Thursday, January 31, 2008

ప్రేమ ఎంత మధురం....!!!


“ఛ.. ఈ మగవాళ్ళెప్పుడూ ఇంతే. చెప్పిన టైం కి ఏ పనీ చేయరు”, మనసులో అనుకుంటూ మళ్ళీ మెసెజ్‌ పంపించింది“ఆర్‌యు దేర్‌? ” అంటూ.

పదకొండు గంటలకొస్తానన్న మనిషి ఇంతవరకు అంతు లేడు. ఒకవేళ ఇన్విజిబుల్‌ మోడ్‌ లో ఉండి ఆటపట్టిస్తున్నాడేమో అని మెసేజ్‌ మళ్ళీ మళ్ళీ పంపిస్తూనే ఉంది. ఐనా అవతల వైపు నుండి మాత్రం ఏ విధమైన రిప్లయ్‌ లేదు.

కొద్ది సేపట్లో మినిమైజ్డ్‌ విండో తళుకు మనడం తో ఎగిరి గంతేసింది ఆమె. క్షణం కూడ ఆలస్యం చేయ కుండా ఆవిండో పై క్లిక్‌చేసింది.“హాయ్‌ సారీి ఫర్‌ ది లేట్‌కమింగ్‌ ”

ఇంతవరకు ఆలస్యమైనందుకు నిప్పులు కక్కుతూ ఉన్న ఆమె సారీ అన్న ఒక్క మాట తో ఐసైపోయింది.

“ఇట్స్‌ ఓకే! హవార్యు..? ” రిప్లయ్‌ఇచ్చింది

“ఐ యాం ఫైన్‌ హవార్యు..?“

"ఫ్రెండ్స్‌తో చిన్న పార్టీ అటెండై వచ్చేటప్పటికి కొంచం లేటైంది..సారీ” మళ్ళీ సారి చెప్పాడు..

“పార్టీ అంటే మందు కొట్టావా..?” ప్రశ్నించింది.

“తప్పలేదు.” చాల కూల్‌గా సమాధానమిచ్చాడు.

"అంటే మందు కొట్టి కార్‌ డ్రైవ్‌ చేసావా..?”

దొరికి పోయాన్రా భగవంతుడా అనుకుంటూ “చాలా స్లో గానే వచ్చా” అని టైప్‌ చేసాడతను లెటర్‌కీ లెటర్‌కీ మధ్య చుక్కలు పెడుతూ.

“ఎన్నిసార్లు చెప్పాలి నీకు మందు కొట్టి కార్‌డ్రైవ్‌ చెయ్యొద్దని.”
“..”

“..”
ఓ నిముషం మౌనం…తో తన కోపాన్ని తెలియజేసింది ఆమె.


“మహారాణి గారు అలకపానుపెక్కినట్టుంది.”
“ఆ మీమీద అలగడానికి నేనెవరు బాబు..” ఇంకా కోపం తగ్గలేదని చెప్పకనే చెప్పింది.
“సారీ చెప్పాగా ఇంకా ఎందుకు టైం వేస్ట్‌ చేస్తావ్‌”

“సారీ చెపితే తప్పు ఒప్పయి పోతుందా..?”
“…”

“…”
ఈ సారి మౌనం అవతల వైపునుండి.


కొంచం సేపటి తరువాత ఇకలాభం లేదని ఎప్పుడూ చేసే పనే చేసాడు..“సారీ,సారీ,సారీ,సారీ,సారీ,సారీ,సారీ,.” ఓ వందకు పైగా కాపీ చేసి పేస్ట్‌చేసి సెండ్‌ కొట్టాడు..
ఇన్ని సారీ లు చెపితే గాని ఆమె మౌనం తగ్గదన్న సంగతి ముందే తెలుసు. ఎప్పటిలాగానే..
“ఇట్సోకే. వాటెల్స్‌?”అంది కొంచెం ముభావంగా..


ఇలా మెసేజ్‌వస్తుందని ముందే తెలుసు.ఇంకా పొడిగిస్తే తెగే దాకా లాగడమే అవుతుందనీ తెలుసు అందుకే టాపిక్‌మార్చాడు.

