Friday, December 14, 2007

కనువిప్పు

“మీకేమన్నా పిచ్చి పట్టిందా ఏమిటి, ఎక్కడో అమెరికాలో ఉన్న కన్న కూతురి మీద దావా వేస్తామంటారు?” నిర్ఘాంతపోతూ అన్నది లక్ష్మి.
“పిచ్చిదానా! నేను ఇప్పుడున్నంత మానసికారోగ్యంతో ఇంకెప్పుడూ లేను. ఇన్నేళ్ళ నా లా ప్రాక్టీసుకి ఇప్పుడే నిజమైన సాఫల్యం.” అన్నాడు శేషగిరి రావు దృఢంగా.
“ఇదెప్పుడైనా ఎక్కడైనా విన్నామా? తల్లిదండ్రుల మీద కోర్టుకెళ్ళే పిల్లలు ఎక్కడన్నా ఉండొచ్చు గాని, పిల్లల మీద తల్లిదండ్రులు దావా వెయ్యటమేమిటి?”“అదుగో, ఇప్పుడు నువ్వన్నట్లు తల్లిదండ్రులంటే పిల్లలు ఏం చేసినా కిక్కురు మనకుండా పడుండే వాళ్ళని అందరూ అనుకోవడం వల్లనే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు.”
“ఇలా చేస్తే అమ్మాయీ, అల్లుడూ మళ్ళీ మనతో మాట్లాడుతారా? బంధువులు మనల్ని పలకరిస్తారా?”
“ఏ మాత్రం బుద్ధున్న వాళ్ళైనా మనం ఎందుకు ఈ పని చేస్తున్నామో అర్థం చేసుకుని, వాళ్ళు చెయ్యలేకపోయినది మనం చేస్తున్నందుకు చాటుగా నైనా సంతోషిస్తారు. ఇక అర్థం చేసుకోని వాళ్ళంటావా, వాళ్ళు పలకరించకపోతే మనకు అదే పదివేలు!”
“మీదో చాదస్తం!”
“చాదస్తం కాదు, నువ్వే గుర్తు తెచ్చుకో, నీ గారాల కూతురు నీకు చేసిన మర్యాద ఏమిటో!”

*****

” హలో అమ్మా నేను సంధ్యను…”
ఎక్కడో దూరాన ఉన్న కూతురు అప్పుడప్పుడూ ఫోను చేసి పలకరిస్తుంది, ఆ పిలుపుకోసమే ఎదురుచూసే తల్లి మనసు మరుక్షణం పులకరించి పోతుంది.ఒక్క క్షణం ఏమి మాట్లాడాలో అర్ధం కాలేదామెకు.
ఎప్పటిలాగానే మనసు పొరల్లో అప్పటివరకూ దాగివున్న ఐదక్షరాలు “బాగున్నావామ్మా…” అంటూ తనకు తెలియకుండానే బయటికొచ్చాయి.
“బాగానే ఉన్నా…నీకో శుభవార్త చెపుదామని ఫోను చేశా….”
“ఏందమ్మా మీరు ఇక్కడికి వస్తున్నారా….?” కూతుర్ని చూసి రెండేళ్లైంది. అనుక్షణం అమ్మాయిని చూడాలని మనసు తపిస్తుంది.
“లేదమ్మా……..” చిగురాకుపై ఎర్రని సూర్యకిరణం పడినట్లయింది.
“మరింకేమిటే ఆ శుభవార్త ” అని కొంచం ఆగి “నెల తప్పావా ? ” ఆనందంతో కూడిన స్వరంతో అడిగిందిఅవతలవైపు కొద్ది క్షణాల నిశ్శబ్దం తరువాత లోగొంతుతో “ఊ …” అని వినిపించింది.

తనబిడ్డ ఇంకో బిడ్డకు తల్లి కాబోతుందన్న వార్త లోని ఆనందంఈ టైం లో బిడ్డని చూడలేక పోతున్నానే అన్న బాధరెండూ కలిసి ఆమె నోట మాట పెగలలేదొక క్షణం.
కళ్ళవెంట రాలుతున్న కన్నీటిని కొనగోట తుడుస్తూ, కిందిపెదవిని పంటితో నొక్కిపట్టి ఆపుకుంటూ “పిచ్చిపిల్లా ఈ మాట చెప్పడానికెందుకే సిగ్గుపడతావ్‌ ఎన్నోనెల ” ప్రశ్నించింది తల్లి.
కొద్ది సేపు కూతురితో మాట్లాడి ఫోను పెట్టేసింది లక్ష్మి భర్తకు ఈ విషయం ఎలా చేరవేయాలా అని ఆలోచిస్తుండగానే రానే వచ్చాడు శేషగిరిరావ్‌ అతన్ని అల్లంతదూరంలో చూస్తూనే ఎదురెళ్లి శుభవార్త చెవిన వేసింది.

