Monday, July 28, 2014

ఎవరో..!!

ఆదివారం.ఇంత మహానగరంలో నేను చూడని తెలుగు సినిమా లేకపోవడం వింతగా వుంది.బోరుకొడుతుంది . చదివేందుకు బుక్స్‌ కూడా ఏమీ లేవు .ఫ్రెండ్స్‌ దగ్గరకెళ్దామంటే అర్ధరాత్రి వరకూ వాళ్ళతోనే గడిపి వచ్చాను కదా, మళ్ళీ పొద్దున్నే తయారైపోతే ఫోజులుకొడతారు .పోనీ హిందీ సినిమా ఏమైనా చూద్దామంటే , పక్కనకూర్చున్న వాళ్ళ హావభావాల్ని చూస్తూ అలాగే మనం యాక్ట్‌ చెయ్యాలే తప్ప మనకి సొంతంగా ఒక్క ముక్క అర్థం కాదు కదా!హైదరాబాద్‌ లో ఉంటే హిందీ ఈజీ గా వచ్చేస్తుందని అందరూ అంటుంటే నిజమే నేమో అనుకునేవాడిని , ఇక్కడికొచ్చి మూడుసంవత్సరాలవుతున్నా ముక్క రాలేదు .

ఎంతాలోచించినా రోజు గడవడమెలానో అంతుపట్టడంలేదు బైక్‌ స్టార్ట్‌ చేశా , అది ఎటువెళ్దామంటే అటువెళ్లడానికి రడీ అయి . ఆదివారంకావడంవల్ల ట్రాఫిక్‌ పెద్దగాలేదు .
ఓ బుక్‌ షాపు ముందు రోడ్‌ మీద సెకండ్‌ హాండ్‌ బుక్స్‌ పెట్టి అమ్ముతున్నారు . బైక్‌ పక్కనే పార్క్‌ చేసి ఓ పదినిముషాలు చూశా మంచి బుక్స్‌ ఏవైనా దొరుకుతాయేమోనని . బోలెడు పుస్తకాలున్నాయి కానీ నాకు నచ్చలేదు . నచ్చలేదంటే బుక్‌ కాదు , స్టాల్‌ వాడు చెప్పే రేటు . ప్రింటెడ్‌ రేటు మీద ఓ 20 శాతం డిస్కౌంట్‌ ఇస్తానంటున్నాడు . ” ఈమాత్రం డిస్కౌంట్‌ కొత్త పుస్తకాల మీదకూడా ఇస్తారు ” అనుకుంటూ ఏమి చేయాలా అని ఆలోచించా వెంటనే గుర్తొచ్చింది . ఓ ఇరవై నిముషాల్లో కోటీ చేరా . నాలాంటి చాలామంది తమక్కావలసిన బుక్స్‌ కోసం రోడ్‌ మీద బారులు తీరి నిలుచుని చూస్తున్నారు . ఓ గంట సుదీర్ఘ అన్వేషణ తరవాత నాకునచ్చిన పుస్తకం నచ్చిన ఖరీదులో దొరికింది . హమ్మయ్యా ఇవ్వాల్టికి ఫుడ్‌ దొరికినట్లే అనుకుని ఆ పుస్తకాన్ని పుచ్చుకుని బయల్దేరా .
మధ్యాహ్నం లంచ్‌ చేసి బుక్‌ తెరిచా . చదువుతూ ఉంటే ఇంటరెస్ట్‌ పెరుగుతుంది . ఓ నలభై పేజీలు చదివిన తరువాత గమనించా పెన్సిల్‌ తో మార్జిన్లో ఎవరివో అక్షరాలు , ముత్యాల కోవల్లా. స్వచ్ఛమైన తెలుగులో మనసును కదిలించేలా రాసివున్నాయా వాక్యాలు . పేపర్‌ బాధపడుతుందేమో అన్నట్లు ఎంతో సున్నితంగా రాసిన వారెవరో!
నవల చదవడం పక్కన పెట్టి పేజీలు తిప్పడం మొదలుపెట్టా. ఎవరు రాశారో అద్భుతంగా ఉన్నాయి ఆవ్యక్తి భావనలు . అలా రాసింది ఎవరో తెలిస్తే ఎంతబాగుంటుందో అన్న ఒక అర్థం లేని ఆలోచన కలిగింది . నా ఆలోచనకి నేనే నవ్వుకుని ఇంకా పేజీలు తిప్పా.
హఠాత్తుగా ఒక చోట కనిపించింది ఒక పేరు “సువర్ణ” అని!