“ఇంతకీ మన విషయం మీ నాన్నగారి తో మాట్లాడావా లేదా.?” ప్రశ్నించాడు

“చెప్పాలని ప్రయత్నించా కాని భయమేసింది..చెప్పలేక పోయా.”

“మరిలా భయపడుతూ కూర్చుంటే ఇద్దరం ముసలోళ్ళమై పోతాం.”

“అది సరే నువ్వు మాట్లాడావా ..మీ వాళ్ళ తో..?” ఎదురు ప్రశ్న.

“లేదు..”

“మరి..”

“నాకు మా ఇంట్లో వాళ్ళ మీద నమ్మకం ఉంది నామాట కాదనరని..”

“ఒకవేళ నువ్వనుకున్నట్లు జరగక పోతే..?”

“చెప్పాకదా నామాట మానాన్న కాదనడు. నేనే కోతిని చేసుకుంటానన్నా సరే అంటాడు…”

“మరి ఈకోతి కోసమే కదా గత ఆరునెలలు గా టైం కి ఇంటికొస్తుంది.”

“నిజాన్నొప్పుకున్నందుకు థాంక్స్‌ ”

“ఓకే.ఇంకా ఏమిటి సంగతులు.”

“పాప ఏడ్చింది.”

ఇప్పుడు నేను నవ్వుతున్నానోచ్‌ అన్నట్టు ఓ చిన్న ఇమేజ్‌పంపించాడు.

“మరి మీ వాళ్ళ తో ఎప్పుడు మాట్లాడు తున్నావ్‌?”
“ఎలాగయినా ఈరోజు ట్రయ్‌చేస్తా..”

“మళ్ళీ ట్రయ్‌ చేస్తానంటావేంటి..”

“చెప్పాను కదా ధైర్యం చాలడం లేదని..”

“ఇలా ఎన్నాళ్ళని చెప్పకుండా ఉంటావ్‌, ఏదో ఒక రోజు చెప్పాల్సిందే కదా..”

“సినిమాల్లో చూసేటప్పుడు ఇలాంటి డైలాగ్స్‌ బాగానే ఉంటయ్‌. రియల్‌లైఫ్‌ లోనే అసలు విషయం తెలిసేది.”

“సరే. కష్టమైన పనే.. మరేం చేద్దాం.”

“అదే ఆలోచిస్తున్నా. ఎలా చెప్పాలా అని.”

“ఓకే తొందరగా విషయాన్ని తేల్చు.. ఇంతకు ముందే చెప్పాను కదా.. వీసా ప్రాబ్లం లేకుంటే ఈపాటికి ఎప్పుడో వచ్చేవాడిని .”

“నువ్వు చెప్పావు, నేను విన్నాను. ఏదో విధంగా ఈ ప్రాబ్లంని సాల్వ్‌ చేస్తానన్నాను కదా!”

“సరే..జాగర్తగా డీల్‌ చేయ్‌. ఆల్‌ ది బెస్ట్‌”

ఓ పది నిముషాలు టైం పాస్‌ తరువాత.

“ఓకే .నాకు నిద్రొస్తుంది.”

“ఓకే గుడ్‌నైట్‌. హావ్‌ స్వీట్‌ డ్రీంస్‌”

“ఓకే హావ్‌ ఎ గుడ్‌డే. సీ యు టుమారో ఎట్‌ది సేం టైం ..ఆల్‌ ది బెస్ట్‌ బై..”
“బై..”

“..”

“..”


