Monday, December 31, 2007

నూతన సంవత్సర శుభాకాంక్షలు !!!

నూతన సంవత్సర శుభాకాంక్షలు ..... !!!

Thursday, December 27, 2007

సర్వం స్వార్ధమయం !!


బంగారు బొమ్మ రావేమే … పందిట్లొ పెళ్ళి జరిగేనే …సన్నాయి మేళగాళ్ళు అద్బుతంగా వాయిస్తున్నారు అమ్మాయి దోసిట్లో కొబ్బరి బోండాం తో తలవొంచుకుని మెల్లగా అడుగులో అడుగువేసుకుంటూ నడుస్తుంటే అమ్మాయికిరువైపులా ఇద్దరు మ్తుౖతెదువులు నడుస్తున్నారు.

“అమ్మాయిని కొంచం తల ఎత్తమనండమ్మా ” కెమారా లెన్సు అడ్జస్ట్‌చేసుకుంటూ అడిగాడో ఫోటోగ్రాఫర్‌పక్కన నడుస్తున్నావిడతో.ఈ మాటకోసమే ఎదురుచూస్తున్నట్లు వెంటనే అమ్మాయి తల కాస్త పైకెత్తి నడక వేగం తగ్గించింది. దగ్గరగా ఉన్న టీవీలో రాకుమారిలా నడుస్తున్న పెళ్లి కూతురు వందనను, ఆమె మొహంలో ఆనందాన్ని రెప్పవేయకుండా చూస్తూవున్నాడు వర్మ


************


“ఇలా ఎంతసేపని నాకళ్ళల్లోకి చూస్తూ ఉంటావ్‌”
“తెలియదు ” చూపు మరల్చకుండా సమాధానమిచ్చాడు వర్మ.
“అబ్బ ఈ టైపు డైలాగులు సినిమాల్లో చూసీ చూసీ బోరుకొట్టిందిగాని వేరె ఏదైనా చెప్పు ” నవ్వుతూ అంది వందన.
“నిజమే సినిమాల్లో అలా చెపుతుంటే వీడెవడురా బాబు పిచ్చోడిలా ఉన్నాడు అనుకునేవాడిని నేనుకూడా కానీ సినిమాల్లో చెప్పేది నిజమేనని ఇప్పుడు తెలుస్తుంది ”
“ఇక చాలుగానీ టాపిక్‌ మార్చు …” అని, ఒక్క క్షణమాగి,”ఇంతకీ ఎంతవరకొచ్చింది నీ అమెరికా ప్రయాణం ” అడిగింది వందన.“అమెరికా ప్రయాణమా?!”
“అవును, అక్కడ మీ అన్నయ్య ఉన్నాడు కదా ”
“ఉంటే ?!”
” నువ్వు మీ అన్నయ్య ద్వారా ట్రై చేస్తున్నావని తెలిసి ”
” అబ్బే అదేం లేదే ? ”
” ట్రై చేయడం లేదా లేక నీకు వెళ్ళాలని లేదా ? ”
” వెళ్ళాలను కుంటే సరిపోతుందా, అవకాశం రావాలికదా ? ”
” అవకాశం దానంతటదిరాదుకదా ” అంది వందన కాస్త దీర్ఘం తీస్తూ
” ఆవిషయం నాకూ తెలుసు ”
” మరి మీ అన్నయ్యనడగొచ్చుకదా ?”
” నీకింతకుముందే ఒకసారి చెప్పినట్లు గుర్తు , టాలెంటు లక్కూ ఉండి ఈరెంటికీ పరిస్థితులు కలిసొస్తే ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళగలరు. అంతేగానీ మా అన్నయ్య ఉన్నాడు మీ అక్కయ్య ఉంది వాళ్ళే ఏదో చేసి తీసుకెళ్త్తారులే అనుకుంటే పప్పులో కాలేసినట్లే” అంటూ వందన వైపు చూశాడు. ఆమె వర్మ చెప్పేది వినిపించుకోకుండా, ప్రక్కకు చూస్తోంది.

” ఏంటి నా పాటికి నేనేదో చెప్పుకుంటూ పోతుంటే నువ్వెక్కడో ఆలోచిస్తున్నావ్‌ ?”
” ఏమీ లేదు , నా క్లాస్‌ మేట్స్‌ , ఫ్రెండ్సూ అందరూ అమెరికాలోనే ఉన్నారు. వాళ్ళు నేనుకూడా అక్కడికెళ్తే బాగుంటుందంటున్నారు ”
” నిజమే ఫ్రెండ్స్‌ అందరూ ఒక చోట ఉండాలనుకోవడం సహజం. పోనీ నువ్వు వాళ్ళనే అడగ కూడదూ నీకో నాకో వీసా ఇప్పిస్తారేమో” నవ్వుతూ అన్నాడు వర్మ.“అంతేకానీ నువ్వే మాత్రం ట్రయ్‌చేయవన్నమాట ” సీరియస్‌ గానే అంది వందన.” అలా అని నేననలేదుకదా అవకాశం కోసం ఎదురుచూస్తున్నా అంతే ”“కన్సల్టెంట్ల ద్వారా ఎంతమంది వెళ్ళడంలేదు , నువ్వూ అలా ఎందుకెెళ్ళకూడదు”

“వెళ్ళొచ్చు , కానీ అలా వెళ్లడంవల్ల లాభం ఏంటి ? ఇక్కడకూడా నేను బాగానే సంపాయిస్తూన్నా , ఉన్న ఉద్యోగాన్ని , కన్న తల్లి దండ్రుల్ని వదిలి ఎక్కడికో వెళ్ళి ఉద్యోగం కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఏమొచ్చిందిప్పుడు? ”

“ఎక్కడ పనిచేస్తున్నాం ఎంత సంపాయిస్తున్నాం అన్నది కాదు సమస్య అమెరికాలో ఉన్నామా? లేదా ? ”

“సరే నీతో వాదించడం నాకిష్టంలేదు ఉన్నదాన్నొదులుకుని ఎక్కడికో వెళ్ళి ఏ పనిబడితే అదిచేయడం నాకు చేతకానిపని ” చెపుతున్న వర్మ మాటలకడ్డుతగులుతూ“నీ ధ్యాస నీదేకానీ ఇవతల వాళ్ళు ఎందుకు చెపుతున్నారో ఆలోచించవా ?”

“ఏమాలోచించాలి నీ ఫ్రెండ్స్‌ అమెరికాలో ఉన్నారు నువ్వు కావాలనుకుంటే, మీనాన్న నీకు అమెరికా మొగుడ్ని తేగలడు ” కొంచెం చిరాగ్గా అన్నాడు వర్మ“అంత కోపం తెచ్చుకోకు వరూ…సరే ఆ టాపిక్‌ వదిలేసి ఇక బయల్దేరదామా?”అంది వందన, కూర్చున్న చోటు లోంచి లేస్తూ.


********


కన్యాదాన కార్యక్రమం మొదలయింది వర్మ ముఖం కళావిహీనంగా ఉందిప్రక్కనున్న మిత్రులు జోకులు పేలుస్తున్నారు అవన్నీ తనగురించే అని తెలిసీ ఏమీ చేయలేక మాట్లాడకుండా కూర్చున్నాడు ,‘ రానంటున్నా బలవంతంగా పెళ్ళికి లాక్కొచ్చి నన్నో అయిటం గాడిని చేసి ఎంజాయ్‌చేస్తున్నారు ‘ మనసులో పెళ్ళికొచ్చినందుకు తిట్టుకుంటూ జరిగే తతంగాన్ని చూస్తూ ఫ్రెండ్స్‌తనపై పేల్చుతున్న జోకులువింటూ కూర్చున్నాడు
ఆలోచిస్తుంటే ఒకరకంగా ఈ అవకాశం తనే వాళ్ళకిచ్చాడేమో అనిపిస్తుంది ఆఫీసులో పనిచేసే కొలీగ్ని ప్రేమించడమే తాను చేసిన మొదటి తప్పు , కాక మరేంటి సిటీలో ఏ బస్‌స్టాపు దగ్గరనిలుచున్నా గంటకు వందమందికి పైగా కనిపిస్తారు వాళ్ళల్లో ఒకరిని సెలక్ట్‌చేసుకోక ఆఫీసులో ఉన్న పదిమందిలో ఒకరిని ఎంచుకుంటే ఇలానే ఉంటుంది కాకమరేంటి ఉదయంనుండి సాయంత్రంవరకు మనకళ్ళముందే ఉంటుంది , మంచిగా మాట్లాడుతుంది ఆదర్శాలు వల్లిస్తుంది కదాని, మంచమ్మాయే అనుకుని ఎంత పొరపాటు చేశాడో నిదానంగా తెలుసుకున్నాడు. విషయం తెలుసుకునేటప్పటికి మనసు కంట్రోలు తప్పింది. వొద్దనుకున్నా ఆమె గురించే ఆలోచిస్తుంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా మరిచిపోలేకపోతున్నాడు, పెళ్ళికి రాకూడదని బలంగా నిర్ణయించుకుని కూడా పెళ్ళయితే వెంటనే అమెరికా వెళ్ళిపోతుంది ఇకపై కనిపిస్తుందో లేదో అని ముందు రానని బెట్టుచేసినా చివరకు మెల్లగా సర్దుకుని బయలుదేరాడు .