నిన్నకాక మొన్న అయినట్లుంది అమ్మాయి పెళ్ళి,
అమ్మాయి డిగ్రీ పరీక్షలు రాసి రిజల్స్ట్‌ కోసం ఎదురుచూస్తుంటే, అల్లుడిని వెతికే పనిలో పడ్డారు అమ్మా నాన్న. పరీక్ష అయితే ఫెయిలైంది కాని , అమ్మాయికి పెళ్ళి కళ వచ్చేసింది.
అమెరికా సంబంధం, అబ్బాయి బుద్ధిమంతుడు, కట్న కానుకల పై అబ్బాయిగాని అతని తల్లి దండ్రులు పెద్దగా మక్కువ చూపకపోవడం తో వెంటనే నిశ్చితార్ధం జరిగిపోయింది.
పది రోజుల్లో పెళ్ళి, తరువాత పదిహేను రోజుల్లో అమెరికా ప్రయాణం అనగానే ఈ పెళ్ళి నాకొద్దు మొర్రో అని మారాం చేయడం మొదలెట్టింది, పెళ్ళి అనే పేరుతో నన్ను మీనుండి ఎక్కడికో పంపేయాలని చూస్తున్నారని తల్లి ఒడిలో తలవాల్చి బోరుమంది.
అమ్మాయిని పెళ్ళికి ఒప్పించేటప్పటి కి ఇద్దరికి తల ప్రాణం తోకకొచ్చినంత పనైంది. ఒక్కగానొక్క కూతురి పెళ్ళి. ఖర్చు విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా ఘనంగా పెళ్ళి తతంగం పూర్తి చేశారు.
గుండెనిండా భారంతో పుట్టిపెరిగిన ఊరుని, తనతో ఆడుకున్న స్నేహితులని , తననిన్నాళ్లూ కంటికి రెప్పలా కాపాడుతూ తనకు కావాల్సినవి అందిస్తూ వచ్చిన తల్లి దండ్రులనీ ఒదిలి తెలియని సుదూర ప్రాంతానికి వెళ్తున్నందుకు కుమిలి కుమిలి ఏడ్చింది.

*****

ఇప్పుడా ఇంట్లో ఇద్దరే , ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ కాలం గడుపుతున్నారు.
వెళ్లిన కొత్తల్లో వారానికి రెండుసార్లు ఫోను చేసేది, తరువాత మెల్లగా ఫోను కు ఫోనుకు మధ్య వ్యవధి పెరుగుతూ ఇప్పుడది ఏ రెండునెల్ల కొకసారో అయింది.

