Tuesday, November 27, 2007

ఏరుదాటాక....

ఈ మధ్య మా మిత్రుడొకాయన ఇండియా వెళ్ళొచ్చాడు , వచ్చినప్పటినుండి ఇండియా గురించి మనమేది మాట్లాడినా అతను దాని గురించి నెగటివ్ గా మాట్లాడ్డం నాకు కోపమూ మరియూ భాధ కలిగించింది - ఆ భాధే నాతో ఈ టపా రాయిస్తుంది.

నిజమే మనదేశం ఇంకా పూర్తిగా అభివృద్ది చెందలేదు ఇప్పుడిప్పుడే అభివృద్ది చెందుతూ ఉంది అలా అని అక్కడి ప్రతి విషయాన్ని అమెరికాతోనో ఆస్ట్రేలియాతోనో పోల్చి ఇండియాలో ఏమీలేదు అనడం ఎంతవరకు సమంజసం.

విదేశాల్లో ఉంటూ ఇండియా వెళ్ళొచ్చే చాలామంది భారతీయులు ఇండియాలో జరిగే ప్రతి చిన్నవిషయాన్నీ భూతద్దంలో చూస్తున్నారు.

ఇక మా మిత్రుని విషయానికొస్తే రెండుసంవత్సరాల క్రితం వరకూ ఆనందంగా తిరిగిన హైదరాబాదు నగరవీధులు ఇప్పుడసలు వీధుల్లానే కనిపంచడంలేదట " అసలు అవి రోడ్లేనా దుమ్మూ , ధూళి, పొగ తప్ప ఏముందక్కడ ?"అనేది ఈయనగారి ప్రశ్న - ఎవరైనా ఏమి సమాధానం చెప్పగలరు ఇతనికి బాగా ఎక్కువైంది అని మనసులో అనుకోవడం తప్ప.

ఇండియాలో ఏముంది దోమలు తప్ప అని అతనంటే నాకు కోపం రావడం లో తప్పు లేదు కదా? , మరి ఆ దోమలతోనే కదా ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా సహజీవనం సాగించాం ఏదో ఒకవిధంగా దోమలను తప్పించుకునో లేదంటే వాటిచేత కుట్టించుకునో అక్కడే బ్రతికాం కదా , రెండు సంవత్సరాలు బయట ఉండి ఇప్పుడు వెళ్ళి దోమల దెబ్బకి బతకలేక పోయాడంట అందుకే నాలుగు వారాలు ఉందామని వెళ్ళిరెండు వారాలకే తిరిగొచ్చాడట.


ఈయనగారికింకో పెద్ద కష్టమొచ్చి పడింది అదేమంటే ఇండియన్ న్యూస్ చానల్స్ లో వచ్చే ఇంగ్లీషు ఇతనికి అర్ధం కావడంలేదట....విన్నవాళ్ళకు నవ్వు , నవ్వుతో పాటు కోపం రాక ఏమవుతుంది చెప్పండి , రెండేళ్ళు అమెరికాలో ఉన్నంత మాత్రాన అక్కడి ఇంగ్లీషు అర్ధం కాకపోతే ఇంకో రెండేళ్ళుంటే బహుశా కని పెంచిన తల్లిదండ్రులను విధ్యా బుద్దులు నేర్పించిన గురువులను కూడా గుర్తుపట్టలేరేమో ఇలాంటి ప్రబుద్దులు.

(ఇలాంటి వాళ్ళు మనకు తరచూ ఎదురవుతూనే ఉంటారు ....వీళ్ళతో కొంచం జాగ్రత్త సుమా!! )

Thursday, November 22, 2007

తలరాత

"ఫోను రింగవుతుంటే వినిపించడంలేదా.....వెల్లి లిఫ్ట్ చెయ్యోచ్చు గా..."పక్కనే కూర్చుని టీ వీ చూస్తున్న కిరణ్ నుద్దేసించి పెంకులెగిరిపోయేలా అరిచింది శాంతి

పేరు చూసి మోసపోయి చేసుకున్నానురా భగవంతుడా అనుకుంటూ సీరియస్ గా ఓ చూపు చూసి మెల్లగా లేచి ఫోను అందుకున్నాడు

అవతలివైపునుండి ఏమిచెప్పారోగాని ఫోను పెట్టేసి ఓ పెద్ద వెర్రికేక పెట్టి,కల్లు తాగిన కోతిలా....... ఆహో ...ఓహో.... అంటూ కుప్పిగంతులేయడం మొదలుపెట్టాడు కిరణ్.