వర్మ రూం మేట్‌ కం కొలీగ్‌ కిరణ్‌ “అవున్రా రోజూ ఆఫీసులో పనెగ్గొట్టిమరీ గంటలకొద్దీ మాట్లాడుతూనే వుంటావ్‌. మరలా సాయంత్రం పార్కుకెళ్ళి మాట్లాడుకునేంత ఏముంటుందిరా ?” వ్యంగ్యంగా అడిగితే

“అదిప్రేమలో పడ్డోడికి తెలుస్తుందమ్మా ” అని ఆకాశంలోకి చూస్తూ సమాధానంచెప్పాడొకప్పుడు , మరిప్పుడు అతనూరుకుంటాడా ! టైం దొరికింది తనదైన స్టయిల్‌లో ఆడుకుంటున్నాడు


***********


ఇంతలో ఓ పురోహితుడు మంటపం పైనుంచి దిగి ఆడిటోరియంలో అక్షింతలు పంచుతున్నాడు , అనుకోకుండా చేయి చాచాడు వర్మవెంటనే అందుకున్నాడు కిరణ్‌ ” వహ్‌వా …క్యా సీన్‌హై …నువ్వురా నిజమైన ప్రేమికుడివంటే , నిజంగా ఏప్రేమికుడికీ రాని అమోఘమైన అవకాశం నీకొచ్చింది ,వెళ్ళు వెళ్ళి ఆశీర్వదించు ” ఎగతాళిగా అన్నాడు , పక్కనున్న మిత్రులు కిరణ్‌కు వంతపలికారు” రేయ్‌వచ్చినప్పటినుండి చూస్తున్నా నువ్వు కొంచం ఎక్కువ మాట్లాడుతున్నావ్‌ ఎవరైనా వింటే ఏమవుతుందో ఒక్కసారాలోచించు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ” నెమ్మదిగా కోపంతో కూడిన స్వరంతో చెప్పాడు వర్మ .” అంతేరా నిజమంటే ఎవరికైనా నిష్టూరమే! నిన్ను ప్రేమించానని నీతో హాయిగా తిరిగి ఇప్పుడెవరో అమెరికాలో ఉంటున్న వాడు దొరికాడని చేతులో శుభలేఖ పెడితే , తగుదునమ్మా అంటూ పెళ్ళికొచ్చింది చాలక మళ్ళీ ఆశీర్వదించడానికి అక్షింతలు తీసుకోవడం కూడా…” కిరణ్‌ అన్న మాటతో కోపం ముంచుకొచ్చింది.” మీరేకదరా రానంటున్నా వినకుండా వచ్చేదాకా ప్రాణం తీసి ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అది నోరా ఇంకేమన్నానా ? ”

“మేము రమ్మనగానే వచ్చావుగా… మరప్పుడు మేమేమన్నా ఫీలవకూడదమ్మా!” వెటకారంగా అన్నాడు బృందంలోని మరో మిత్రుడు.“చూడరా ” టీవీ లో కనిపిస్తున్న పెళ్ళికూతురుని చూస్తూ “ఆ అమ్మాయెంత సంతోషంగా పెళ్ళిచేసుకుంటోందో! నువ్వూ ఉన్నావ్‌ దేనికి దేబ్రెపు ముఖం పెట్టి నీ ఆస్తులన్నీ హరించుకుపోయినట్లు అలాకూర్చోకపోతే మాతోకలసి ఎప్పటిలానే హాయిగా ఉండొచ్చుకదా! అప్పుడు నీకీ బాధలుండవు , మాకీ కంటశోషా ఉండదు ” అన్నాడు మరో మిత్రుడు తమ మనసులో ఏముందో చెప్పడానికన్నట్లు.” మీకేమిరా మీరెన్నయినా చెపుతారు ఆ బాధేంటో నాకుతెలుసు ” ఇంకా ఏదో చెప్పబోతున్న వర్మ మాటలకడ్డుతగిలాడు కిరణ్‌” కదా మరి ఈ ప్రపంచంలో నువ్వొక్కడివేరా భగ్నప్రేమికుడివి ” పక్కనే ఉన్న వినయ్‌వైపు చూపుతూ “వాడిని చూడు అంతా చేతికొచ్చినవనుకున్న నలభై లక్షలు వాడికి అమెరికాలో ఉద్యోగం పోయిందనగానే చేయి జారిపోయాయే , సొంత మామే తనకూతురినివ్వడానికి ఒప్పుకోకపోతే హాయిగా వొచ్చి ఇక్కడ జాబ్‌వేటలో ఉండి ఎంత ఎంజాయ్‌చేస్తున్నాడో చూడు ” ఒక్కసారి తనగురించి మాట్లాడుకోవడం విని ఈ లోకంలోకొచ్చాడు వినయ్‌” అంతేరా పిలవని పేరంటానికొస్తే ఎవరికైనా అలుసే , ఏదో మీతో పెళ్ళికొస్తే రెండ్రోజులు ఫ్రీ ఫుడ్డు ఫ్రీ మందు దొరికిద్దికదా హాయిగా ఎంజాయ్‌ చెయ్యొచ్చనుకుని నాఖర్చులతో మీ ఫ్రెండ్‌ పెళ్ళికొస్తే నిజంగా చులకనగానే ఉంటుందిరా ” కొంచెం బాధపడుతున్నట్లు ముఖంపెట్టి చెప్పాడు వినయ్‌” నీ యాక్టింగు చూసి ఫీలయిపోయి నీ రిటర్న్‌టికెట్‌ పెట్టుకుంటారనుకుంటున్నావేమో అంతలేదు కొంచెం తగ్గు ” మరో మిత్రుడు చురక వేశాడు.“అవునురా ఈ మధ్య ఎక్కడ పెళ్ళి జరిగినా పెళ్ళికొడుకు అమెరికాలో ఉన్నోడే అయి ఉంటున్నాడు , ఆంధ్రా లో ఉండే వాళ్ళసలు పెళ్ళి చేసుకోవడంలేదా ?” మరో మిత్రుడు తనకొచ్చిన సందేహాన్ని బయటపెట్టాడు“అదీ నిజమేరా ఇండియాలో అదీ ఆంధ్రాలో ఉండే అబ్బాయిలు అమ్మాయిల తల్లి దండ్రులకు కనిపించడంలేదు అమ్మాయిలకేమో టైం పాస్‌కావడానికొక బకరా కావాలికదా అని ఇదిగో ఇలాంటోడినొకడ్ని చూసుకుని తీరా అమెరికా సంబంధం కుదరగానే ఓ శుభలేఖ చేతులోపెట్టి, అదిగో అలా పెళ్ళి పీటల మీద కూర్చుంటున్నారు” అని వర్మ వైపు వందన వైపు చూసి తనకు జరిగిన అవమానాన్ని గుర్తు తెచ్చుకుంటూ చెప్పాడు వినయ్‌
ఇంతలో ఆడిటోరియంలో హడావుడి మొదలయింది