*****

నెల తరువాత మళ్లీ కూతురు దగ్గరనుండి ఫోనొచ్చింది
“అమ్మా నా డెలివరీ టైంలో ఎవరో ఒకరు తోడుంటే మంచిది కదా…. అందుకు నువ్విక్కడికి రావడానికేర్పాట్లు చేస్తానంటున్నాడు మీ అల్లుడు”
లక్ష్మి షాక్‌ తిన్నట్లు “నేనా…..?” ప్రశ్నించింది.
“అవును. నాకుకూడా నిన్ను చూడాలని ఉంది……నేనే ఇండియాకు రావచ్చు కాని అలా చేయడంవల్ల చాలా నష్టాలున్నాయి అందుకే నువ్విక్కడికొస్తే బాగుంటుందని ” ఏదో చెప్పబోతున్న సంధ్యను మధ్యలోనే ఆపి “అదేందమ్మా నువ్విక్కడికి రావడంవల్ల నష్టం ఎవరికుంటుంది ?” ప్రశ్నించింది.
“నష్టమంటే నష్టంకాదు కానీ “చెప్పాలా వద్దా అని ఒక్క క్షణం ఆలోచించుకుని మళ్లీ మొదలెట్టింది “బిడ్డ ఇక్కడ పుడితే ఆటోమేటిగ్గా అమెరికన్‌ సిటిజన్‌ షిప్‌ వస్తుంది”
“చిటిజన్‌ చిప్పా అదేంటే ?” అడిగింది లక్ష్మి “చిటిజన్‌ చిప్ప కాదమ్మా సిటిజన్‌ షిప్పు అంటే పుట్టే బిడ్డకు అమెరికా పౌరసత్వం వస్తుంది ”
“నువ్వు పుట్టిన దేశంలో నీబిడ్డ పుట్టకూడదనుకుంటున్నావా ? ” ప్రశ్నించింది. అనుకోని ప్రశ్న ఎదురవడంతో ఒక్క క్షణం తొట్రుపడింది సంధ్య. ఏం మాట్లాడాలో అర్ధంకాక మౌనంగా ఉండిపోయింది.
“ఏంటమ్మా మాట్లాడవు”
“అదికాదమ్మా ఇప్పుడు నేనక్కడికొస్తే ఆ వాతావరణం నాకు సరిపడకపోవచ్చు” సణుగుతున్నట్లు చెప్పింది సంధ్య.
“నువ్వు పుట్టిపెరిగిన వాతావరణం నీకు సరిపడక పోవడమేంది ” అని వెంటనే ” అయినా ఇరవై ఏళ్లపాటు నువ్వున్న వాతావరణం ఇప్పుడు నీకు సరిపడదా ” నవ్వుతూ అడిగింది
“నాన్నున్నాడా? “అడిగింది సంధ్య.
“ఇప్పుడే బయటకు వెళ్లాడు ”
“అమ్మా నీకో విషయం చెప్పడం మరిచిపోయా మా ఆడపడుచు శాంతి వాళ్లు మేముండే దగ్గర్లోనే ఉంటున్నారు ” అని అక్కడ వాళ్ల విషయాలు చెపుతూ ఉంటే ఊ కొడుతూ ఉంది , కానీ మనసులో మాత్రం టాపిక్కు మార్చేసిందేమిటా అని ఆలోచిస్తూ తనే మరలా ప్రస్తావించబోయింది “సరే మళ్ళా ఫోను చేస్తానమ్మా” అని ఫోను పెట్టేసింది సంధ్య.

*****

లక్ష్మి పుట్టి పెరిగింది అదే ఊరు. భర్త కూడ అక్కడే లాయర్‌గా ప్రాక్టీసు చెయ్యడంతో ఎక్కడికీ పెద్దగా వెళ్ళడానికి అవకాశం కలగలేదు. చుట్టాల ఇళ్ళకి వెళ్దామన్నా, వాళ్ళే పదే పదే తమ ఇంటికి వచ్చేవాళ్ళు! ఇక ఆ తర్వాత పిల్లలు, వాళ్ళ చదువులు. మొత్తం మీద సొంత ఊరు తప్ప మరోప్రపంచం తెలియదామెకు. అలాటిది ఒక్కసారిగా విమాన ప్రయాణం, అందులోను అమెరికాకి అనేసరికి ఆమెకి పట్టరాని ఆనందం కలిగింది. భూలోక స్వర్గం అని అందరూ పొగుడుతుంటారుగా, వెళ్ళి చూసొద్దాం అనుకుంది. శేషగిరి రావుని రమ్మని ఎవరూ అడగలేదు, ఆయనా వస్తానని అనలేదు.

*****

చాలాకాలం తరువాత కూతుర్ని చూసిన ఆనందం లో ఆమె నోటమాట రాలేదు, అమ్మాయి లో చాలా మార్పొచ్చింది వేషం , బాష, కట్టు బొట్టు తీరు ఒకటేమిటి అమెరికాకు బయలుదేరినప్పటి సంధ్యకూ ఈ సంధ్యకు మధ్య దూరం రెండు సంవత్సరాల కాలం. కొన్ని యుగాల మార్పు కనిపించింది వాళ్ళమ్మకు.