శాంతి మొదట్లో శాంతం గానే అడిగింది విషయమేమిటని....

వెర్రి చూపులు....పిచ్చిగంతులు....మానకపోగా.....శాంతిని పట్టుకుని గిర గిరా తిప్పుతూ.......తన గార్ధవ స్వరంతో పాటలు పాడడం మొదలెట్టాడు......

శాంతికి ఓపిక నసించించింది , ఇక లాభంలేదని పక్కనే ఉన్న చీపురు కట్ట పుచ్చుకోవడంతో దారిలోకొచ్చాడు
"నాకు ఉత్తమ రచయిత అవార్డోచ్చిందోచ్........." పెద్దగా అరిచాడు కిరణ్, కుప్పిగెంతులు మాత్రం మానలేదు
షాక్ నుండి తేరుకోవడానికి కొంచం టైం పట్టింది శాంతికి......
ఒక్క సారి గెంతులాపి "చూశావా......విన్న నీకే అంత ఆశ్చర్యం కగిలితే అవార్డొచ్చిన నేనేమై పోవాలి చెప్పు....ఈ ఆనంద సమయంలో నీకేమి కావాలో కోరుకో వెంటనే తీరుస్తా" వరమిచ్చాడు కిరణ్
"నాకేమి వద్దు గాని ఒక్కసారి ఫోను చేసి కనుక్కోండి, మరెవరికో చేయ బోయి మీకు చేసుంటారు ఆ ఫోను..."
"అదీ నిజమే సుమా........" ఆలోచనలో పడ్డాడు....

మల్లీ ఫోను రింగవడంతో ఎందుకైనా మంచిదని ఈసారి శాంతి ఫోనందుకుంది
అవతలి వైపునుండి ప్రొడ్యూసర్ పానకాలరావ్ మాట్లాడుతున్నాననడంతో శాంతి కి విషయం అర్ధమయింది...వెంటనే రిసీవర్ భర్త చేతికిచ్చి...ఆలోచనలో పడింది