*********


భజంత్రీలు చాలా వుత్సాహంగా వాయిస్తున్నారు. పెళ్ళికూతురు , పెళ్ళికొడుక్కి మధ్యన అడ్డుగా ఉంచిన తెర తొలగిపోయింది , అప్పటివరకూ అలా పట్టుకు నిలుచున్న పిల్లలు, చేతులు విదిలించుకుంటూ అక్కడ నిలుచుంటే , అప్పటిదాకా లేనిది ఓ వీడియో గ్రాఫర్‌ కు అడ్డొచ్చారా పిల్లలు మీ పనయిపోయింది ఇక దిగిపోండని కసురుకున్నాడు“అవసరం తీరిపోయాక ఎవరిసంగతైనా యింతే ” కొంచం పైకే అంటూ మంటపం పైనుండి కిందికి దిగారు .ముందుకు వొంగి ఒకరి నెత్తిన ఒకరు జీలకర్రా బెల్లం పెట్టుకుని ఉండిపోయారు పెళ్ళికుమార్తె , పెళ్ళి కుమారుడు ఇదివరకయితే ఎక్కడకూర్చున్న వాళ్లక్కడినుండి చేతిలోని అక్షింతలు జల్లేవాళ్ళూ అవి వాళ్ళ ముందున్నవరుసలోనో లేక ఆముందున్న వరుసలోనో పడేవి కానీ ఇప్పుడలాకాదు ఒక్కొక్కరు లేచి వెళ్ళి మంటపం ఎక్కి ఇద్దరిపైనా అక్షింతలు వేసి ఫోటోకి, వీడియోకీ ఓ ఫోజిచ్చి రావాలి , నెత్తిన పెట్టిన బెల్లం వీడియో లైట్ల వేడికి కరిగి ఇద్దరి ముక్కుమీదగా జారుతూ నోటిదగ్గర ఆగిపోతుంది వచ్చిన ఆహ్వానితులందరూ అలా అక్షింతలు వేయడానికి ఓ గంటపైనే పట్టింది పీటలపైకూర్చున్న ఇద్దరికీ నీరసమొచ్చినంత పనైంది. అక్షింతలు వేసినవాళ్ళు వేసినట్లు ఇక మనమొచ్చినపనైపోయిందని భోజనాలకు బయలుదేరారు . తీరా చూస్తే ఆడిటోరియం మొత్తం మీద ఓ ఇరవై ముప్పై మంది ఉంటారేమో. ఇప్పుడు వాళ్ళలో వర్మ బృందం కూడ ఉంది.


********


” మీరు వెళ్ళి ఆ గిఫ్ట్‌ ఏదో ఇచ్చి రండి నేనిక్కడే ఉంటా ” చెప్పాడు వర్మ.మిగిలిన నలుగురూ గిఫ్ట్‌ ఇవ్వడానికి బయలుదేరారు.ఫ్రెండ్స్‌ గిఫ్ట్‌ ఇచ్చి విషెస్‌ చెపుతుంటే, వందనకు వర్మ గుర్తొచ్చాడుఆమె కళ్ళు అతని కోసం వెతుకుతూ వర్మ ఉన్నచోట ఆగిపోయాయి అతన్నలా చూడగానే ఆమె తడబడింది ఆత్మ విమర్శ చేసుకుంది , “చేసింది తప్పే కానీ దానివల్ల నేను కోరుకున్న సుఖాలు… భోగభాగ్యాలు అనుభవించబోతున్నప్పుడు ఆ తప్పుగురించి ఆలోచించాల్సిన అవసరంలేదు” తనను తాను సమాధానపరచుకుంది


*********


నూతన దంపతులకు అరుంధతిని చూపిస్తూ ఏవో మంత్రాలు చదువుతున్నాడు పురోహితుడు వర్మ దృష్టి అటుపడింది.“ఒరే నువ్వు తప్పుమాట్లాడుతున్నావ్‌. నువ్వు, వినయ్‌, నేమైనా అంటే వీడు ఫీలవుతాడు ” అంటూ వర్మ నుద్దేశించి చెప్పాడు కిరణ్‌చటుక్కున చూశాడు వర్మ.“అరే ఆ అమ్మాయికి పెళ్ళికూడా అయిపోయింద.ి ఇక నన్నేమనీ లాభంలేదు. మీ కంఠ శోష తప్పితే ఒరిగేదేమీలేదు అనవసరంగా నాగురించి ఆలోచించి మీటైం వేస్ట్‌చేసుకోకుండా పదండి తిని బయలుదేరదాం ”భోజనాలు చేసి లాడ్జికి బయలుదేరారుఅమ్మాయిల మనసు చాలా సున్నితమైందని పత్రికల్లోనూ సినిమాల్లోనూ చూసినప్పుడు నిజమే అనుకునేవాడు కానీ అదంతా పచ్చి అబద్ధమని యిప్పుడు తెలుసుకున్నాడు ఆమె హాయిగా పెళ్ళిచేసుకుంటే నేనెందుకు బాధ పడాలి ? తనను తాను ప్రశ్నించుకున్నాడు వర్మ. నిజమే అవసరం లేదనిపించింది జ్ఞానోదయమయింది వర్మకుఏదో కామెంట్‌ చేద్దామన్నట్లు వర్మవైపు తిరిగాడు కిరణ్‌ . వర్మ ముఖంలో ఏమాత్రం బాధ కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయి “ఏందిరా నీలో ఇంతమార్పు , ఇప్పటిదాకా వెధవ ముఖమేసుకుని కూర్చుని ఇంతలోనే మామూలుగా అయిపోయావు?” ప్రశ్నించాడు.” అంటే మీ ఉద్దేశం ఏందిరా , ఆమెకు వేరెవరితోనో పెళ్ళయిందని నేను దేవదాసులా తయారవ్వాలనా … అంతవసరం నాకులేదు నేనేమీ పిచ్చోడినికాదు, ఈ కాలం అమ్మాయిని మరీ అంత గాఢంగా ప్రేమించడానికి , ఆమెలేనిదే నేనూ లేనని పిచ్చోడిలా తయారవడానికి! జస్ట్‌ ప్రేమించా అంతే ! చివరి క్షణం వరకూ ఎదురుచూశా సినిమాల్లో లాగా ఎవరో ఒకరొచ్చి ‘ఆపండి పెళ్ళి’ అంటారేమో అని. కానీ అలా సినిమాల్లో మాత్రమే జరుగుతుందని ఇప్పుడే గుర్తొచ్చింది జరిగినదానిలో నాకొచ్చిన నష్టం ఏమీలేదు. ఆమెతో తిరిగినప్పుడు వేష్టయిన పెట్రోలు తప్ప . అయినా అన్నీ మనచేతుల్లో ఉంటే మనమీ భూమ్మీద నిలుస్తామా చెప్పు ప్రేమించిన ప్రతి ఒక్కరూ పెళ్ళిచేసుకోవాలనిలేదు. అలా అని పెళ్ళిచేసుకున్న వ్యక్తితోనే కలసుండాలనీలేదు ఏది జరిగినా మనమంచికోసమే అనుకుని లయిట్‌గా తీసుకోవాలమ్మా” అంటూ ‘మళ్లీ ఈ టైపు డబ్బున్న అమ్మాయి ఎక్కడదొరుకుతుందో ‘ మనసులో ఆలోచిస్తూ ముందుకు కదిలాడు.

Tuesday, December 25, 2007

లీడర్

సోమారమొచ్చిందంటే నాకు తిప్పలు మొదలయినట్టే. ఆ అస్సైను మెంటూ ఈ అస్సైనుమెంటు అంటూ దుంపతెంచుతారు అయ్యోర్లు అందులో ప్రభాకరయ్యోరి దగ్గర యవ్వారం మరీ దారుణంగా వుంటాది అస్సైను మెంటు రాయనోల్లను లైనులో నిలబెట్టి ఒక్కొక్కడి తొడపట్టుకున్నాడంటే ఒకపట్టాన వొదిలిపెట్టడు. తొడ ఎర్రగా కంది వాడు పెద్దగా గగ్గోలుపెట్టి ఏడిస్తే అప్పుడు కాని వదలడు

ఏమాటకామాటే చెప్పుకోవాలి చదువు చెప్పే ఇషయంలో కూడా ఈ అయ్యోరే ఫస్టు. ఒకటికి రెండుసార్లు చెప్పి అందరికీ అర్ధమయిందంటేనే పక్కపేరాకెల్తాడు. ఈ మధ్య నాక్కూడ ఇంగ్లీషు పాటాలర్ధమవుతున్నాయంటే అది అయ్యవారి గొప్పతనమే.

