Tuesday, December 25, 2007

లీడర్

సోమారమొచ్చిందంటే నాకు తిప్పలు మొదలయినట్టే. ఆ అస్సైను మెంటూ ఈ అస్సైనుమెంటు అంటూ దుంపతెంచుతారు అయ్యోర్లు అందులో ప్రభాకరయ్యోరి దగ్గర యవ్వారం మరీ దారుణంగా వుంటాది అస్సైను మెంటు రాయనోల్లను లైనులో నిలబెట్టి ఒక్కొక్కడి తొడపట్టుకున్నాడంటే ఒకపట్టాన వొదిలిపెట్టడు. తొడ ఎర్రగా కంది వాడు పెద్దగా గగ్గోలుపెట్టి ఏడిస్తే అప్పుడు కాని వదలడు

ఏమాటకామాటే చెప్పుకోవాలి చదువు చెప్పే ఇషయంలో కూడా ఈ అయ్యోరే ఫస్టు. ఒకటికి రెండుసార్లు చెప్పి అందరికీ అర్ధమయిందంటేనే పక్కపేరాకెల్తాడు. ఈ మధ్య నాక్కూడ ఇంగ్లీషు పాటాలర్ధమవుతున్నాయంటే అది అయ్యవారి గొప్పతనమే.

పోయిన సోమారం నేను అస్సైను మెంటు రాయలా

పోయినసోమారమేకాదు ఇప్పటివరకూ ఏ సోమారమూ నేను అస్సైనుమెంటు రాయలా .
కారణమేమంటే నేను ఈ క్లాసు లీడరును. లీడరు పని చేపించాలేకానీ చెయ్యకూడదుకదా మరి అందుకే నేను రాయను అందరు అయ్యవార్లు నన్ను చూసీ చూడనట్లు పోతారు కాని ప్రభాకరయ్యోరు మాత్రం నన్నోపట్టాన ఒదలడు ఈ అయ్యోరికి నేనంటే కొచం కొంచంకాదు ఎక్కువే కోపం ఎందుకంటె క్లాసులో నేను చేసే అల్లరటువంటిది క్లాసులోనేకాదు మా ఇంటిచుట్టుపక్కలాడాల్లు నన్నుచిత్తనాపోడంటారంటే నేనేలెవల్లో అల్లరిచేస్తానో ఊహించుకోవచ్చు ప్రభాకరయ్యోరు పోయినవారం పెట్టిన తొడపాసం గుర్తు ఇంకా చెరిగిపోకముందే మల్లీ సోమారమొచ్చింది , ఈసారి రెండో తొడచూపించాలి

ఉండేది వారానికొక ఆదివారం ఆరోజుకూడా ఆడుకోకుండా హోం వర్కని ఆవర్కని ఈ వర్కని చెపితే మరి నేనాడుకునేదెప్పుడు ? అందుకే ఈ అస్సైనుమేంట్ల గొడవ నాకు సోమారం క్లాసుకురాగానే గుర్తొచ్చిద్ది పొద్దున్నే ఫస్టు పీరియడు ఇంగ్లీషు. పిలకాయలందరూ అస్సైనుమెంట్‌నోటు పుస్తకాలు తెచ్చి బల్లమీద పెట్టగానే నాకు గుర్తొస్తది ఇవ్వాల కూడా అదే జరిగింది , అందరూ పుస్తకాలు బల్లమీద పెట్టారా లేదాని ఒకటికి రెండుసార్లడిగి అందరూ పెట్టారని నమ్మకంకుదరగానే అన్నీ పుస్తకాలు తీసుకుని ఒక ఆర్డరులో పెట్టడం మొదలెట్టా. క్లాసుకు వొచ్చిన ముప్పై నాలుగురిలో ముప్పైమూడు పుస్తకాలు టేబులుమీదకొచ్చాయి ఒకపుస్తకంమాత్రం సంచిలో నక్కింది ఇవ్వాల నాకు తోడెవరూ లేకపోవడంతో భయం మొదలయింది ఎంతసేపు తొడపాశం పెడతాడో అని, కొంచం సేపు ఆలోచించి పుస్తకాలన్నీ రాంబాబుగాడికిచ్చి చెప్పా