***********

సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం .... పెళ్ళయ్యి మూడునెలలైంది.... కొత్తకాపురం.... ఇద్దరూ ఉదయం తొమ్మిది గంటలకు ఆఫీసు కెళ్ళడం, సాయంత్రం ఏడు గంటల కల్లా ఇల్లు చేరడం టీ వీ ముందు కూర్చుని వొచ్చే చెత్త సీరియల్స్ అన్నీ ఓపిగ్గాచూడడం , ఒకవేళ ఎవరైనా రావడం లేటైతే రెండోవ్యక్తి జరిగిన స్టొరీ ని కళ్ళకు కట్టినట్లు చెప్పడం.....మొదట్లో శాంతి యాడ్స్ చూస్తూ "మీరు వంట చేయొచ్చు కదా " అని ముఖమదోలా పెట్టి ప్రాధేయ పడినట్లు అడిగేది, దాని తో ఉబ్బి పోయిన కిరణ్ ఎగేసుకెల్లి యాడ్స్ అయిపోయే టప్పటికి వంట పూర్తి చేసొచ్చి మళ్ళీ సీరియల్ చూసేవాడు,ఏమాట కామాటే చెప్పాలి శాంతి కంటే కిరణ్ వంట చాలా బాగా చేస్తాడు, తరువాత మెల్ల మెల్లగా అది అతని నిత్య కృత్యమైంది, కాదు కూడదంటే ఇంత కట్నం ఇచ్చి నిన్ను చేసుకుంది వంట చేయడానికి కాదు వంట చేస్తావా చెయ్యవా అంటూ ఇంటి పెంకులెగిరేలా విరుచుకు పడడం మొదలెట్టేది శాంతి... నిజమేకదా కట్నం తీసుకుని పెళ్ళి చేసుకున్నందుకు ఇలాంటివన్నీ సర్దుకుపోవాలేమో అని వంట విషయంలో రాజీపడి పోయాడు.
ఓరోజు ఆఫీసులో పనేమి లేకపోవడంతో ఎంతకీ తరగని టీవీ సీరియల్స్ గురించి ఆలోచనలో పడ్డాడు కిరణ్, ఒక్కోటి రెండు మూడు సంవత్సరాలుగా వస్తూనే ఉంది, ఏరోజు కారోజు అయిపోయినట్లే ఉంటుంది కానీ అయిపోదు........ఎంత నమిలినా తరగని చూయింగ్ గం లా చూసే కొద్దీ వస్తూనే ఉంటుంది ,అర్ధ గంట టైంలో ఇరవై ఐదు నిముషాలు వ్యాపార ప్రకటనలు మిగిలిన ఐదు నిముషాలు కథ......కొత్తదనమేమైనా ఉందా అంటే అదీ లేదు .... పాతకథనే పేరు మార్చి కొత్త వాల్లతో తీస్తున్నారు "ఈ మాత్రం కథలు మనం రాయలేమా ? " తనకు తాను ప్రశ్నించుకున్నాడు
ఒక్కసారిగా ముఖంలో చెప్పలేనంత వెలుగొచ్చింది, ఎలా అయినా సరే ఓ కథ రాయాలి అని నిర్ణయించుకున్నాడు
తన రొట్టె విరిగి నేతిలో పడినట్లు రెండు రోజుల తరువాత పేపర్లో తాము తీయబోయే డైలీ సీరియల్ కు కొత్త రకం కథలు కావాలంటూ ఓ ప్రముఖ టెలీ ఫిల్మ్ వాళ్ళు ఇచ్చిన ప్రకటన చూడగానే ఎగిరిగంతెసినంత పనిచేసి, ఆలోచనలో పడ్డాడు....కథ అంటే ఏమి రాయాలి.....? తనను తాను ప్రశ్నించుకుని ఒక్క ఉదుటన లేచి బయలుదేరాడు....
ఆవారంలో వచ్చిన వార పత్రికలన్నీ కొని ఇల్లుచేరాడు,

ఎప్పుడైనా ఏదైనా పత్రిక కొందామండి అంటే , హాయిగా టీవీ లో వొచ్చే ప్రోగ్రాం లు చూడక ఎందుకా పిచ్చి పత్రికలు అనే కిరణ్ ఒక్కసారిగా బండెడు పుస్తకాలు తీసుకురావడంతో విషయమేమిటని అడిగింది శాంతి, తను చేయ బోతున్న ఘన కార్యం ఒక్క ముక్కలో చెప్పాడు.....

మొదట ఆశ్చర్యం వేసినా.....మంచి పని చేయ బోతున్నందుకు సహకారాన్నందిస్తానని హామీ ఇచ్చింది, "సరే నేనడిగేదానికి ఒప్పుకుంటావా ? " భయం భయం గా అడిగాడు కిరణ్ "చెప్పు ...... " ఏమడగ బోతున్నాడా అని ఆలోచిస్తూ అడిగింది శాంతిదొరికిందే సందనుకుని "నన్ను వంట చేయమనకపోతే నాకదే పదివేలు "చెప్పి అవతలివైపు నుండి ఏవిధమైన సమాధానం వస్తుందాని ఆలోచిస్తూ శాంతి వైపు చూశాడు"ఓసింతేనా......మీరు కథ రాయడం అయి పోయే వరకు వంట నేనే చేస్తా సరేనా..."తెలివిగా చెప్పింది శాంతి

హమ్మయ్యా కొన్ని రోజులు ఈ వంట చేసే బాధ తప్పిందని మనసులో సంతోష పడ్డాడు కిరణ్
పుస్తకాలన్నీ ఎడా పెడా చదివేసి ఓ అవగాహనకొచ్చాడు.....పెన్ను పేపరు తీసుకుని....ఒక్కసారి దేవున్ని ప్రార్దించి అంతా నీదే భారమని మొదలెట్టాడు..