******


అమెరికా వచ్చి నాలుగు సంవత్సరాలు కావస్తున్నా వర్మ లో ఏ మార్పూ రాలేదు.. ప్రతి రోజూ తన స్నేహితుల తో మాట్లాడనిదే అతనికేదో లా ఉంటుంది. అందుకే రోజూ రూంకి రాగానే ముందు ఇండియాలో ఉన్న ఫ్రెండ్స్‌తో మాట్లాడిన తరువాతే పడుకుంటాడు..అతని రోజులో ఇదొక భాగమై పోయింది.
కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చేసి కాలేజి నుండి బైటకొచ్చిన ఆరునెలల్లో Y2K పుణ్యమా అని శ్రమ, పైసా ఖర్చు, లేకుండా అమెరికా గడ్డ మీద కాలు పెట్టాడు. జాబ్‌లో చేరిన ఈ నాలుగేళ్ళలో వచ్చే జీతం తో బాచిలర్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తూనే, అప్పుడప్పుడూ ఇంటికి కొంత పంపుతూ కూడ కొంత వెనకేశాడు. ఓ సంవత్సరం నుంచి ఇంటిదగ్గర నుంచి ఒకటే ఫోన్లు ఇంటికొచ్చి నచ్చినమ్మాయి ని చూసి పెళ్ళి చేసుకుని వెళ్ళమని. పెళ్ళి విషయం లో పూర్తి స్వేచ్చ నిచ్చాడు నాన్న.
ఈ ఇంటర్నెట్‌ రోజుల్లో కూడా అమ్మాయి ని చూడడం.. ప్రశ్నలడగడం.. నచ్చడం.. ఇదంతా ఒట్టి ట్రాష్‌.. అనిపించింది. అందుకే ఓ మంచి తెలుగమ్మాయ్‌ కోసం కనిపించిన మాట్రిమోనియల్‌ సైట్లన్నింటిలోనూ తన ప్రొఫైల్‌ని పెట్టాడు. కాని ఫలితమేమి కనిపించలేదు.


రోజూ లానే ఆఫీస్‌ నుంచి రాగానే సిస్టం ఆన్‌ చేసి ఇండియాలో ఉన్న ఫ్రెండ్స్‌తో చాట్‌ చేస్తున్నాడు వర్మ.
ఇంతలో ఎవరో కొత్త వ్యక్తి “హాయ్‌” అంటూ లైన్‌ లోకొచ్చారు..ఇది రోజూ ఉండే గొడవే కదా అని క్లోజ్‌చేసాడు..మళ్ళీ వెంటనే సేం మెసేజ్‌రావడంతో ఒకసారి ఐడి చూసాడు.తెలుగమ్మాయిలా ఉండడం తో ప్రొఫైల్‌ చూద్దామని క్లిక్‌చేసాడు.

ఫిమేల్‌లుకింగ్‌హైదరాబాద్‌ఇండియా

పరవాలేదు మన హైదరాబాద్‌ అమ్మాయే అనుకుంటూ

“హాయ్‌” మెసేజ్‌ పంపించాడు

ఓ పది నిముషాలు చాట్‌చేసిన తరువాత చదివింది బి. టెక్‌, ప్రస్తుతం ఉద్యోగ వేటలో ఉంది, అని
తెలుసుకున్నాడు.

మనసులో ఏ మూలో కొంచెం అనుమానం ఎవరైనా ఫ్రెండ్‌ తనని ఆట పట్టించేందుకు అమ్మాయిలా చాట్‌ చేస్తున్నాడేమో అని. అందుకే చాలా డీసెంట్‌గా మాట్లాడుతున్నాడు.

ఆమె తన గురించి ఏవేవో చెప్పుకుంటూ పోతుంది, నేనెవరో తెలియకుండా తన గురించి ఇలా చెప్పుకుంటూ పోతుందంటే ఒక వేళ చాటింగ్‌కి కొత్తా లేక బోళా మనిషా? అని ఆలోచించాడు. ఇంతలో ఆమ్మాయి డిస్కనెక్ట్‌ అయినట్లు మెసేజ్‌ రావడం తో ఆమె విషయం మరచి పోయి తన పనిలో నిమగ్నమై పోయాడు వర్మ.

మరుసటి రోజు సేం టైం లో ఆమ్మాయి పలకరింపు తో మరల ఆమె గురించి ఆలోచనలో పడ్డాడు.
నిన్న ఆమెగురించి చాలా చెప్పింది కాని ఆమె పేరు చెప్పలేదు.