పోయిన సోమారం నేను అస్సైను మెంటు రాయలా

పోయినసోమారమేకాదు ఇప్పటివరకూ ఏ సోమారమూ నేను అస్సైనుమెంటు రాయలా .
కారణమేమంటే నేను ఈ క్లాసు లీడరును. లీడరు పని చేపించాలేకానీ చెయ్యకూడదుకదా మరి అందుకే నేను రాయను అందరు అయ్యవార్లు నన్ను చూసీ చూడనట్లు పోతారు కాని ప్రభాకరయ్యోరు మాత్రం నన్నోపట్టాన ఒదలడు ఈ అయ్యోరికి నేనంటే కొచం కొంచంకాదు ఎక్కువే కోపం ఎందుకంటె క్లాసులో నేను చేసే అల్లరటువంటిది క్లాసులోనేకాదు మా ఇంటిచుట్టుపక్కలాడాల్లు నన్నుచిత్తనాపోడంటారంటే నేనేలెవల్లో అల్లరిచేస్తానో ఊహించుకోవచ్చు ప్రభాకరయ్యోరు పోయినవారం పెట్టిన తొడపాసం గుర్తు ఇంకా చెరిగిపోకముందే మల్లీ సోమారమొచ్చింది , ఈసారి రెండో తొడచూపించాలి

ఉండేది వారానికొక ఆదివారం ఆరోజుకూడా ఆడుకోకుండా హోం వర్కని ఆవర్కని ఈ వర్కని చెపితే మరి నేనాడుకునేదెప్పుడు ? అందుకే ఈ అస్సైనుమేంట్ల గొడవ నాకు సోమారం క్లాసుకురాగానే గుర్తొచ్చిద్ది పొద్దున్నే ఫస్టు పీరియడు ఇంగ్లీషు. పిలకాయలందరూ అస్సైనుమెంట్‌నోటు పుస్తకాలు తెచ్చి బల్లమీద పెట్టగానే నాకు గుర్తొస్తది ఇవ్వాల కూడా అదే జరిగింది , అందరూ పుస్తకాలు బల్లమీద పెట్టారా లేదాని ఒకటికి రెండుసార్లడిగి అందరూ పెట్టారని నమ్మకంకుదరగానే అన్నీ పుస్తకాలు తీసుకుని ఒక ఆర్డరులో పెట్టడం మొదలెట్టా. క్లాసుకు వొచ్చిన ముప్పై నాలుగురిలో ముప్పైమూడు పుస్తకాలు టేబులుమీదకొచ్చాయి ఒకపుస్తకంమాత్రం సంచిలో నక్కింది ఇవ్వాల నాకు తోడెవరూ లేకపోవడంతో భయం మొదలయింది ఎంతసేపు తొడపాశం పెడతాడో అని, కొంచం సేపు ఆలోచించి పుస్తకాలన్నీ రాంబాబుగాడికిచ్చి చెప్పా

లెక్కెట్టుకోరేయ్‌మొత్తం ముప్పైమూడు రాంబాబుగాడి ముఖంలో చెప్పలేనంత ఆనందం మొదటిసారి సెకండు లీడరుకు లీడరుగిరి వచ్చిందన్న ఆనందంతో అస్సైనుమెంటు పుస్తకాలన్నీ సంకలో పెట్టుక్కూర్చున్నాడు అయ్యోరికోసం ఎదురుచూస్తూ

ప్రభాకరయ్యోరు రాగానే నాకోసమన్నట్లు నేనెప్పుడూ కూర్చునేకాడ చూసి అక్కడకని పించకపోయేటప్పటికి ఒక్కసారి క్లాసంతా కలియచూసి నేను కనపడగానే రాశావా అన్నట్లు కళ్ళెగరేశాడు దొంగలాగ తలకాయొంచుకుని లేచి నిలబడ్డా “పుస్తకాలు టేబులుమీదపెట్టు ” చెప్పాడు , రాంబాబుగాడు గబుక్కునలేచి సంకలో పుస్తకాలన్నీ టేబులుమీదపెట్టి “ఇయ్యాల నేనే లీడరు సారు వాడికొంట్లో బాగోలేదంట ” ఈ చివరిముక్క వాడు కలిపించుకున్నదే చెప్పి కూర్చున్నాడు “ఏమయిందిరా …..” అడిగాడు సారు“కడుపులో నెప్పిగా ఉంది సారు ” అని కడుపుపట్టుకుని మరీ చెప్పా“నాకు తెలుసాకడుపునెప్పెందుకొచ్చిందో ” అని అస్సైనుమెంటు రాయని వాల్లునిలబడమని చెప్పి ఒక్కొక్కరిని పిలిచి అస్సైనుమెంట్‌చూడడం మొదలుపెట్టాడు.

నేను జరగబోయే తతంగాన్నూహించుకుంటూకిస్‌కిస్‌ మని నవ్వుకుంటూ ఎనకలైనులో నిలబడ్డా అన్నీ చూడడం అయిపోయింది కానీ రాంబాబుగాడి పుస్తకంమాత్రం లేదక్కడ “ఏరా లీడరనగానే నీకూకొమ్ములొచ్చినయ్యా ఎప్పుడూరాసేవాడివి ఏమయ్యిందినీకివ్వాల” అని కుర్చీలోనుండి లేచాడు“నేను రాశానుసార్‌నాపుస్తకం అక్కడేపెట్టా ” నమ్మకంగా చెప్పి ఒకసారి“పుస్తకమక్కడపెట్టానుకదరా “అన్నట్లు నాకేసి చూశాడు. నేను మూతికి చెయ్యడ్డంపెట్టుకుని ఏమీ తెలియని అమాయక చక్రవర్తిలా ముఖంపెట్టి దీనంగా వాడివైపుచూశా

“ఇక్కడపెడితే నేనేమన్నా దాచానా నీపుస్తకాన్ని , అస్సైనుమెంటు రాయకపోగా రాశానని అబద్దాలుకూడానా లే నిలబడు గాడిదా” అయ్యోరు పెద్దగా అరిచాడు రాంబాబుగాడు చేసేదేమీలేక బిక్కమొఖమేసుకుని నిలబడ్డాడు“ఇద్దరూ ఇట్రాండిరా” పిలిచాడు. తొడమీద రుద్దుకుంటూ ముందుకు కదిలా“ఎందుకురాయలేదురా ” ప్రశ్నించాడు“నిన్నంతా కడుపులోనొప్పిసార్‌, అదింకాతగ్గలేదు ” వేరే ఏ అయ్యోరయినా నేచెప్పినపద్దతి చూసి రెస్టుతీసుకోమని ఇంటికి పంపించేవోరు ఈనమాత్రం నన్ను కాచి వడపోసినోడయ్యా “నీ జిత్తులమారి ఎత్తులు నాకుతెలుసుగానీ రాముందుకు ” తొడపాశం పెట్టడానికి చేయిముందుకు చాచాడు చేయిముందుకొస్తూ ఉంది తొడదగ్గరకొచ్చింది పట్టుకోబోతున్నాడు, క్లాసురూము పెంకులెగిరిపోయేలా పెద్దగా అరిచా అప్పుడుచూసా సారింకా నాతొడపట్టుకోలేదన్నది ఇకచూడు పిల్లకాయలు ఒకటే నవ్వు , అమ్మాయిలయితే పొట్టపట్టుకుని మరీ పెద్దగా నవ్వుతున్నారు ఒక్కసారి వెనక్కితిరిగి తరగతి మొత్తాన్నలా చూడడంతో నాక్కూడా నవ్వొచ్చింది, నాతోపాటు పక్కనున్న రాంబాబుగాడు కూడా ఇరగబడినవ్వడం సారుకు కోపం తెప్పించినట్టుంది “మీపనిట్టకాదు “అని చుట్టూచూసి అందుబాటులో ఏమీలేకపోయేసరికి “నెక్స్టు పీరియడేంది”అమ్మాయిలవైపు తిరిగి అడిగాడు”యన్‌యెస్‌సార్‌” టపీమని చెప్పా .సీరియస్‌గా నావైపు చూసి , ఆపక్కగా పోతున్న వాచ్‌మాను రంగయ్యను పిలిచి“వీల్లిద్దర్ని తీసుకుపోయి ఆ స్టోర్రూంలో పడెయ్‌ వొంటేలు బెళ్ళయిపోయాక మళ్ళీ తాలం తీయ్‌” సీరియస్సుగా పేసుపెట్టి చెప్పాడు ఒక్కసారిగా క్లాసంతా సైలెంటయిపోయారు “ఇంకెప్పుడయినా అస్సైనుమెంటురాయకపోతే ఎవరిగతయినా ఇదే! వీల్లిద్దరినీ తీసుకుపో “మల్లీ చెప్పాడు రంగయ్యకు , రంగయ్య “ఆ రండి ” అనగానే పిలకాయలంతా అప్పుడెప్పుడో ఎండాకాలం శలవుల్లో చింత తోపులో పేకాడేటోల్లను పోలీసోల్లు పట్టుకెల్లినప్పుడు చూసినట్లు చూస్తూ ఉన్నారు మావైపు నాకయితే మస్తు ఖుషీగుంది అక్కడ ఎంచగ్గా శెనగపప్పులు, బెల్లం, ఏడిచెనక్కాయపప్పు అన్నీ ఉంటాయ్‌ నారొట్టెవిరిగి నేతిలో పడింది అనుకుని‘ఇంకెప్పుడూ అస్సైనుమెంటు రాసే పనిలా’ మనసులో అనుకుంటూ రాంబాబుగాడివైపు చూశా బిక్కముఖమేసుకు నడుస్తున్నాడు నావెనకాలె.