ఒక్క రోజులో ఆరు పేజీల కథ పూర్తి చేసి పోస్ట్ బాక్స్ లో పడేసి చేతులు దులుపుకున్నాడు......
పదిహేను రోజుల తరువాత ప్రొడ్యూసర్ దగ్గరనుండి ఫోను రావడంతో ఇక నేల మీద నడవడం కష్టమైంది......
**************
స్టోరీ డిస్కషన్స్ లో కూర్చున్నాడు కిరణ్ , పక్కనే ప్రొడ్యూసర్ పరమేశ్వరం , రైటర్ రామ్మూర్తి , డైరెక్టర్ దివాకర్, ఇంకా యూనిట్ వాళ్ళు వాళ్ళకు కొంచెం దూరంగా శాంతి కూర్చున్నారు.

శాంతికి సినిమాలన్నా టీవీ అన్నా మహాపిచ్చి , స్టోరీ డిస్కషన్స్ అనగానే కిరణ్ కన్నా ముందు రెడీ అయి కూర్చుంది నేనూ వస్తానని.....తెలిసి తెలిసి రోకట్లో తల దూర్చడం ఇష్టం లేక సరే రా..... అని వెంట తీసుకెళ్ళాడు..........

దివాకర్ నోరు తెరిచాడు... ' తలరాత ' టైటిల్ అదిరింది , ఈ టైపు టైటిల్సే ఇప్పుడు కావాల్సింది...వినగానే ఇదేదో కష్టాల కథ అయి ఉంటుందని ఆడవాళ్ళు టీవి ముందునుండి లెగవరు....దనితో ఇక చచ్చినట్టు ఇంట్లో అందరూ చూడాల్సిందే....

ఇంకా ఏదో చెప్పబోతున్న దివాకర్ మాటల కడ్డుతగిలి "అందుకే చాలా ఆలోచించి ఈ టైటిల్ పెట్టా " కొంచెం గర్వపడుతూ చెప్పాడు...

"ఇంతకీ తమరు రాసిన కతేంటో " వెటకారంగా ప్రశ్నించాడు రామ్మూర్తి
అదేదో టివీలో వచ్చే ప్రొగ్రాములా అవాక్కయ్యాడు కిరణ్ , స్టోరీ తెలియకుండానే కూర్చున్నారా వీల్లంతా..? తనకు తాను ప్రశ్నించుకున్నాడు

"కిరణ్ గారూ మేరేమాలోచిస్తున్నారో నాకర్ధమైంది.....విషయమేమిటంటే ఇక్కడున్నోల్లెవ్వరూ మీ కథ చదవలేదండీ...."చావుకబురు చల్లగా చెప్పాడు దివాకర్

"ఏంటి ఎవరూ చదవకుండానే నాకథ సీరియల్గా తీయడానికి ఎలా సెలెక్టయింది...." వెర్రి చూపులు చూస్తూ అడిగాడు
"దీంట్లో నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరమేమీలేదు, మేమిచ్చిన ప్రకటన చూసి ఇప్పుడే బలపంపట్టిన పిల్లోడి దగ్గరనుండి అందరూ తెగరాసేసి మాముఖాన కొట్టారు....చదివితే చదవండి లేకపోతే చావండని, ఇలా అయితే లాభం లేదని మేమందరం కూర్చుని ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చి లాటరీ తీశాం అదృష్టం బాగున్నోడికి చాన్సు తగిలిద్దని......నీ అదృష్టం బాగుంది నీకథ బైటికోచ్చింది....." విషయాన్ని వివరంగా చెప్పాడు పరమేశ్వరం
విని గుడ్లు తేలేశాడు, "నువ్వు తరువాత ఆశ్చర్యపోదువు గానీ ముందు నీ కథేమిటొ చెప్పు " అడిగాడు దివాకర్
తలరాత బాగుంటే ఏమైనా చేయగలం లేదంటే ఏమి చేసినా లాభం వుండదు అనేది ఈ కథలో నీతి...