దారి వెంట దూరం గా అక్కడక్కడ కనిపించే పెద్ద పెద్ద భవనాల గురించి ఏదో చెపుతుంది. కాని అమ్మాయి చెప్పేది కొంచం కొంచమే అర్ధమవుతుందామెకు విరివిగా వాడే ఇంగ్లీషు పదాల వల్ల రోజులు సాగుతున్నయ్‌.
డెలివరీ టైం దగ్గర పడడం తో హాస్పటల్‌ కి వెళ్ళారు.
డెలివరీ అయి అమ్మాయి పుట్టింది, అచ్చుగుద్దినట్లు తల్లిపోలికలతో పుట్టిన మనవరాలిని చూసుకుని మురిసిపోయింది అమ్మమ్మగా మారిన లక్ష్మి.
ఉత్సాహంగా పాపను చూసే బాధ్యత తన మీద వేసుకుంది లక్ష్మి. రాత్రైనా పగలైనా రెండేసి గంటలకు పాపకు పాలు పట్టడం, అన్ని విషయాలు తనే చూడడం.
సంధ్యకు ఆనందం వేసింది. అడక్కుండానే తల్లి పాప బాధ్యతలన్నీ తీసేసుకుంది గనక తను నాలుగో రోజు నుంచే వర్క్‌కు వెళ్ళడం మొదలుపెట్టింది.
నెల రోజులు గడిచాయి. లక్ష్మికి పాపను చూడడం కష్టమై పోతోంది.
నిద్ర లేక కూర్చునే కునుకు తీస్తోంది.
తిండి సహించడం లేదు.
కడుపులో వికారంగా వుంటోంది.
సంధ్య పాప పన్లన్నీ పూర్తిగా తనకు వొదిలేసింది.
సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చాక తల్లి వంట చేస్తుంటే పాపతో కాస్సేపు ఆడుకుంటుంది.
తర్వాత సంధ్యా, ఆమె భర్తా భోంచేస్తుంటే పాప పని తనే చూడాలి.
వాళ్ళు తాపీగా భోంచేసి వాళ్ళ బెడ్‌ రూమ్‌ లోకి వెళ్ళి టీవీ చూస్తుంటే తను పాపను పక్కన పెట్టుకుని ఏదో నాలుగు మెతుకులు తిన్నాననిపించాలి.
లక్ష్మికి ఈ పనుల్తో నీరసం వచ్చేసింది.
ఇలాగే కొన్నాళ్ళు గడిస్తే తను మంచం పట్టేట్లు కనిపిస్తున్నది.
ఇంతకన్నా ఇండియాకి తిరిగి వెళ్తే నన్నా కాస్త విశ్రాంతి దొరుకుతుంది , అక్కడైతే పనివాళ్ళే అన్ని పనులు చేసి పెడతారు.
మర్నాడు సాయంత్రం వాళ్ళు భోంచేసేటప్పుడు కూతురితో అన్నది “అమ్మాయ్‌, ఇంక నేను ఇంటికి వెళ్తాను. నాలుగైదు రోజుల్లో టికెట్‌ దొరుకుతుందేమో చూడమ్మా”
గొల్లున నవ్వారు వాళ్ళిద్దరూ.“ఈ సీజన్లో టికెట్‌ కావాలంటే కనీసం మూడు నెల్ల ముందు బుక్‌ చెయ్యాలి. ఐనా పాపకి నడక వచ్చేవరకన్నా ఉండి వెళ్లమ్మా!” అన్నది సంధ్య.
లక్ష్మి గుండెల్లో రాయి పడింది. మూడు నెలలా? పాపకి నడకంటే ఇంకో ఏడాది పడ్తుందేమో!“అలా కాదమ్మా. నేను వెళ్ళాలి. రోజూ ఇల్లే గుర్తుకొస్తుంది.”
“అలా అంటే ఎలా అమ్మా! నువ్వు పాపని చూసుకుంటావని ఇప్పుడే కొత్త ఉద్యోగంలో కూడ చేరాను. ఐనా ఇక్కడ నీకు లోటేం వచ్చింది?”
మాట్లాడలేక పోయింది లక్ష్మి. గొంతులో ఏదో అడ్డం పడింది. కళ్లలో నీళ్ళు తిరిగాయి. తను ఇప్పుడు ఎంత అస్వతంత్రురాలో అర్థమై మనసంతా ఖాళీ ఐనట్లు అనిపించింది.
మూడు నెలలు అనుకున్నది అలా అలా జరిగి జరిగి ఏడు నెలలయింది. టికెట్‌ దొరక్క కొన్నాళ్ళు, దొరికితే సరైన తోడు దొరకక కొన్నాళ్ళు, సంధ్య పని మీద ప్రయాణాలు వెళ్ళవలసి కొన్నాళ్ళు, ఇలా మొత్తం మీద నిజంగానే పాప పాకడం నుంచి తప్పటడుగులు వేసేటప్పటికి గాని లక్ష్మి ప్రయాణం కుదర్లేదు.
లక్ష్మి బయలు దేరాల్సిన సమయం వొచ్చేసింది. ఒంటరిగా ప్రయాణం … అల్లుడు గారి ఫ్రెండ్స్‌ ఎవరో ఇండియా వెళ్తున్నారని, వాళ్ల తో తిరిగి వెళ్ళొచ్చు ననుకుంటే తీరా వెళ్ళే రోజుకి వాళ్ళకి ఏదో అడ్డం వచ్చి ప్రయాణం మానుకున్నారు!
పాపకి ఒంట్లో బాగాలేదని చివరకు ఎయిర్‌ పోర్ట్‌ కి కూడారాలేదు సంధ్య. అల్లుడు ఎయిర్‌ పోర్టులో విచారించి ఎవరో తెలుగు వాళ్లకు పరిచయంచేసి వెళ్లిపోయాడు.
*****
“నువ్వక్కడ మొత్తం పది నెలల పాటు వుండి వాళ్ళకి సేవలు చేశావు. రోజుకు పది గంటల పని చొప్పున పదినెలలకు గాను నువ్వు దాదాపు మూడు వేల గంటలు పని చేశావు. అక్కడ మినిమమ్‌ వేజ్‌ గంటకు ఆరో ఏడో డాలర్లు వుండాలి. ఆరు వేసుకున్నా పద్దెనిమిది వేల డాలర్లు. దాన్లో నీ ఖర్చులకు రోజుకు ఇరవై డాలర్లు తీసెయ్యి. నీ టికెట్లకి మరో పదిహేనొందలు తీసెయ్యి. మొత్తం ఖర్చు సరిగ్గా ఏడు వేల ఐదొందల డాలర్లు. అది పోతే నీకు కనీసం పన్నెండు వేల ఐదు వందల డాలర్లు వాళ్ళు బాకీ ఉన్నారన్న మాట! సివిల్‌ కేస్‌ ఐతే అంతతో పోతుంది. ఇంకా కావాలంటే మనం వాళ్ళ మీద కిడ్నాప్‌ కేస్‌ పెట్టొచ్చు.”