****

రంగయ్య స్టోర్రూము తాళం తీసి మమ్మల్ని గదిలోపెట్టి బయట గడిపెట్టి మల్లీ తాళం పెట్టి వెల్లిపోయాడు లోపలంతా చీకటిగా ఉంది మెల్లగా లైటు స్విచ్చు వెతికి లైటేశా , రాంబాబుగాడు ఏడుపులంకించుకున్నాడు “ఎందుకురా ఏడుస్తున్నావ్‌” వాడినడిగా ” నా అస్సైనుమెంటుపుస్తకం పోయింది, మాయమ్మ తన్నుద్ది ” ఏడుస్తూనే చెప్పాడు “సరే ఏడు ఎక్కువేడిత్తే మీయమ్మతన్నదు ” అని అప్పుడుచూసా ఇంతకముందు గోనిసంచులున్న కాడా ఇప్పుడు ఇనపడబ్బాలుండి వాటికి తాటికాయంత తాలాలేసున్నయ్యి వోరి వీల్ల దుంపతెగ అందుకే కావొచ్చు కొత్త శిక్ష జంకులేకుండా అమలు జరిపాడు , అయినా వార్డెను తెలివి మీరిపోయాడు అనుకుని ఈ గంటఏమి చేయాలా అని ఆలోచిస్తుంటే ఎదురుగ్గా ఒకపక్క ఓ నాలుగైదు బియ్యపు గోతాలు రెండోపక్క ఓ కందిపప్పుగోతం కనిపించాయి, చూడగానే నాకు చిత్రమయిన ఆలోచనొచ్చింది వెంటనే కష్టపడి ఆ బియ్యపు గోతాన్నీ ఈ కందిపప్పుగోతాన్ని దొర్లించి మధ్యలో కూర్చుని ఆ రెంటినీ కలిపే పనిలో ఉండిపోయా మధ్యమధ్యలో బియ్యంకందిపప్పు తింటూ నాపని నేను చేసుకుపోతూ ఇంతకీ రాంబాబుగాడేం చేస్తున్నాడాని వాడివైపుచూసా వాడెప్పుడుఏడుపాపాడొగాని ఓ మూల కూర్చుని నేను చేసేపని చూస్తూ నవ్వుకుంటున్నాడు ఇంతలో స్టోరు తలుపు తెరుస్తున్న చప్పిడవడంతో గబుక్కున లేచి లైటాపి రాంబాబుగాడి పక్కన కూర్చున్నా , రంగయ్య తలుపుతీసి మమ్మల్నిద్దరినీ బయటకురమ్మని మళ్ళీ తలుపు తాలంపెట్టాడు

****

మూడో పీరియడు జరుగుతుంది , హెడ్డుమాష్టరు వార్డెను రంగయ్య ముగ్గురూ కట్టకట్టుకుని మా క్లాసు వైపురావడం చూసి నానిక్కరులో ఉచ్చ పడ్డయ్‌క్లాసుదగ్గరకొచ్చి నన్నూ, రాంబాబుగాడిని బయటకుపిలిచి బియ్యం కందిపప్పు కలిపిందెవర్రా వార్డెను గుడ్లు మిటకరించిమరీ అడిగాడు మాములుగానే ఆయన్నిచూత్తే నాకు బయ్యం ఆయన మొఖమలాపెట్టి అడగడంతో సరెండరయిపోయా, ఇకచూడు పక్కనే ఉన్న అవ్వాయ్‌సువ్వాయ్‌బెత్తంతో వార్డెను ఉతుకుతుంటే నాసామిరంగా నేనేసిన చిందులు చిందులుకాదు , మధ్యలో హెడ్డుమాస్టరుగారు కలగజేసుకుని రేయ్‌పో పోయి ఒంటికాలుమీద గ్రౌండులో నిలబడు నేను మళ్ళీ చెప్పేదాక కదలొద్దు అని ఆర్డరేసి రామయ్యా వీడిసంగతిచూడు అని తనదారిన వెళ్ళిపోయాడు గ్రౌండు మధ్యలో వొంటికాలుమీద నిల్చున్నా , అలా నిలబడడం నాకు మంచిగా అనిపించింది మా ఇంట్లో శ్రీకృష్ణ పరమాత్ముడు పామ్మీదనిలబడి నాట్యం చేస్తున్నట్లుంది నావాలకం మెల్ల మెల్లగా పైనా కిందా కాలడం మొదలెట్టింది ఎండకి ఒల్లంతా చెమటలుపడుతున్నాయ్‌ ఇంతకీ నన్నిలా నిలబెట్టిన సంగతి హెడ్డుమాష్టరుగారికి గుర్తుందో లేదో అనుమానంరాగానే నన్నే గమనిస్తూ తనపని చేసుకుంటున్న రంగయ్యను “ఓ …. రంగయ్యో హెడ్డుమాష్టరుగారినడుగు నేనిలా ఎంతసేపు నిలబడాలో ?” పెద్దగా అరిచా, “ఈ పీరియడయ్యేంతవరకు ” చెప్పి తనపని చేసుకుంటున్నాడు రంగయ్య.

పీరియడవడానికింకో అరగంటపైనే పడుతుంది అప్పటిదాకా ఇలా ఎండలో ఒంటికాలుమీదనిలబడడం కష్టమవుతుందేమో నీరసమొచ్చి పడిపోతానేమో అనుమానంరాగానే అయిడియాకూడా వొచ్చింది
నాచుట్టూ అయ్యోర్లు, పిలకాయలు చేరారు వార్డెను నాముఖాన నీల్లు చల్లి నన్ను భుజానేసుకుని తీసుకెల్లి హెడ్డుమాస్టరు రూములో మెత్తటిసోఫాలో పడుకోబెట్టి నాకు గోళీ సోడా తాగించాడు నాకయితే అయ్యోర్లు పడుతున్న హైరానాచూచి నవ్వొచ్చింది గబుక్కున నవ్వితే తంతారని బయమేస్తుంది ఇలా ఎంతసేపుండాలో తెలియడంలేదు ఎప్పుడులేవాలో అర్ధమవడంలేదుతలకాయాలాడేసి పడుకుని పెదాలు గట్టిగా బిగబట్టి లోపల్లోపల నవ్వుకుంటున్నా హెడ్డు మాస్టరు గారైతే కాలుకాలిని పిల్లిలాగా అటూ ఇటూ తెగ తిరిగేస్తున్నాడు , కళ్ళుతెరవడానికి ప్రయత్నిస్తున్నట్లు కొంచం తెరిచి చూసి మల్లీ కళ్ళుమూసుకుంటున్నా అయ్యోర్లందరూ నాకు సేవలు చేసుకుంటున్నారు ప్రభాకరయ్యోరయితే ఒక పుస్తకం తీసుకుని నాతలకాడ నిలబడి విసురుతున్నాడు రాజ భోగం ఎంతమంది పిలకాయలకీ అవకాశం దొరుకుద్ది ఎక్కువసేపయితే కనుక్కుంటారేమో అని మెల్లగా కళ్ళుతెరిచి ఏమీ తెలియనట్లు అమాయకంగా ముఖంపెట్టి “ఏమయింది ?” అడిగా“ఏమీ కాలేదమ్మా ఎండలో ఉండడంవల్ల కళ్ళుతిరిగి పడిపోయావంతే” అని పక్కనే ఉన్న రాంబాబును చూస్తూ ఒరే వీడిని తీసుకుపోయి ఇంటిదగ్గర వొదిలిపెట్టు చెప్పాడు హెడ్డుమాస్టారు ” హమ్మయ్యా నా ప్లాను ఫలించింది ” మనసులో అనుకుని మెల్లగా లేచి క్లాసువైపు వెల్లబోతే అప్పటికే నా పుస్తకాలసంచీ తీసుకుని రడిగా ఉన్న రాంబాబు “ఇవిగోరా నీపుస్తకాలు నేను తెస్తాలే పా ” అని నాకు బంట్రోతులా నాఎనకాల పుస్తకాల సంచీ తో బయలుదేరాడు, స్కూలు గేటుదాటగానే సంచీ తీసుకుని దాన్లోనుండి రాంబాబుగాడి అస్సైనుమెంటు పుస్తకం తీసిచ్చా ఆ సమయంలో వాడు చూసిన చూపుకు ఇంకొకడయితే నిజంగా భస్మమయిపోయేవాడు ,” అరే ఏమనుకోకురా సారు నాఒక్కడికే తొడపాసంపెడతాడని తోడుగా నీపుస్తకాన్ని నాసంచీలోపెట్టా “నవ్వుతూ చెప్పి “ఇక నువ్వు క్లాసుకుపో నేనింటికెల్తా “చెప్పా, అంతకోపంలోకూడా “మల్లీ నువ్వుపడిపోతావేమోరా ” అమాయకంగా అడిగాడు “మళ్ళీ సారెప్పుడన్నా ఎండలో నిలబెడితే తప్ప నేను పడిపోనురా ” నవ్వుతూ చెప్పి సంచీ సంకకు తగిలించుకుని బుయ్యని పరిగెత్తా ఇంటికికాదు చెట్టుకింద గోలీలాటకి .....