"ఏంటి ఈ కథలో నీతి కూడా ఉందేటి....." చేతులోని కథకు సంబంధించిన పేపర్లు చూస్తూ, వెటకారంగా అడిగాడు రామ్మూర్తి

అవునన్నట్లు సీరియస్ గా ఓ చూపు చూసి మళ్ళీ మొదలెట్టాడు కిరణ్...

ప్రసాద్ తన ఆస్తులన్నీ అమ్మి ఓ చిన్న వ్యాపారం పెడతాడు , మొదట్లో తలరాత బాగుండి బాగా సంపాయిస్తాడు , తరువాత వర్మ అనే వేరే వ్యక్తి కూడా అదే వ్యాపారంపెట్టి తనకున్న సమర్ధతతో ప్రసాద్ కస్టమర్లందరిని తన వైపు లాక్కుంటాడు , దానితో ప్రసాద్ ఫ్యాక్టరీ నడిపేందుకు అప్పులు చేయాల్సొస్తుంది ఆ అప్పులు తీర్చలేక ఉన్న ఆస్తులన్నీ అమ్మి రోడ్డున పడతాడు.... ఇదీ క్లుప్తం గా కథ అనగానే

"ఇంతకీ వాళ్ళు చేసే వ్యాపారమేంటో ..." ముఖమదోలా పెట్టి అడిగాడు దివాకర్
"అదే సస్పెన్స్.....ఏమైనా కావొచ్చు...." చాలా సింపుల్ గా చెప్పాడు
"అంటే మనమిప్పుడు ఈ కథని దగ్గర దగ్గర మూడొందల ఎపిసోడ్ల సీరియల్ తీయాలి " పరమేశ్వరం అనగానే మళ్ళీ ఆశ్చర్యపోయాడు కిరణ్


"మూడొందల ఎపిసోడ్లా...?" పెద్దగా అరిచాడు

"నువ్వేందయ్యా బాబు ప్రతి విషయానికి ఆశ్చర్యపోతావు...ఫీల్డ్ కి కొత్తా ఏంటి..." ప్రశ్నించాడు రామ్మూర్తి
"ఇదే నా మొదటి కథ..." మెల్లగా చెప్పాడు

"అదీ సంగతి......." అంతా అర్ధమైనట్లు ముఖం పెట్టి మళ్ళీ మొదలెట్టాడు రామ్మూర్తి "నీకు అసలు విషయం తెలియదు మేము మూడుసంవత్సరాలకు పైగా టెలీకాస్ట్ చేసిన వింతరాగాలు కథ మొదట్లో రెండు పేజీలే దాన్ని మొదట ఓ పదమూడు ఎపిసోడ్ల సీరియల్ గా తీశాం, జనం విరగబడి చూస్తుండడంతో వాళ్ళనెందుకు నిరుత్సాహ పరచాలి అని దాన్ని లాగీ లాగీ ఇక లాగలేక వదిలేశాం.........

దీన్ని మూడొందల భాగాలు చేయడం పెద్ద కష్టమైన పనేమీ కాదు, ప్రసాద్ ఫ్యామిలి గురించి, వర్మ ఫ్యామిలి గురించి ఓ 50 ఎపిసోడ్లు,

తరువాత కాలేజిలో వీల్లిద్దరికి జరిగిన గొడవ......దీన్ని చెప్పడానికి ఓ 50 ఎపిసోడ్లు,
వీల్ల పెళ్ళిళ్ళు పిల్లలు ఇంకో 50 ,

తరువాత బిజినెస్ అని ఓ 50 ఎపిసోడ్లు సాగతేస్తే మొత్తం ఓ రెండొందలవుతాయి
ప్రసాద్ కొడుకు తో వర్మ కూతురి పరిచయం ప్రేమ పెళ్ళీ వీల్ల పిల్లలు ఓ 100 ఈజీ గా మూడొందలవుతున్నాయ్ , ఇకపోతే పాత్రల విషయానికొస్తే సింపుల్ గా ఓ అరవై డెబ్బై మందైతే సరిపోతుంది........ఇకపోతే స్క్రీన్ ప్లే.... అది మనమింతవరకు ఏ సీరియల్ కూ రాయలేదు కనుక కొత్తగా దాన్ని గురించి ఆలోచించనవసరం లేదు......"