లెక్కెట్టుకోరేయ్‌మొత్తం ముప్పైమూడు రాంబాబుగాడి ముఖంలో చెప్పలేనంత ఆనందం మొదటిసారి సెకండు లీడరుకు లీడరుగిరి వచ్చిందన్న ఆనందంతో అస్సైనుమెంటు పుస్తకాలన్నీ సంకలో పెట్టుక్కూర్చున్నాడు అయ్యోరికోసం ఎదురుచూస్తూ

ప్రభాకరయ్యోరు రాగానే నాకోసమన్నట్లు నేనెప్పుడూ కూర్చునేకాడ చూసి అక్కడకని పించకపోయేటప్పటికి ఒక్కసారి క్లాసంతా కలియచూసి నేను కనపడగానే రాశావా అన్నట్లు కళ్ళెగరేశాడు దొంగలాగ తలకాయొంచుకుని లేచి నిలబడ్డా “పుస్తకాలు టేబులుమీదపెట్టు ” చెప్పాడు , రాంబాబుగాడు గబుక్కునలేచి సంకలో పుస్తకాలన్నీ టేబులుమీదపెట్టి “ఇయ్యాల నేనే లీడరు సారు వాడికొంట్లో బాగోలేదంట ” ఈ చివరిముక్క వాడు కలిపించుకున్నదే చెప్పి కూర్చున్నాడు “ఏమయిందిరా …..” అడిగాడు సారు“కడుపులో నెప్పిగా ఉంది సారు ” అని కడుపుపట్టుకుని మరీ చెప్పా“నాకు తెలుసాకడుపునెప్పెందుకొచ్చిందో ” అని అస్సైనుమెంటు రాయని వాల్లునిలబడమని చెప్పి ఒక్కొక్కరిని పిలిచి అస్సైనుమెంట్‌చూడడం మొదలుపెట్టాడు.

నేను జరగబోయే తతంగాన్నూహించుకుంటూకిస్‌కిస్‌ మని నవ్వుకుంటూ ఎనకలైనులో నిలబడ్డా అన్నీ చూడడం అయిపోయింది కానీ రాంబాబుగాడి పుస్తకంమాత్రం లేదక్కడ “ఏరా లీడరనగానే నీకూకొమ్ములొచ్చినయ్యా ఎప్పుడూరాసేవాడివి ఏమయ్యిందినీకివ్వాల” అని కుర్చీలోనుండి లేచాడు“నేను రాశానుసార్‌నాపుస్తకం అక్కడేపెట్టా ” నమ్మకంగా చెప్పి ఒకసారి“పుస్తకమక్కడపెట్టానుకదరా “అన్నట్లు నాకేసి చూశాడు. నేను మూతికి చెయ్యడ్డంపెట్టుకుని ఏమీ తెలియని అమాయక చక్రవర్తిలా ముఖంపెట్టి దీనంగా వాడివైపుచూశా