అక్షరాలు చూసినప్పుడే అనుకున్నా అవి రాసింది అమ్మాయే అయి ఉండవచ్చని అంత ఓపిగ్గా, అంత సుకుమారంగా రాసే మగసన్నాసులు ఈ కాలంలో ఎవరున్నారు?
ఏదో పేరున్నంత మాత్రాన ఆ పేరు వాళ్లే అవన్నీ రాసారని నమ్మకమేమిటి? చిన్న సందేహం . ప్రక్క పేజీలోనే ఒక అడ్రస్‌ కూడ కనిపించింది. ఇది ఎవరో కావాలని ఆడుతున్న ఆటలా వుంది. సరే, ఎలాగూ మనకూ ఏమీ పని లేదుగా, ఈ వ్యవహారం ఏమిటో తేల్చుకుందాం అనిపించింది.
మరుక్షణం నాకు ఆ పుస్తకం, దాన్లో ఆమె రాసిన కామెంట్స్‌, ఎంతగానో నచ్చాయనీ , తనతో పరిచయం చేసుకోవాలని వున్నదనీ ఉత్తరం రాయడం మొదలెట్టా .ఎవరో చేస్తున్న ప్రాక్టికల్‌ జోక్‌లో తెలిసి తెలిసీ ఓ బకరా నౌతున్నానా అని ఒక పక్క మనసు పీకుతూనే వుంది. సమాధానం వస్తుందని ఏ మాత్రం ఆశ లేకపోయినా నా ప్రమేయం పెద్దగా లేకుండానే లెటర్‌ పూర్తి కావడం, దాన్ని పోస్ట్‌లో పడెయ్యడం జరిగిపోయాయి.
***************
లెటర్‌ రాసి వారం కావొస్తుంది . ఏ మాత్రం ఆధారం లేని ఆశతో ఎదురుచూస్తున్నా దానికి తప్పకుండా ఏదో ఒక జవాబు వొస్తుందని . ఐతే, అనుకోకుండా రేపే బిజినెస్‌ పని మీద యూరప్‌ వెళ్ళాల్సిందిగా ఆర్డరు జారీ చేసింది మా కంపెనీ . వెళితే తన జవాబును నేను వెంటనే చూడలేను. కానీ వెళ్లక తప్పదు . గుండ్రటి అక్షరాల్తో అడ్రస్‌ రాసి వున్న లెటర్‌ ఏదైనా వస్తే వెంటనే నాకు ఈమెయిల్‌ పంపమని రూమ్‌మేట్‌ని బతిమాలుకుని గుండెనిండా బాధతో గూడు విడిచి బయలుదేరా .
మాన్చెస్టర్‌ చేరిన మూడోరోజు ఫ్రెండ్‌ నుండి ఈమెయిల్‌ వచ్చింది నేను చెప్పిన లాటి లెటర్‌ వచ్చిందని . ఓ ఐడియా తళుక్కున మెరిసి ఆ లెటర్‌ని ఓపెన్‌ చేసి వెంటనే ఫాక్స్‌ చేయమని ఫోను చేశాను నా రూమ్‌మేట్‌కి. అలా, ఎన్నాళ్ళనుంచో ఎదురుచూస్తున్న లెటర్‌ని అందుకున్నా . అవే అక్షరాలు . ఆ పుస్తకంలో రాసింది , ఈ రోజు ఈ లెటర్‌ రాసిందీ ఒకరే .
అలా మా ఉత్తర ప్రత్యుత్తరాలు మొదలయ్యాయి. కలం స్నేహం బలపడింది.
****************
పదమూడునెలల తరువాత మొదటిసారి ఆమెను చూసే భాగ్యం నాకు కలగబోతోంది .
ఇండియాకి బయలుదేరి వస్తున్నానంటే తను ఎయిర్‌పోర్ట్‌కి వస్తానంది . అక్కడ చేతిలో ఎర్ర గులాబీల బొకే పట్టుకుని ఉంటుంది అదీ నేనామెను గుర్తించే విధానం.
ఎయిర్‌పోర్ట్‌ లో చాలామంది ఫ్లవర్‌ బొకేస్‌ తో వస్తారు గనక వాళ్ళలో ఆమెను గురుతుపట్టడం కష్టమవుతుందేమో అని అనుమానం వచ్చింది గాని ఎలాగోలా కనుక్కోగలననే నా నమ్మకం.
లౌంజ్‌ లో నుండి బయటకొస్తూంటే ఎదురైందో అమ్మాయి