Friday, December 14, 2007

కనువిప్పు

“మీకేమన్నా పిచ్చి పట్టిందా ఏమిటి, ఎక్కడో అమెరికాలో ఉన్న కన్న కూతురి మీద దావా వేస్తామంటారు?” నిర్ఘాంతపోతూ అన్నది లక్ష్మి.
“పిచ్చిదానా! నేను ఇప్పుడున్నంత మానసికారోగ్యంతో ఇంకెప్పుడూ లేను. ఇన్నేళ్ళ నా లా ప్రాక్టీసుకి ఇప్పుడే నిజమైన సాఫల్యం.” అన్నాడు శేషగిరి రావు దృఢంగా.
“ఇదెప్పుడైనా ఎక్కడైనా విన్నామా? తల్లిదండ్రుల మీద కోర్టుకెళ్ళే పిల్లలు ఎక్కడన్నా ఉండొచ్చు గాని, పిల్లల మీద తల్లిదండ్రులు దావా వెయ్యటమేమిటి?”“అదుగో, ఇప్పుడు నువ్వన్నట్లు తల్లిదండ్రులంటే పిల్లలు ఏం చేసినా కిక్కురు మనకుండా పడుండే వాళ్ళని అందరూ అనుకోవడం వల్లనే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు.”
“ఇలా చేస్తే అమ్మాయీ, అల్లుడూ మళ్ళీ మనతో మాట్లాడుతారా? బంధువులు మనల్ని పలకరిస్తారా?”
“ఏ మాత్రం బుద్ధున్న వాళ్ళైనా మనం ఎందుకు ఈ పని చేస్తున్నామో అర్థం చేసుకుని, వాళ్ళు చెయ్యలేకపోయినది మనం చేస్తున్నందుకు చాటుగా నైనా సంతోషిస్తారు. ఇక అర్థం చేసుకోని వాళ్ళంటావా, వాళ్ళు పలకరించకపోతే మనకు అదే పదివేలు!”
“మీదో చాదస్తం!”
“చాదస్తం కాదు, నువ్వే గుర్తు తెచ్చుకో, నీ గారాల కూతురు నీకు చేసిన మర్యాద ఏమిటో!”

*****

” హలో అమ్మా నేను సంధ్యను…”
ఎక్కడో దూరాన ఉన్న కూతురు అప్పుడప్పుడూ ఫోను చేసి పలకరిస్తుంది, ఆ పిలుపుకోసమే ఎదురుచూసే తల్లి మనసు మరుక్షణం పులకరించి పోతుంది.ఒక్క క్షణం ఏమి మాట్లాడాలో అర్ధం కాలేదామెకు.
ఎప్పటిలాగానే మనసు పొరల్లో అప్పటివరకూ దాగివున్న ఐదక్షరాలు “బాగున్నావామ్మా…” అంటూ తనకు తెలియకుండానే బయటికొచ్చాయి.
“బాగానే ఉన్నా…నీకో శుభవార్త చెపుదామని ఫోను చేశా….”
“ఏందమ్మా మీరు ఇక్కడికి వస్తున్నారా….?” కూతుర్ని చూసి రెండేళ్లైంది. అనుక్షణం అమ్మాయిని చూడాలని మనసు తపిస్తుంది.
“లేదమ్మా……..” చిగురాకుపై ఎర్రని సూర్యకిరణం పడినట్లయింది.
“మరింకేమిటే ఆ శుభవార్త ” అని కొంచం ఆగి “నెల తప్పావా ? ” ఆనందంతో కూడిన స్వరంతో అడిగిందిఅవతలవైపు కొద్ది క్షణాల నిశ్శబ్దం తరువాత లోగొంతుతో “ఊ …” అని వినిపించింది.

తనబిడ్డ ఇంకో బిడ్డకు తల్లి కాబోతుందన్న వార్త లోని ఆనందంఈ టైం లో బిడ్డని చూడలేక పోతున్నానే అన్న బాధరెండూ కలిసి ఆమె నోట మాట పెగలలేదొక క్షణం.
కళ్ళవెంట రాలుతున్న కన్నీటిని కొనగోట తుడుస్తూ, కిందిపెదవిని పంటితో నొక్కిపట్టి ఆపుకుంటూ “పిచ్చిపిల్లా ఈ మాట చెప్పడానికెందుకే సిగ్గుపడతావ్‌ ఎన్నోనెల ” ప్రశ్నించింది తల్లి.
కొద్ది సేపు కూతురితో మాట్లాడి ఫోను పెట్టేసింది లక్ష్మి భర్తకు ఈ విషయం ఎలా చేరవేయాలా అని ఆలోచిస్తుండగానే రానే వచ్చాడు శేషగిరిరావ్‌ అతన్ని అల్లంతదూరంలో చూస్తూనే ఎదురెళ్లి శుభవార్త చెవిన వేసింది.

నిన్నకాక మొన్న అయినట్లుంది అమ్మాయి పెళ్ళి,
అమ్మాయి డిగ్రీ పరీక్షలు రాసి రిజల్స్ట్‌ కోసం ఎదురుచూస్తుంటే, అల్లుడిని వెతికే పనిలో పడ్డారు అమ్మా నాన్న. పరీక్ష అయితే ఫెయిలైంది కాని , అమ్మాయికి పెళ్ళి కళ వచ్చేసింది.
అమెరికా సంబంధం, అబ్బాయి బుద్ధిమంతుడు, కట్న కానుకల పై అబ్బాయిగాని అతని తల్లి దండ్రులు పెద్దగా మక్కువ చూపకపోవడం తో వెంటనే నిశ్చితార్ధం జరిగిపోయింది.
పది రోజుల్లో పెళ్ళి, తరువాత పదిహేను రోజుల్లో అమెరికా ప్రయాణం అనగానే ఈ పెళ్ళి నాకొద్దు మొర్రో అని మారాం చేయడం మొదలెట్టింది, పెళ్ళి అనే పేరుతో నన్ను మీనుండి ఎక్కడికో పంపేయాలని చూస్తున్నారని తల్లి ఒడిలో తలవాల్చి బోరుమంది.
అమ్మాయిని పెళ్ళికి ఒప్పించేటప్పటి కి ఇద్దరికి తల ప్రాణం తోకకొచ్చినంత పనైంది. ఒక్కగానొక్క కూతురి పెళ్ళి. ఖర్చు విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా ఘనంగా పెళ్ళి తతంగం పూర్తి చేశారు.
గుండెనిండా భారంతో పుట్టిపెరిగిన ఊరుని, తనతో ఆడుకున్న స్నేహితులని , తననిన్నాళ్లూ కంటికి రెప్పలా కాపాడుతూ తనకు కావాల్సినవి అందిస్తూ వచ్చిన తల్లి దండ్రులనీ ఒదిలి తెలియని సుదూర ప్రాంతానికి వెళ్తున్నందుకు కుమిలి కుమిలి ఏడ్చింది.

*****

ఇప్పుడా ఇంట్లో ఇద్దరే , ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ కాలం గడుపుతున్నారు.
వెళ్లిన కొత్తల్లో వారానికి రెండుసార్లు ఫోను చేసేది, తరువాత మెల్లగా ఫోను కు ఫోనుకు మధ్య వ్యవధి పెరుగుతూ ఇప్పుడది ఏ రెండునెల్ల కొకసారో అయింది.