“ఇక్కడపెడితే నేనేమన్నా దాచానా నీపుస్తకాన్ని , అస్సైనుమెంటు రాయకపోగా రాశానని అబద్దాలుకూడానా లే నిలబడు గాడిదా” అయ్యోరు పెద్దగా అరిచాడు రాంబాబుగాడు చేసేదేమీలేక బిక్కమొఖమేసుకుని నిలబడ్డాడు“ఇద్దరూ ఇట్రాండిరా” పిలిచాడు. తొడమీద రుద్దుకుంటూ ముందుకు కదిలా“ఎందుకురాయలేదురా ” ప్రశ్నించాడు“నిన్నంతా కడుపులోనొప్పిసార్‌, అదింకాతగ్గలేదు ” వేరే ఏ అయ్యోరయినా నేచెప్పినపద్దతి చూసి రెస్టుతీసుకోమని ఇంటికి పంపించేవోరు ఈనమాత్రం నన్ను కాచి వడపోసినోడయ్యా “నీ జిత్తులమారి ఎత్తులు నాకుతెలుసుగానీ రాముందుకు ” తొడపాశం పెట్టడానికి చేయిముందుకు చాచాడు చేయిముందుకొస్తూ ఉంది తొడదగ్గరకొచ్చింది పట్టుకోబోతున్నాడు, క్లాసురూము పెంకులెగిరిపోయేలా పెద్దగా అరిచా అప్పుడుచూసా సారింకా నాతొడపట్టుకోలేదన్నది ఇకచూడు పిల్లకాయలు ఒకటే నవ్వు , అమ్మాయిలయితే పొట్టపట్టుకుని మరీ పెద్దగా నవ్వుతున్నారు ఒక్కసారి వెనక్కితిరిగి తరగతి మొత్తాన్నలా చూడడంతో నాక్కూడా నవ్వొచ్చింది, నాతోపాటు పక్కనున్న రాంబాబుగాడు కూడా ఇరగబడినవ్వడం సారుకు కోపం తెప్పించినట్టుంది “మీపనిట్టకాదు “అని చుట్టూచూసి అందుబాటులో ఏమీలేకపోయేసరికి “నెక్స్టు పీరియడేంది”అమ్మాయిలవైపు తిరిగి అడిగాడు”యన్‌యెస్‌సార్‌” టపీమని చెప్పా .సీరియస్‌గా నావైపు చూసి , ఆపక్కగా పోతున్న వాచ్‌మాను రంగయ్యను పిలిచి“వీల్లిద్దర్ని తీసుకుపోయి ఆ స్టోర్రూంలో పడెయ్‌ వొంటేలు బెళ్ళయిపోయాక మళ్ళీ తాలం తీయ్‌” సీరియస్సుగా పేసుపెట్టి చెప్పాడు ఒక్కసారిగా క్లాసంతా సైలెంటయిపోయారు “ఇంకెప్పుడయినా అస్సైనుమెంటురాయకపోతే ఎవరిగతయినా ఇదే! వీల్లిద్దరినీ తీసుకుపో “మల్లీ చెప్పాడు రంగయ్యకు , రంగయ్య “ఆ రండి ” అనగానే పిలకాయలంతా అప్పుడెప్పుడో ఎండాకాలం శలవుల్లో చింత తోపులో పేకాడేటోల్లను పోలీసోల్లు పట్టుకెల్లినప్పుడు చూసినట్లు చూస్తూ ఉన్నారు మావైపు నాకయితే మస్తు ఖుషీగుంది అక్కడ ఎంచగ్గా శెనగపప్పులు, బెల్లం, ఏడిచెనక్కాయపప్పు అన్నీ ఉంటాయ్‌ నారొట్టెవిరిగి నేతిలో పడింది అనుకుని‘ఇంకెప్పుడూ అస్సైనుమెంటు రాసే పనిలా’ మనసులో అనుకుంటూ రాంబాబుగాడివైపు చూశా బిక్కముఖమేసుకు నడుస్తున్నాడు నావెనకాలె.

****

రంగయ్య స్టోర్రూము తాళం తీసి మమ్మల్ని గదిలోపెట్టి బయట గడిపెట్టి మల్లీ తాళం పెట్టి వెల్లిపోయాడు లోపలంతా చీకటిగా ఉంది మెల్లగా లైటు స్విచ్చు వెతికి లైటేశా , రాంబాబుగాడు ఏడుపులంకించుకున్నాడు “ఎందుకురా ఏడుస్తున్నావ్‌” వాడినడిగా ” నా అస్సైనుమెంటుపుస్తకం పోయింది, మాయమ్మ తన్నుద్ది ” ఏడుస్తూనే చెప్పాడు “సరే ఏడు ఎక్కువేడిత్తే మీయమ్మతన్నదు ” అని అప్పుడుచూసా ఇంతకముందు గోనిసంచులున్న కాడా ఇప్పుడు ఇనపడబ్బాలుండి వాటికి తాటికాయంత తాలాలేసున్నయ్యి వోరి వీల్ల దుంపతెగ అందుకే కావొచ్చు కొత్త శిక్ష జంకులేకుండా అమలు జరిపాడు , అయినా వార్డెను తెలివి మీరిపోయాడు అనుకుని ఈ గంటఏమి చేయాలా అని ఆలోచిస్తుంటే ఎదురుగ్గా ఒకపక్క ఓ నాలుగైదు బియ్యపు గోతాలు రెండోపక్క ఓ కందిపప్పుగోతం కనిపించాయి, చూడగానే నాకు చిత్రమయిన ఆలోచనొచ్చింది వెంటనే కష్టపడి ఆ బియ్యపు గోతాన్నీ ఈ కందిపప్పుగోతాన్ని దొర్లించి మధ్యలో కూర్చుని ఆ రెంటినీ కలిపే పనిలో ఉండిపోయా మధ్యమధ్యలో బియ్యంకందిపప్పు తింటూ నాపని నేను చేసుకుపోతూ ఇంతకీ రాంబాబుగాడేం చేస్తున్నాడాని వాడివైపుచూసా వాడెప్పుడుఏడుపాపాడొగాని ఓ మూల కూర్చుని నేను చేసేపని చూస్తూ నవ్వుకుంటున్నాడు ఇంతలో స్టోరు తలుపు తెరుస్తున్న చప్పిడవడంతో గబుక్కున లేచి లైటాపి రాంబాబుగాడి పక్కన కూర్చున్నా , రంగయ్య తలుపుతీసి మమ్మల్నిద్దరినీ బయటకురమ్మని మళ్ళీ తలుపు తాలంపెట్టాడు