”ప్రొఫైల్‌లో ఉన్న పేరు అసలా నకిలీనా ?” అడిగాడు.
“అసలు పేరే .” జవాబొచ్చింది

మెల్ల గా అవతలి వ్యక్తి వర్మ గురించి అడగడం మొదలైంది. అబద్ధం చెప్పాలనుకుని కూడా పోయేదేమి లేదు కదా అని అన్నీ నిజాలే చెప్పడం మొదలెట్టాడు..
అలా మొదలైంది ఆమెతో పరిచయం. ఇప్పుడు సంజన తో చాట్‌చేయడం వర్మ రోజులో భాగమై పోయింది.

ఫోనులో మాట్లాడిన తరవాత నమ్మకంగా తెలిసింది ఆమె అమ్మాయేనని. ఇంతవరకు ఒకరినొకరు కలుసుకో లేదు. చూసుకోలేదు. అప్పుడప్పుడూ ఫోనులో మాట్లాడుకోవడం. ఫోటోలు మార్చుకోవడం. వర్మ మాత్రం తన ఫోటో నే పంపించాడు.. కాని అతనికి చిన్న అనుమానం తనకి వచ్చిన ఫొటో లో ఉన్న అమ్మాయితో నేనా రోజూ మాట్లాడేది అని.. ఎలాగైతేనేం మెల్లగా ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెళ్ళిదాక వచ్చారు.


******వర్మ తన ప్రేమ విషయం ఫోను చేసి ముందు గా అమ్మతో చెప్పాడు. మొదట్లో బెట్టు చేసినా, తరవాత ఒప్పుకుంది.

కల ఫలించ బోతుండడంతో సంజన ఆనందానికి హద్దులు లేవు.

వెంటనే ఫోను చేసి శుభవార్తనందించింది. ఇరువైపులా పెద్దల ఫార్మాలిటీస్‌పూర్తి చేసుకుని.లగ్నాలు పెట్టించారు..

పెళ్ళి చేసుకోవడానికి ఇండియా బయల్దేరాడు వర్మ.

ఎయిర్‌పోర్ట్‌లో దిగి లగేజ్‌ తీసుకుని బైటకు నడిచాడు. ఎదురుగా ఫోటోలో ఉన్న అమ్మాయిని చూడగానే అతనికి నమ్మకం కుదిరింది.

ఇరువైపుల పెద్దల సమక్షంలో పెళ్ళి చాలా గ్రాండ్‌ గా జరిగింది. పెద్దగా కష్ట పడకుండానే వారం రోజుల్లో సంజన కి వీసా రావడంతో.. తిరుగు ప్రయాణం.. ఏమి కావాలో అన్నీ దగ్గరుండి షాపింగ్‌ చేయించాడు.అమెరికా ప్రయాణానికి బయలుదేరారు.

వర్మకి ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది, ప్రేమించి పెళ్ళి చేసుకోవాలన్న తన కల ఫలించినందుకు!

************

కాలిఫోర్నియా. విమానాశ్రయం. ఇమ్మిగ్రేషన్‌ చెకింగ్‌ ఐపోయింది.
“వెల్కం టూ కాలిఫోర్నియా!” చిలిపిగా అన్నాడు వర్మ.ఆమె నుంచి మౌనమే సమాధానం.
ఇంతలో దూరంగా తనను రిసీవ్‌ చేసుకోవడానికి వచ్చిన కిరణ్‌ చెయ్యి ఊపుతూ కనిపించాడు.
“హాయ్‌ కిరణ్‌!” వర్మ చేయెత్తి విష్‌ చేసాడు అతని వైపుకు నడుస్తూ.
“హాయ్‌” ఆనందంతో సంజన వేసిన కేకతో కాళ్ళకి బ్రేక్‌ పడి ఆగిపోయి ఆవైపు చూసాడు వర్మ.ఎవరో తనకి పరిచయం లేని ముఖం నవ్వుతూ కనిపించింది..

సంజన వైపు చూసాడు..ఆమెలో ఇంత ఆనందం పెళ్ళైన ఈ పదిహేను రోజుల్లోనూ ఎప్పుడూ చూడలేదతను.