సాంప్రదాయానికి అద్దంపట్టేలా నిండుగా చీర కట్టుకున్న ఆ నీలి కళ్ళ పడుచుపిల్ల పెదవులపై చెరగని చిరునవ్వుతో , సిగ్గుతో ఎర్రబడ్డాయేమో అనిపించేలా వున్న చెక్కిళ్లతో, గాలికి రెపరెపలాడుతూ పైకెగురుతున్న నల్లని కురులను సవరించుకుంటూ అమ్మాయంటే ఇలాఉండాలి అనేలా నడిచి వస్తుంటే , లయ బద్ధంగా సంగీతాన్నందిస్తున్న ఆమె గజ్జల సవ్వడి వింటూ నన్ను నేను మరిచిపోయా . పేరుకు తగ్గట్టే బంగారంలా మెరిసిపోతున్నది . కలలోలా నడుస్తూ చిరునవ్వుతో ఆమెని పలకరించబోయేంతలో ఆమె నన్ను చూడకుండా దాటి వెళ్ళి పోతుంటే అప్పుడు గమనించా ఆమె చేతిలో గులాబీలు లేవని!
మరో విషయం కూడ హఠాత్తుగా గమనించా. ఆ ప్రక్కనే చేతిలో గులాబీలతో అక్కడక్కడా తెల్లబడి జీవం లేనట్లున్న కురుల్తో, శ్రద్ధ చూపక పాలిపోయి ముడతలు పడిన ముఖం, కళ్లను బయటికి కనిపించనీయని సోడాబుడ్డి కళ్ళద్దాలు , ఎత్తుపళ్లతో, వున్న ఓ యాభైయేళ్ళావిడ కూర్చుని వుంది. చుట్టు పక్కల ఎర్ర గులాబీలతో మరెవరూ లేరు!
నవ్వొచ్చింది నాకు నా ఊహల్ని, వాటిలోని వైపరీత్యాన్నీ తల్చుకుని. ఇన్ని దేశాలు తిరిగాను, ఇంత ప్రపంచం చూశాను గుండ్రటి అక్షరాలు రాసేవాళ్ళు అందంగా వుండాలని కాని, అందంగా వున్న వాళ్ళ మనసులు అందమైనవి కావాలని కాని లేదు కదా! పైగా, స్టటిస్టికల్‌గా ఆలోచిస్తే, ఇవన్నీ ఒకరిలోనే వుండడానికి అవకాశాలు చాలా తక్కువ. అంతేకాదు, అలాటి వాళ్ళు కొందరున్నా, నాకు పరిచయమైన అమ్మాయి (?) వాళ్ళలో ఒకరై వుండే అవకాశాలు ఇంకా ఎంతో తక్కువ.
ఇలాటి విషయాల్లో ఇన్‌ట్యూషన్‌ బహుశా ఎప్పుడూ కరెక్ట్‌ కాదు!
ఒక్క క్షణంలో అప్పుడేం చెయ్యాలో అర్థమైంది నాకు. మరుక్షణం ఆమెవైపు నడిచా . ఆమెకు దగ్గరగా వెళ్ళి వొంగి ఆమె పాదాలకు నమస్కరించి నా పేరు చెప్పి “మీరేకదా సువర్ణ! ఇన్నాళ్ళకి మిమ్మల్ని కలుసుకోగలిగినందుకు ఈ క్షణంలో నేను పొందుతున్న ఆనందాన్ని మీకెలా చెప్పాలో తెలియడంలేదు , బయలుదేరండి మనం వెళ్తూ మాట్లాడుకుందాం” అన్నా నామెతో.
ఆమె ముఖంలో పట్టరాని సంతోషం మెరిసింది . చిరునవ్వుతో కూడిన స్వరంతో ” ఇంతవరకూ నువ్వేమి చెప్పావో , ఎందుకు చెప్పావో ఒక్క ముక్క కూడా నాకర్థం కాలేదు నాయనా ! నేను అమెరికాలో మా అమ్మాయీ వాళ్ళ దగ్గరకి వెళుతున్నా. ఫ్లైట్‌కి ఇంకా చాలా టైముందట. ఏమీ తోచక ఈ ఫ్లైట్‌ దిగి వచ్చే వాళ్ళని చూద్దామని వచ్చి ఇక్కడ కూర్చుంటే ఆ అమ్మాయెవరో ఒక్క క్షణం ఈ పువ్వులు పట్టుకోండాంటి నేను వెంటనే వస్తానని వెళ్లింది . బహుశా నువ్వు చెప్పిన సువర్ణ ఆమేనేమో ” అన్నదామె.