“మీ చాదస్తం మరీ మితిమీరి పోతున్నదే! నన్ను వాళ్ళు కిడ్నాప్‌ చెయ్యడం ఏమిటి?”
“నీ ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళు నిన్నక్కడ కొంత కాలం వుంచారు కదా! నువ్వే చెప్పావు, పాపకు ఒక నెల దాటాక తిరిగి రావాలని అనిపిస్తున్నదని, అందుకు అమ్మాయి ఒప్పుకోలేదని. అంటే వాళ్ళు నిన్ను నీ ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళింట్లో ఉంచారనే కదా! పైగా నీకు మరో దారి లేదు. నీ అంతట నువ్వు వాళ్ళని ఒదిలేసి రాలేవు. అంటే నీ మీద కంట్రోల్‌ అంతా వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా కిడ్నాపింగ్‌ కిందికే వస్తుంది.”
“మరీ అంత దూరం వద్దులెండి. అమెరికాలో వాళ్ళంతా మనల్ని ఆడిపోసుకుంటారు!”
“వాళ్ళకీ తెలిసిరావాలి మరి తల్లిదండ్రులంటే కూలీ నాలీ లేకుండా పనిచేసి పెట్టే బాండెడ్‌ లేబర్‌ కాదని! ఎవరికి వాళ్ళు మనసుల్ని మభ్య పెట్టుకుంటూ సమస్య లేనట్లు నటిస్తే తీరేది కాదు ఇది. మనలా ఎవరో ఒకరు నిజం బయటకు తెచ్చి కనువిప్పు కలిగించాలి.”
*****

4 comments:

రాధిక said...

ఈ కధ అందరూ చదివేలా ఎక్కదయినా ప్రచురిస్తే బాగుంటుంది.చాలా బాగుంది.ఇది చదివాకా కొంతమందన్నా తాము చేసిన తప్పులు తెలుసుకుంటారు.సాయం చేయడానికి వచ్చిన వాళ్ళు సేవకులు కాదని తెలుసుకోవాలి.

Anonymous said...

chaalaa baagundi. eenadu kaanee andhrajyothi kaanee sunday magzine ki pampandi. ekkuvamandiki reach avutundi

Raj said...

చాలా బాగుంది.

కొత్త పాళీ said...

మీరు అమెరికాలో ఉంటారా?
ఐతే దయచేసి kottapali at yahoo dot com కి ఒక మెయిలు పంపండి