ఆఫీసుకు వెళ్ళేందుకు తయారవుతున్నారు -


ఎప్పటిలానే ముఖమదోలా పెట్టి నాన్నదగ్గరకు వెళ్ళాను, ' నేను ఈరోజు బడికి పోను అని.....' నాన్న పెదవులపై చిరునవ్వుతో ' సరే మీ అమ్మకి నేను చెప్తాలే ' అనగానే కొండంత ఉత్సాహం, ఓ ఐదు పది నిముషాల తరువాత నాన్నగారు ఆఫీసుకు బయలుదేరారు.


నాన్నగారలా వెళ్లడం ఆలస్యం అమ్మ వంటింట్లోకెళ్లి " టిఫిన్ పెడతా రా...." పిలిచింది మారుమాట్లాడకుండా వెళ్లి ఇడ్లీ తిని ఓ గ్లాసు పాలు తాగాను , ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఇంట్లో నుండి బయటబడడం, అవతల మా (బడి ఎగగొట్టేసిన) బ్యాచి ఇప్పటికే గోలీలాట మొదలెట్టి ఉంటుంది, అని ఆలోచిస్తూ కూర్చున్నా.


కొద్దిసేపట్లో అమ్మ ఓ చేతిలో నా పుస్తకాల బ్యాగు (అందులో ఓ పలక తప్ప ఇంకేమీ ఉండదు) తో నా పక్కన నిలబడి " లేచి పలక తీసుకుని బయలుదేరు" చెప్పింది.నిదానంగా (స్లో మోషన్ లో) తల పైకెత్తుతూ " బడికా ? నాన్న వెళ్లొద్దన్నాడు " భయం భయంగా ఎక్కడ బడికెళ్ళాల్సొస్తుందో అని చెప్పాను.


"సరే నాన్న వెళ్లొద్దన్నా ......నేను వెళ్లమంటున్నాను కదా బయలుదేరు " చెప్పింది.


నా అమ్ములపొది లొ ఉన్న ఒకే ఒక వజ్రాయుధాన్ని ప్రయోగించేందుకు (ఏడిచేందుకు) సిద్దంగావున్నా ఇంతలో అమ్మ నా చేయి పట్టుకుని పైకి లేపి నాప్రమేయంలేకుండా పలక ఉన్న బ్యాగుని నాచేతిలో పెట్టి ఇక నడు అన్నట్లు చూసింది - అప్పటిదాకా కళ్ళల్లోనే అగిన నీళ్లు నా సంబంధం లేకుండానే దారలా చెంపలపైనుండి కారడం మొదలయింది.


"ఈరోజు నువ్వు ఏడిచినా మొత్తుకున్నా బడికి పోవాల్సిందే.... ఆపడానికి మీ నాన్నకూడా ఇంట్లో లేడు ..... నడు ముందు " చాలా కోపంగా శాసించినట్లు చెప్పింది అమ్మ.ఒక్కసారిగా పెద్దగా ఏడవడం మొదలుపెట్టాన్నేను"నోర్ముయ్....చెప్పానా ఏడిచినా లాభంలేదని......" కోపంగా చెప్పింది
నా ఏడుపు ఇంకా పెద్దదైంది .......


" ఇక లాభంలేదు ...... ఇలా నువ్వు మాట వినవు పద " అంటూ నా చేయి పట్టుకుని ఇంట్లో నుంచి బయటకు నడిపించింది రోడ్డుమీదకు రాగానే చుట్టుపక్కల ఉన్నవాళ్ళెవరో ఒకరు సాయం చేయకపోతారా నాకు అని అమ్మచేతినుండి నాచేయి విడిపించుకుని నేను బడికి పోను అని పెద్దగా ఏడుస్తూ నడిరోడ్డుమీద కూర్చున్నా.పక్కనే గొడ్లసావిడి అప్పుడే వేసిన పచ్చి దంట్లు (కంకి పట్టని జొన్న పంట కోసి ఒకటిన్నర రెండడుగుల పొడవుతో వాటిని ముక్కలుగా చేసి గేదెలకు మేత వేస్తారు) అవిచూసి అమ్మ నన్నక్కడ రోడ్డుమీద అలా ఉంచి రెండడుగుల్లో వెళ్ళి నాలుగైదు దంట్లు పట్టుకొచ్చింది -


నాకెందుకో భయమేసింది ఐనా నేనెందుకాపాలి అనుకున్నానో ఏమో అలానే ఏడుస్తున్నా ఇంతలో పక్కింటావెడ బయటకొచ్చి "ఎంటి అంజమ్మా పొద్దున్నే పిల్లోడినలా ఏడిపిస్తున్నావ్ " విషయం తెలియక అడిగింది