*****

నెల తరువాత మళ్లీ కూతురు దగ్గరనుండి ఫోనొచ్చింది
“అమ్మా నా డెలివరీ టైంలో ఎవరో ఒకరు తోడుంటే మంచిది కదా…. అందుకు నువ్విక్కడికి రావడానికేర్పాట్లు చేస్తానంటున్నాడు మీ అల్లుడు”
లక్ష్మి షాక్‌ తిన్నట్లు “నేనా…..?” ప్రశ్నించింది.
“అవును. నాకుకూడా నిన్ను చూడాలని ఉంది……నేనే ఇండియాకు రావచ్చు కాని అలా చేయడంవల్ల చాలా నష్టాలున్నాయి అందుకే నువ్విక్కడికొస్తే బాగుంటుందని ” ఏదో చెప్పబోతున్న సంధ్యను మధ్యలోనే ఆపి “అదేందమ్మా నువ్విక్కడికి రావడంవల్ల నష్టం ఎవరికుంటుంది ?” ప్రశ్నించింది.
“నష్టమంటే నష్టంకాదు కానీ “చెప్పాలా వద్దా అని ఒక్క క్షణం ఆలోచించుకుని మళ్లీ మొదలెట్టింది “బిడ్డ ఇక్కడ పుడితే ఆటోమేటిగ్గా అమెరికన్‌ సిటిజన్‌ షిప్‌ వస్తుంది”
“చిటిజన్‌ చిప్పా అదేంటే ?” అడిగింది లక్ష్మి “చిటిజన్‌ చిప్ప కాదమ్మా సిటిజన్‌ షిప్పు అంటే పుట్టే బిడ్డకు అమెరికా పౌరసత్వం వస్తుంది ”
“నువ్వు పుట్టిన దేశంలో నీబిడ్డ పుట్టకూడదనుకుంటున్నావా ? ” ప్రశ్నించింది. అనుకోని ప్రశ్న ఎదురవడంతో ఒక్క క్షణం తొట్రుపడింది సంధ్య. ఏం మాట్లాడాలో అర్ధంకాక మౌనంగా ఉండిపోయింది.
“ఏంటమ్మా మాట్లాడవు”
“అదికాదమ్మా ఇప్పుడు నేనక్కడికొస్తే ఆ వాతావరణం నాకు సరిపడకపోవచ్చు” సణుగుతున్నట్లు చెప్పింది సంధ్య.
“నువ్వు పుట్టిపెరిగిన వాతావరణం నీకు సరిపడక పోవడమేంది ” అని వెంటనే ” అయినా ఇరవై ఏళ్లపాటు నువ్వున్న వాతావరణం ఇప్పుడు నీకు సరిపడదా ” నవ్వుతూ అడిగింది
“నాన్నున్నాడా? “అడిగింది సంధ్య.
“ఇప్పుడే బయటకు వెళ్లాడు ”
“అమ్మా నీకో విషయం చెప్పడం మరిచిపోయా మా ఆడపడుచు శాంతి వాళ్లు మేముండే దగ్గర్లోనే ఉంటున్నారు ” అని అక్కడ వాళ్ల విషయాలు చెపుతూ ఉంటే ఊ కొడుతూ ఉంది , కానీ మనసులో మాత్రం టాపిక్కు మార్చేసిందేమిటా అని ఆలోచిస్తూ తనే మరలా ప్రస్తావించబోయింది “సరే మళ్ళా ఫోను చేస్తానమ్మా” అని ఫోను పెట్టేసింది సంధ్య.

*****

లక్ష్మి పుట్టి పెరిగింది అదే ఊరు. భర్త కూడ అక్కడే లాయర్‌గా ప్రాక్టీసు చెయ్యడంతో ఎక్కడికీ పెద్దగా వెళ్ళడానికి అవకాశం కలగలేదు. చుట్టాల ఇళ్ళకి వెళ్దామన్నా, వాళ్ళే పదే పదే తమ ఇంటికి వచ్చేవాళ్ళు! ఇక ఆ తర్వాత పిల్లలు, వాళ్ళ చదువులు. మొత్తం మీద సొంత ఊరు తప్ప మరోప్రపంచం తెలియదామెకు. అలాటిది ఒక్కసారిగా విమాన ప్రయాణం, అందులోను అమెరికాకి అనేసరికి ఆమెకి పట్టరాని ఆనందం కలిగింది. భూలోక స్వర్గం అని అందరూ పొగుడుతుంటారుగా, వెళ్ళి చూసొద్దాం అనుకుంది. శేషగిరి రావుని రమ్మని ఎవరూ అడగలేదు, ఆయనా వస్తానని అనలేదు.

*****

చాలాకాలం తరువాత కూతుర్ని చూసిన ఆనందం లో ఆమె నోటమాట రాలేదు, అమ్మాయి లో చాలా మార్పొచ్చింది వేషం , బాష, కట్టు బొట్టు తీరు ఒకటేమిటి అమెరికాకు బయలుదేరినప్పటి సంధ్యకూ ఈ సంధ్యకు మధ్య దూరం రెండు సంవత్సరాల కాలం. కొన్ని యుగాల మార్పు కనిపించింది వాళ్ళమ్మకు.

దారి వెంట దూరం గా అక్కడక్కడ కనిపించే పెద్ద పెద్ద భవనాల గురించి ఏదో చెపుతుంది. కాని అమ్మాయి చెప్పేది కొంచం కొంచమే అర్ధమవుతుందామెకు విరివిగా వాడే ఇంగ్లీషు పదాల వల్ల రోజులు సాగుతున్నయ్‌.
డెలివరీ టైం దగ్గర పడడం తో హాస్పటల్‌ కి వెళ్ళారు.
డెలివరీ అయి అమ్మాయి పుట్టింది, అచ్చుగుద్దినట్లు తల్లిపోలికలతో పుట్టిన మనవరాలిని చూసుకుని మురిసిపోయింది అమ్మమ్మగా మారిన లక్ష్మి.
ఉత్సాహంగా పాపను చూసే బాధ్యత తన మీద వేసుకుంది లక్ష్మి. రాత్రైనా పగలైనా రెండేసి గంటలకు పాపకు పాలు పట్టడం, అన్ని విషయాలు తనే చూడడం.
సంధ్యకు ఆనందం వేసింది. అడక్కుండానే తల్లి పాప బాధ్యతలన్నీ తీసేసుకుంది గనక తను నాలుగో రోజు నుంచే వర్క్‌కు వెళ్ళడం మొదలుపెట్టింది.
నెల రోజులు గడిచాయి. లక్ష్మికి పాపను చూడడం కష్టమై పోతోంది.
నిద్ర లేక కూర్చునే కునుకు తీస్తోంది.
తిండి సహించడం లేదు.
కడుపులో వికారంగా వుంటోంది.
సంధ్య పాప పన్లన్నీ పూర్తిగా తనకు వొదిలేసింది.
సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చాక తల్లి వంట చేస్తుంటే పాపతో కాస్సేపు ఆడుకుంటుంది.
తర్వాత సంధ్యా, ఆమె భర్తా భోంచేస్తుంటే పాప పని తనే చూడాలి.
వాళ్ళు తాపీగా భోంచేసి వాళ్ళ బెడ్‌ రూమ్‌ లోకి వెళ్ళి టీవీ చూస్తుంటే తను పాపను పక్కన పెట్టుకుని ఏదో నాలుగు మెతుకులు తిన్నాననిపించాలి.
లక్ష్మికి ఈ పనుల్తో నీరసం వచ్చేసింది.
ఇలాగే కొన్నాళ్ళు గడిస్తే తను మంచం పట్టేట్లు కనిపిస్తున్నది.
ఇంతకన్నా ఇండియాకి తిరిగి వెళ్తే నన్నా కాస్త విశ్రాంతి దొరుకుతుంది , అక్కడైతే పనివాళ్ళే అన్ని పనులు చేసి పెడతారు.
మర్నాడు సాయంత్రం వాళ్ళు భోంచేసేటప్పుడు కూతురితో అన్నది “అమ్మాయ్‌, ఇంక నేను ఇంటికి వెళ్తాను. నాలుగైదు రోజుల్లో టికెట్‌ దొరుకుతుందేమో చూడమ్మా”
గొల్లున నవ్వారు వాళ్ళిద్దరూ.“ఈ సీజన్లో టికెట్‌ కావాలంటే కనీసం మూడు నెల్ల ముందు బుక్‌ చెయ్యాలి. ఐనా పాపకి నడక వచ్చేవరకన్నా ఉండి వెళ్లమ్మా!” అన్నది సంధ్య.
లక్ష్మి గుండెల్లో రాయి పడింది. మూడు నెలలా? పాపకి నడకంటే ఇంకో ఏడాది పడ్తుందేమో!“అలా కాదమ్మా. నేను వెళ్ళాలి. రోజూ ఇల్లే గుర్తుకొస్తుంది.”
“అలా అంటే ఎలా అమ్మా! నువ్వు పాపని చూసుకుంటావని ఇప్పుడే కొత్త ఉద్యోగంలో కూడ చేరాను. ఐనా ఇక్కడ నీకు లోటేం వచ్చింది?”
మాట్లాడలేక పోయింది లక్ష్మి. గొంతులో ఏదో అడ్డం పడింది. కళ్లలో నీళ్ళు తిరిగాయి. తను ఇప్పుడు ఎంత అస్వతంత్రురాలో అర్థమై మనసంతా ఖాళీ ఐనట్లు అనిపించింది.
మూడు నెలలు అనుకున్నది అలా అలా జరిగి జరిగి ఏడు నెలలయింది. టికెట్‌ దొరక్క కొన్నాళ్ళు, దొరికితే సరైన తోడు దొరకక కొన్నాళ్ళు, సంధ్య పని మీద ప్రయాణాలు వెళ్ళవలసి కొన్నాళ్ళు, ఇలా మొత్తం మీద నిజంగానే పాప పాకడం నుంచి తప్పటడుగులు వేసేటప్పటికి గాని లక్ష్మి ప్రయాణం కుదర్లేదు.
లక్ష్మి బయలు దేరాల్సిన సమయం వొచ్చేసింది. ఒంటరిగా ప్రయాణం … అల్లుడు గారి ఫ్రెండ్స్‌ ఎవరో ఇండియా వెళ్తున్నారని, వాళ్ల తో తిరిగి వెళ్ళొచ్చు ననుకుంటే తీరా వెళ్ళే రోజుకి వాళ్ళకి ఏదో అడ్డం వచ్చి ప్రయాణం మానుకున్నారు!
పాపకి ఒంట్లో బాగాలేదని చివరకు ఎయిర్‌ పోర్ట్‌ కి కూడారాలేదు సంధ్య. అల్లుడు ఎయిర్‌ పోర్టులో విచారించి ఎవరో తెలుగు వాళ్లకు పరిచయంచేసి వెళ్లిపోయాడు.
*****
“నువ్వక్కడ మొత్తం పది నెలల పాటు వుండి వాళ్ళకి సేవలు చేశావు. రోజుకు పది గంటల పని చొప్పున పదినెలలకు గాను నువ్వు దాదాపు మూడు వేల గంటలు పని చేశావు. అక్కడ మినిమమ్‌ వేజ్‌ గంటకు ఆరో ఏడో డాలర్లు వుండాలి. ఆరు వేసుకున్నా పద్దెనిమిది వేల డాలర్లు. దాన్లో నీ ఖర్చులకు రోజుకు ఇరవై డాలర్లు తీసెయ్యి. నీ టికెట్లకి మరో పదిహేనొందలు తీసెయ్యి. మొత్తం ఖర్చు సరిగ్గా ఏడు వేల ఐదొందల డాలర్లు. అది పోతే నీకు కనీసం పన్నెండు వేల ఐదు వందల డాలర్లు వాళ్ళు బాకీ ఉన్నారన్న మాట! సివిల్‌ కేస్‌ ఐతే అంతతో పోతుంది. ఇంకా కావాలంటే మనం వాళ్ళ మీద కిడ్నాప్‌ కేస్‌ పెట్టొచ్చు.”