ఆమె పక్కనే కూర్చుని “సువర్ణ గారి” కోసం నా నిరీక్షణ ప్రారంభించా .  
ఈ కధ తొలి ప్రచురణ www.eemaata.com

14 comments:

కొత్త పాళీ said...

Happy waiting !

Naresh said...

ఆ తర్వాత ఏం జరిగింది ?????!!!!!

శ్రీ said...

హాయ్,అది నేనే.. ఈసారి ఐమ్యాక్స్ దగ్గరికి పచ్చ గులాబీ ల తో.. వచ్చేసేయ్ మరి

karyampudi said...

శ్రీ గారు, నిజంగా అది మీరే ఐతే తప్పకుండా కలుస్తా... :)

వేణు said...

టెన్షన్ పెంచక తరువాత ఏమయ్యిందో త్వరగా చెప్పండి మరి....

వేణు

ఝాన్సీశ్రీనివాస్ said...

శ్రీనివాస్ గారు ఈ కధ మీస్వానుభవమా.....లేక మీకల్పనా....ఏమైన చివరకు
మీరు ఆ అమ్మయీని కలిసారా లేక ఇంగ్లిష్ సినిమాలా మేము రెండొ భాగం కొసం ఎదురు చూడలా.....కథ చాలా బాగుంది.

Rajendra Devarapalli said...

చితక్కొట్టారు సార్,మీ కధ చదువుతుంటే చచ్చి ఏ లోకాన వున్నదో స్టీఫెన్ లీకాక్ కధ ఒకటి గుర్తుకొచ్చింది, కొంప తీసి మీ అసలు పేరు అదేనా ఏంటి

రాజేంద్ర

http://visakhateeraana.blogspot.com/

Srini said...

కథ చాలా బాగుంది. చదువుతున్నంతసేపూ ఉత్కంఠగా ఉండింది. మొత్తానికి చివరికి ఏమయ్యిందో రాయండి, టెన్షన్ తట్టుకోలేక పోతున్నాను. మరలా ఒకసారి యండమూరి వెన్నెల్లో ఆడపిల్ల గుర్తుకు వచ్చింది.

blogger123 said...

This reminds me of a story which i read in my school days called "The test of true love". In that story, herone will give the flowers to the old lady and tell her that if anyone comes to meet her, tell him that she would be waiting for him in some place. narration was good and i think u need to mention the original story name where you took the concept from. Readers can search for this story in google with a title "The test of true love"

karyampudi said...

blogger123 , I dont know that such a story is there, thanks for your information i will read this story now.

Raja Ivaturi said...

Meeru kathalu vrastharani theliyadu. ee katha chalaa bavundi. Kanee ee facebook type premalu manchivi kaavani cheptoo mugisthe bavuntundi :)

Unknown said...

The story is really good vara garu:)

reguvardan said...

బావుంది వ్యాసం చక్కని కొటేషన్లతో. ధన్యవాదాలు
Telugu Cinema News

reguvardan said...

news4andhra -- The Ultimate Source for Entertainment News, Movie Reviews, celebrity Interviews and many more at one place
Latest Telugu Movies Reviews
Telugu Actors Interviews