అనగానే అంతా చప్పట్లు కొట్టారు, చప్పట్లు కొట్టకపోతే అలా చెప్పుకుంటూ పోతాడన్న సంగతి అక్కడున్న అందరికీ తెలుసు ఒక్క కిరణ్కి తప్ప, కిరణ్కి మాత్రం ఏమి అర్ధమవలేదు నేను రాసిందాంట్లో ఇంతుందాని ఆలోచిస్తూ కూర్చున్నాడు ఏమీ మాట్లాడకుండా

"ఏమంటావ్ " ప్రొడ్యూసర్ భుజం మీద చేయ్యి వేసి అడగడంతో ఈలోకాని కొచ్చాడు కిరణ్
"నేననేదేముంది.......మరీ అంత పెద్ద సీరియల్ తీయడం కష్టమవుతుందెమో " ఎక్కడో ఆలోచిస్తూ తన సందేహాన్ని వెలిబుచ్చాడు

"ఆ అదీ నిజమే చివరకొచ్చేటప్పటికి మాకూ బోరుకొడుతుంది, అయినా కెమారాలు ఇక షూట్ చేయలేమనుకున్నప్పుడు మొదట్లో వొచ్చిన ఎపిసోడ్ల నుంచి కొన్ని బిట్లు తీసి మాకు కావాల్సిన విధంగా డబ్బింగు చెప్పిస్తాం...అదే టెలికాస్ట్ చేస్తాం.....ఆ సీనెప్పుడో చూసినట్టుంటుందే గాని ప్రేక్షకులు గుర్తుపట్టలేరు.....ఆవిధంగా మేం మేనేజ్ చేస్తాం అన్నమాట " చెప్పాడు దివాకర్

కిరణ్ కి విషయం అర్ధమయింది, ఇంకా ఇక్కడే ఉంటే ఇలాంటి బాంబులు చాలానే పేలేలాఉన్నాయ్ ఇక్కడనుండి నిష్క్రమించడం మంచిదనే నిర్ణయానికొచ్చి "ఇంతకీ నేనేమి చేయాలి...." అమాయకంగా అడిగాడు కిరణ్
"ఏదైనా అవసరమైతే మేమే పిలుస్తాం , ప్రస్తుతానికి అకౌంటెంట్ ని కలిసి నీకురావాల్సినవి తీసుకుని....." ఇంకా ఏదో చెప్తున్న పరమేశ్వరం మాటల కడ్డు తగులుతూ "సరే నాకు రావాల్సినవి తీసుకుని నే వెళ్ళిపోతా అంటూ శాంతి వైపు చూశాడు, ఇంట్లో ప్రతి చిన్న విషయానికి పిచ్చి పిచ్చిగా రంకెలు పెట్టే శాంతి ఇక్కడింత జరుగుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం కిరణ్ కి జీర్ణించుకోలేని విషయంగా తయారైంది, బయటకు నడుస్తూ అదే విషయాన్నడిగాడు శాంతిని

"ఎక్కడెలా ఉండాలో నాకుతెలుసండి....ఇప్పుడిక్కడ నేను నోరు తెరిస్తే ఇంతమంది ముందు మీ పరువు గంగలో కలిసి పోతుంది అందుకే ఎప్పుడూ భర్త పక్కన ఇలాంటి చోటికొచ్చిన ఇల్లాలు మౌనంగా కుర్చుంటదే గానీ ఏమీ మాట్లాడదు.....మీరెప్పుడూ టీవీ లో చూడలేదనుకుంట మీటింగ్ కి భర్తతో వచ్చినప్పుడెవరైనా ఏమైనా మాట్లాడడం చూశారా.....?"చివరగా వేసిన ప్రశ్నలో నిజముందనిపించింది కిరణ్కు అయినా అనవసరంగా ఇప్పుడు దీన్ని కదిలించాన్రా బాబు అనుకుంటూ స్కూటర్ స్టార్ట్ చేశాడు
తరువాత అప్పుడప్పుడు షూటింగ్ జరిగే ప్లేసుకెల్లి ఏమి జరుగుతుందో చూడడం తప్ప ఏమిజరుగుతుందని ఎప్పుడూ ఎవరినీ అడగలేదు