****

మూడో పీరియడు జరుగుతుంది , హెడ్డుమాష్టరు వార్డెను రంగయ్య ముగ్గురూ కట్టకట్టుకుని మా క్లాసు వైపురావడం చూసి నానిక్కరులో ఉచ్చ పడ్డయ్‌క్లాసుదగ్గరకొచ్చి నన్నూ, రాంబాబుగాడిని బయటకుపిలిచి బియ్యం కందిపప్పు కలిపిందెవర్రా వార్డెను గుడ్లు మిటకరించిమరీ అడిగాడు మాములుగానే ఆయన్నిచూత్తే నాకు బయ్యం ఆయన మొఖమలాపెట్టి అడగడంతో సరెండరయిపోయా, ఇకచూడు పక్కనే ఉన్న అవ్వాయ్‌సువ్వాయ్‌బెత్తంతో వార్డెను ఉతుకుతుంటే నాసామిరంగా నేనేసిన చిందులు చిందులుకాదు , మధ్యలో హెడ్డుమాస్టరుగారు కలగజేసుకుని రేయ్‌పో పోయి ఒంటికాలుమీద గ్రౌండులో నిలబడు నేను మళ్ళీ చెప్పేదాక కదలొద్దు అని ఆర్డరేసి రామయ్యా వీడిసంగతిచూడు అని తనదారిన వెళ్ళిపోయాడు గ్రౌండు మధ్యలో వొంటికాలుమీద నిల్చున్నా , అలా నిలబడడం నాకు మంచిగా అనిపించింది మా ఇంట్లో శ్రీకృష్ణ పరమాత్ముడు పామ్మీదనిలబడి నాట్యం చేస్తున్నట్లుంది నావాలకం మెల్ల మెల్లగా పైనా కిందా కాలడం మొదలెట్టింది ఎండకి ఒల్లంతా చెమటలుపడుతున్నాయ్‌ ఇంతకీ నన్నిలా నిలబెట్టిన సంగతి హెడ్డుమాష్టరుగారికి గుర్తుందో లేదో అనుమానంరాగానే నన్నే గమనిస్తూ తనపని చేసుకుంటున్న రంగయ్యను “ఓ …. రంగయ్యో హెడ్డుమాష్టరుగారినడుగు నేనిలా ఎంతసేపు నిలబడాలో ?” పెద్దగా అరిచా, “ఈ పీరియడయ్యేంతవరకు ” చెప్పి తనపని చేసుకుంటున్నాడు రంగయ్య.