"వీడికి రోజూ ఇదొక ఆటైపోయింది బడికి పొమ్మంటే సోకాలు పెట్టి ఏడుస్తున్నాడు " అంటూ నా చెయ్యిపట్టుకుని మళ్ళీ పైకిలేపింది


"పోతాడులే వాడికి ఊహ తెలిశాక బడికిపోక ఏం చేస్తాడు " చెప్పింది

" ఇంకా ఊహ తెలిసేదేంటి.....ఐదో ఏడు కూడా దాటిపోతుంది వీడి తోటోళ్లందరూ చదువుకుంటుంటే " అని

" నడు...." చెప్పింది నాకు.

ఇకలాభంలేదని అప్పటిదాకా రోడ్డుమీద కూర్చున్ననేను అమ్మచేయి విడిపించుకుని రోడ్డుమీదలా పడి ఏడవడం మొదలుపెట్టా. ఇకచూడు నాసామిరంగా అమ్మ ఏదయితే చెయ్యదు అనుకున్నానో ఆ పని చెయ్యడం మొదలుపెట్టింది ఎడంచేతిలోకి ఓ జొన్న దంటు తీసుకుని ఒక్కటేసింది కాళ్ళమీద చురుక్కుమంది.....ఏడుపు పెద్దదైంది ..... అక్కడేదో వింత జరుగుతున్నట్లు వీధిలో అందరూ బయటకొచ్చారు "ఎందుకమ్మా పిల్లాడినలా కొడతావ్ " అని దూరంగా ఉండి చెప్పేవాళ్ళేగాని దగ్గరకొచ్చి అమ్మ చేతిలో జొన్న దంట్లు తీసుకునేవాళ్లొక్కళ్ళూ లేరు నేనుమాత్రం రోడ్డుమీదనుండి లేవలేదు....అమ్మకూడా ఊరుకోలేదు అలా రెండు జొన్న దంట్లు విరిగిపోయాయి....ఏడిచీ...ఏడిచీ నాకు వాంతి వచ్చి నేను తిన్న ఇడ్లీ.....పాలు...బయటకొచ్చాయి


అప్పుడే ఇంట్లో (మా ఇంటికి రెండుమూడు ఇల్ల అవతల ఉంటుంది ) నుండి బయటకు వచ్చిన హిందీ మాస్టారు గారి భార్య (పేరు గుర్తులేదు) "ఏంటండీ అంజమ్మ గారూ చిన్నపిల్లాడ్నిపట్టుకుని అలా గొడ్డుని బాదినట్లు బాదేస్తున్నారు " అని అమ్మ చేతిలో మిగిలిన జొన్న దంట్లు లాక్కుని విసిరి పడేసి నన్ను పైకి లేపింది
అప్పుడు చూశాన్నేను అమ్మ కళ్ళలో నీళ్ళు.....


"ఏమి చెయ్యనండీ రోజూ ఇదే వరస బడి అంటే ఏడుపు లంకించుకుని కూర్చుంటున్నాడు.......ఇంట్లో అందరూ (అన్నయ్య , బాబాయి - పెద నాన్నగారి పిల్లలు) చదువుకుంటుంటే వీడు రేపు వాళ్ళ బేగులు మోస్తాడా ? " అని నన్ను దగ్గరకు తీసుకుని తన చీర కొంగుతో నా ముఖం తుడుస్తూ మళ్లీ అడిగింది బడికెళ్తావా అని ఎప్పుడూ అమ్మ కళ్ళలో నీళ్లు చూడని నేను ఒక్కసారి ఏమి జరుగుతుందో అర్ధం కాక సరే అని తలాడించా.........


ఇంట్లోకి తీసుకెళ్ళి నీళ్ళతో ముఖం కడిగి నన్ను బడి దగ్గర వదిలి అమ్మ ఇంటికి వెళ్ళింది.


ఆతరువాత మరలా నేనెప్పుడూ బడికి పోను అన్నట్లు నాకు ఙ్ఞాపకంలేదు.
ఇప్పటికీ ఇది తలుచుకుంటే నాకు బాధ కలుగుతుంది అనవసరంగా అమ్మ కళ్ళలో నీళ్లు తెప్పించానే అని..., కానీ అమ్మ మాత్రం నవ్వుతూ చెప్తుంది ఆరోజు నీ ఒంటిమీద నాలుగు జొన్న దంట్లు విరగ బట్టి నువ్వు ఈరోజు ఇలా ఉన్నావు అని....నిజమే మరి దెబ్బ పడితేగానీ నాకు పట్టిన దయ్యం వదలలేదు.....