అతని చేతిలోని బొకే అందుకుంటూ అతన్ని హత్తుకుంటున్న తన భార్య వంక వింతగా చూసాడు వర్మ.
“హి ఈజ్‌ మై ఫ్రెండ్‌ ప్రసాద్‌” పరిచయం చేసింది సంజన.
“హై, నైస్‌ టు మీట్‌యు..” హాండ్‌షేక్‌ చేశాడు అతను వర్మతో.
“ఓకే వర్మా.. థాంక్‌యూ అండ్‌ గుడ్‌బై.. ఐ యాం గోయింగ్‌విత్‌ ప్రసాద్‌”
ఆమె ఏం చెప్పిందో అర్ధమవడానికి కొద్ది క్షణాలు పట్టింది వర్మకు. ఏదో అడగాలని నోరు తెరవ బోయాడు.. కానీ మాట పెగల లేదు.


*******


ఈ కధ తొలి ప్రచురణ 2002 సంవత్సరం మార్చి నెల
ఈమాట .

8 comments:

Naveen Garla said...

కథ చివర ట్విస్టు ఊహించలేదు. కథ మొత్తం చదివిన తరువాత కథకు 'ప్రేమ ఎంత మధురం' పేరు సరిపోలేదనిపించింది.'ప్రేమ ఎంత స్వార్థం', 'ప్రేమ ఎంత క్రూరం' ఐతే సరిపోవచ్చునేమో.
ఇది నిజ జీవితం జరిగినదేనా? లేక మీరు సృష్టించినదా?

Dreamer said...

meeru vennela cinema choosara?

karyampudi said...

@ సావె , నేను వెన్నెల సినిమా చూసాను, కానీ ఈ సినిమా 2006 లో వచ్చింది , ఈ కథ 2002 మార్చిలో ఏమాట లో ప్రచురించబడినది. బహుశా ఈ కథ చదివి వెన్నెల సినిమాలో బ్రహ్మానందం సీను పెట్టారేమో :-)

@ నవీన్ గార్ల , మీరు చెప్పింది నిజమే కాకపోతే అలాంటి పేరు పెడితే ట్విస్టు ముందే ఊహించేస్తారేమో కదా ? అప్పట్లో ఇది నేను సృష్టించిందే కాకపోతే తరువాత ఇలాంటివి జరిగినట్లు వార్తలొచ్చాయి

Kalpana Rentala said...

Srinivas Garu,

mee kadhalo raasinattu jarigite meeru ela feel ayyaru?

sanjana enduku ala chesindo meeku kadhalo cheppalanipinchaleda? leda cheppakkaraledanukunnara?

Kalpana

kalpanarentala.wordpress.com

karyampudi said...

@ కల్పన గారికి, మొదట వార్తాపత్రికల్లో చదివినప్పుడు కథలో రాసినట్లు జరిగినందుకు ఆశ్చర్యపోయినా కొంచం ఆలోచిస్తే మనం ఊహించని సంఘటనలు ఎన్నో జరుగుతున్నప్పుడు ఊహించింది జరగడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో అనిపించింది .

సంజన ఎందుకలా చేసింది అనేది చెప్పాల్సిన అవసరం లేదనిపించింది నాకు.

Kalpana Rentala said...

ante

meeru voohinchi raasaranna maata. voohinchindi jaragam lo asharya ponakkaraledukaani mee vooha asadharanamaina vooha kabatti ikkada mee voohalaku joharlu.
meeru ye vaartapatrikalo chadivaaro kaani nenaite edo meelanti kondari dwara ilanti samghatanalu jariginattu vinnanu.
anyhow eemaata lo nenu ee kadha chadavakapoyina ee blog dwara chadavagaliganu. ayanevaro darsakudu denni terakekkinchaadu.
Best of luck with your creative writing.

kalpana

ramya said...

ప్రసాద్ గారు
ఆ అమ్మాయి ఎందుకలా చేసింది?

karyampudi said...

@ రమ్య గారు,
సంజన అలా చేయడానాకి ఈ రెండు కారణాల్లో ఎదో ఒకటి ఉండవచ్చని నా ఊహ, మొదటిది వీసా ప్రాబ్లం, రెండవది తన స్నేహితు(ని)ల తో పందెం లాంటిదెమైనా అయి ఉండవచ్చు