పీరియడవడానికింకో అరగంటపైనే పడుతుంది అప్పటిదాకా ఇలా ఎండలో ఒంటికాలుమీదనిలబడడం కష్టమవుతుందేమో నీరసమొచ్చి పడిపోతానేమో అనుమానంరాగానే అయిడియాకూడా వొచ్చింది
నాచుట్టూ అయ్యోర్లు, పిలకాయలు చేరారు వార్డెను నాముఖాన నీల్లు చల్లి నన్ను భుజానేసుకుని తీసుకెల్లి హెడ్డుమాస్టరు రూములో మెత్తటిసోఫాలో పడుకోబెట్టి నాకు గోళీ సోడా తాగించాడు నాకయితే అయ్యోర్లు పడుతున్న హైరానాచూచి నవ్వొచ్చింది గబుక్కున నవ్వితే తంతారని బయమేస్తుంది ఇలా ఎంతసేపుండాలో తెలియడంలేదు ఎప్పుడులేవాలో అర్ధమవడంలేదుతలకాయాలాడేసి పడుకుని పెదాలు గట్టిగా బిగబట్టి లోపల్లోపల నవ్వుకుంటున్నా హెడ్డు మాస్టరు గారైతే కాలుకాలిని పిల్లిలాగా అటూ ఇటూ తెగ తిరిగేస్తున్నాడు , కళ్ళుతెరవడానికి ప్రయత్నిస్తున్నట్లు కొంచం తెరిచి చూసి మల్లీ కళ్ళుమూసుకుంటున్నా అయ్యోర్లందరూ నాకు సేవలు చేసుకుంటున్నారు ప్రభాకరయ్యోరయితే ఒక పుస్తకం తీసుకుని నాతలకాడ నిలబడి విసురుతున్నాడు రాజ భోగం ఎంతమంది పిలకాయలకీ అవకాశం దొరుకుద్ది ఎక్కువసేపయితే కనుక్కుంటారేమో అని మెల్లగా కళ్ళుతెరిచి ఏమీ తెలియనట్లు అమాయకంగా ముఖంపెట్టి “ఏమయింది ?” అడిగా“ఏమీ కాలేదమ్మా ఎండలో ఉండడంవల్ల కళ్ళుతిరిగి పడిపోయావంతే” అని పక్కనే ఉన్న రాంబాబును చూస్తూ ఒరే వీడిని తీసుకుపోయి ఇంటిదగ్గర వొదిలిపెట్టు చెప్పాడు హెడ్డుమాస్టారు ” హమ్మయ్యా నా ప్లాను ఫలించింది ” మనసులో అనుకుని మెల్లగా లేచి క్లాసువైపు వెల్లబోతే అప్పటికే నా పుస్తకాలసంచీ తీసుకుని రడిగా ఉన్న రాంబాబు “ఇవిగోరా నీపుస్తకాలు నేను తెస్తాలే పా ” అని నాకు బంట్రోతులా నాఎనకాల పుస్తకాల సంచీ తో బయలుదేరాడు, స్కూలు గేటుదాటగానే సంచీ తీసుకుని దాన్లోనుండి రాంబాబుగాడి అస్సైనుమెంటు పుస్తకం తీసిచ్చా ఆ సమయంలో వాడు చూసిన చూపుకు ఇంకొకడయితే నిజంగా భస్మమయిపోయేవాడు ,” అరే ఏమనుకోకురా సారు నాఒక్కడికే తొడపాసంపెడతాడని తోడుగా నీపుస్తకాన్ని నాసంచీలోపెట్టా “నవ్వుతూ చెప్పి “ఇక నువ్వు క్లాసుకుపో నేనింటికెల్తా “చెప్పా, అంతకోపంలోకూడా “మల్లీ నువ్వుపడిపోతావేమోరా ” అమాయకంగా అడిగాడు “మళ్ళీ సారెప్పుడన్నా ఎండలో నిలబెడితే తప్ప నేను పడిపోనురా ” నవ్వుతూ చెప్పి సంచీ సంకకు తగిలించుకుని బుయ్యని పరిగెత్తా ఇంటికికాదు చెట్టుకింద గోలీలాటకి .....

6 comments:

బ్లాగాగ్ని said...

కడుపుబ్బా నవ్వించారండీ. మొదటి అక్షరం నుంచి చివరి దాకా ప్రతీ వర్ణనా చాలా బాగుంది.

Unknown said...

వావ్...
అద్భుతంగా ఉంది. చాలా బాగా రాశారు.
మొదటి సారి చూస్తే రానారె రాసిన టపాలాగా అనిపించింది.

రానారె said...

ప్రసాద్‌గారూ, చాలా బాగా రాశారు. "బంట్రోతులా ఎలకాల నడవడం", "నేను తెస్తాలే పా" ఈ మాటలు మావూరి యాసకు దగ్గరగా అనిపించాయి. ఈ టపా చాలా తమాషాగా వుంది. రాస్తూనే వుండండి.

రాధిక said...

తెగ నవ్వించారు కదండి...మీరు సూపరు.. ఇంతకీ ఇది ఏ మాండలికం లో రాసారు?

teresa said...

బాగా రాశారు. keep it up!

karyampudi said...

బ్లాగాగ్ని గారికి, ప్రవీణ్ గార్లపాటి గారికి, రెనారే గారికి, తెరెసా గారికి ఈ కథ మీకు నచ్చినందుకు మరియూ మీ అమూల్యమైన సమయం వెచ్చించి కామెంటు రాసినందుకు ధన్యవాదములు.

రాధిక గారు నేను ఈ కథ ఏ మాండలీకంలోనూ రాయలేదు, కేవలం మన పల్లెటురి స్కూల్స్ లో పిల్లలు మాట్లాడుకునేది యధాతదంగా రాయడం జరిగింది మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.