మూడొందలని మొదలుపెట్టిన సీరియల్ ఐదొందలు దాటింది , వస్తున్నన్ని రోజులు జనం ఎప్పుడైపోతుంది రా బాబూ అనుకుంటూ వేరే గత్యంతరంలేక యాడ్స్ మధ్యలో అప్పుడప్పుడూ వొస్తున్న కథను మాతలరాత అనుకుంటూ చూశారు....


******************

మరుసటి రోజు పేపర్లో తాటికాయంత అక్షరాలతో అవార్డు విషయం రావడంతో ఉన్న ఫలంగా కిరణ్ డిమాండ్ పెరిగింది, నిర్మాతలు...డైరెక్టర్లు... ఒకరి తరువాత ఒకరు మాకు కథ రాయమంటే మాకు కథ రాయమని ఫోనుల మీద ఫోనులు చేయడం మొదలెట్టారు.

కథలు రాయకూడదన్న తన నిర్ణయానికి తిలోదకాలిచ్చి , మళ్ళీ కలం పట్టి భగవంతున్ని ప్రార్ధించాడు......స్వామీ నేను మళ్ళీ కలంపట్టేనంటే ఇందులో నాతప్పేమి లేదు , నాతలరాత బాగుండి నేను సంపాయించుకునే మహత్తరమైన అవకాశం వొచ్చింది ఈఅవకాశాన్నొదులుకోలేక ఇలా జనం మీద నాకలంతో దండయాత్ర మొదలెట్టాను ఇక జనాల తలరాతను నువ్వే నిర్ణయించాలి....


**************
ఈ కధ తొలి ప్రచురణ 2002 సంవత్సరం ఆంధ్రభూమి వారపత్రిక .

Friday, November 16, 2007

జాబిల్లి - అంటే?

ఈ మధ్య నా బుర్రలో ఓ పురుగు తెగ తిరిగేస్తుంది తొందరగా ఆ పురుగును తీసి పారేయక పోతే ఎప్పుడో మంచి సమయం చూసుకుని చటుక్కున నాబుర్రలో ఉన్న (ఉందనుకుంటున్న) చిటికెడు గుజ్జు గుటుక్కుమని పిస్తుందేమో అని భయమేస్తుంది.

  • చందమామ రావే... జాబిల్లి రావే కొండెక్కిరావే గోగుపూలు తేవే....
  • జాబిలి కి వెన్నెలకీ పుట్టిన పున్నమివే....
  • జాము రాతిరి జాబిలమ్మా జోలపాడనా ఇలా....
  • జాబిలమ్మ నీకు అంతకొపమా......

ఇలా మన తెలుగులో బోలెడు పాటలున్నాయి చందమామ...జాబిల్లి....వెన్నెల అంటూ, నాకు చందమామ అంటే ఏమిటో తెలుసు..... వెన్నెల అంటే ఏమిటో తెలుసు(తెలుసు అని నేననుకుంటున్నాను సుమా) మరి ఈ జాబిల్లి (జాబిలి) అంటే ఏంటి అనేదే నాబుర్రలో తెగ తెగతిరిగేస్తున్న పురుగు.

జాబిల్లి అంటే ఏమిటి, చందమామకీ జాబిల్లి కీ సంబందము / తేడా చెప్పగలరా?

మీలో కొందరనుకోవచ్చు దీనికోసమా ఇంత హైరానా పడిపోతున్నాడు అని కానీ తెలియని విషయం తెలుసుకోవాలనుకోవడం తప్పుకాదు కదా?