“మీ చాదస్తం మరీ మితిమీరి పోతున్నదే! నన్ను వాళ్ళు కిడ్నాప్‌ చెయ్యడం ఏమిటి?”
“నీ ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళు నిన్నక్కడ కొంత కాలం వుంచారు కదా! నువ్వే చెప్పావు, పాపకు ఒక నెల దాటాక తిరిగి రావాలని అనిపిస్తున్నదని, అందుకు అమ్మాయి ఒప్పుకోలేదని. అంటే వాళ్ళు నిన్ను నీ ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళింట్లో ఉంచారనే కదా! పైగా నీకు మరో దారి లేదు. నీ అంతట నువ్వు వాళ్ళని ఒదిలేసి రాలేవు. అంటే నీ మీద కంట్రోల్‌ అంతా వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా కిడ్నాపింగ్‌ కిందికే వస్తుంది.”
“మరీ అంత దూరం వద్దులెండి. అమెరికాలో వాళ్ళంతా మనల్ని ఆడిపోసుకుంటారు!”
“వాళ్ళకీ తెలిసిరావాలి మరి తల్లిదండ్రులంటే కూలీ నాలీ లేకుండా పనిచేసి పెట్టే బాండెడ్‌ లేబర్‌ కాదని! ఎవరికి వాళ్ళు మనసుల్ని మభ్య పెట్టుకుంటూ సమస్య లేనట్లు నటిస్తే తీరేది కాదు ఇది. మనలా ఎవరో ఒకరు నిజం బయటకు తెచ్చి కనువిప్పు కలిగించాలి.”
*****

Friday, December 07, 2007

పని పిల్లలు

మ్మా నేను బడికి పోతానే … అందరు పిలకాయల్లాగా నేను కూడా మంచిగా చదువుకుంటానే ” పొద్దున్నే నిద్ర లేచి కళ్ళు నలుపుకుంటు అడిగాడు తల్లిని.

” పోతావురా నువ్వు బడికి పోతావు … మీ అయ్య వల్లకాటికి పోతాడు నేను రెక్కలు ముక్కలు చేసుకుని మీ ఇద్దర్నీ పోషిత్తా ….. బడికి పోతాడంట బడికి అయినా బడికి పోయేది మనసుంటోల్లు కాదురా దానికీ ఎప్పుడో పుణ్ణెం చేసుకోనుండాలి …. పొద్దున్నే ఎదవాలోచనలు చెయ్యకుండా లేచి పనికి బయలుదేరు ” తల్లి మందలింపుతో ఆ పసి హృదయం చివుక్కుమంది
“అదేందమ్మా పిలకాయలు బడికి పోము మొర్రో అంటుంటే వాల్ల అమ్మా వాల్లు పొమ్మని బతిమాలుతుంటారు నువ్వేమో నేను బడికి పోతానమ్మా అంటే తిడుతున్నావు” అమాయకంగానే అడిగినా తల్లి హృదయానికి తగిలాయామాటలు , చెప్పేందుకు సమాధానంలేదు తనదగ్గర.

“చెప్పానా పిచ్చి పిచ్చి గా అదీ ఇదీ ఆలోచించొద్దని “ కోపంగా చెప్పింది , అంతే కిమ్మనకుండా ఇంట్లోకి వెల్లి సద్దెన్నం తిని అక్కడినుండి బయలుదేరాడు, కొంచం సేపు అక్కడా ఇక్కడా తిరిగి , బడి మొదటిగంట కొట్టే టైంకిి ఆ వీధి చివర వేపచెట్టు కిందున్న అరుగుమీద కూర్చుని ఆ దారి వెంట వెల్లే వాల్లను చూస్తూ ఉన్నాడురోజూ చూసేదే అయినా ఏరోజు కారోజు కొత్తగానే అనిపిస్తుంటుంది జట్లు జట్లుగా వడి వడి గా నడుచుకుంటూ భుజానికి వ్రేలాడే పుస్తకాల సంచులతో కొందరు అమ్మో , నాన్నో , అమ్మమ్మో , నాన్నమ్మో లేక తాతయ్యో ఎవరిదో ఒకరి వేలుపట్టుకుని బుడి బుడి అడుగులు వేసుకుంటూ మధ్య మధ్యలో ఆగి తనకు వింతగా కనిపించినదేదో చూస్తూ, జారిపోతున్న నిక్కరును ఓ చేత్తో పైకి లాక్కుంటూ నడిచే చిన్నారులు కొందరు నేను బడికెల్లను మొర్రో అని మారాం చేస్తుంటే చంకనేసుకుని ఎందుకెల్లవు రా అని గదుముతూనో లేక వెల్తే నీకు అది కొనిపెడతాను ఇది కొనిపెడాతాను అని బుజ్జగిస్తూ తీసుకెల్లే వాళ్ళు కొందరు ఇలా అందరి గమ్యం ఒక్కటే అదే బడికి వెల్లి చదువుకోవడంమనసులో ప్రతీ రోజూ వచ్చే ఆలోచనే బడి గంట మోత వింటూ అందరిలాగా పుత్తకాల సంచీ తగిలిచ్చుకుని “అమ్మా నేను బడికెల్తన్నానే ” అంటూ బయలుదేరేదెప్పుడు, అయినా ఇంత మంది పిలకాయలు చేసుకున్న పుణ్ణెమేంది నేను చేసుకున్న పాపమేంది ఒకేళ నేను పాపమే చేసుంటే దానికి పరిహారం ఈ జల్మకు లేనట్లేనా ఒకవేళ ఉంటే ఎప్పుడు , నేనూ అందరిలా బడికెల్లేదెప్పుడు? ఇలా ప్రతీ రోజూ ఓ అరగంట ఆ అరుగుమీద కూర్చుని ఉదయమే బడికి వెల్లే పిల్లల్ని చూస్తూ తనలో తాను బాధపడుతూ తనను తాను ప్రశ్నించుకుంటూ ఉంటాడు.

“ఓరి కిట్టిగా ఎక్కడ చచ్చావు రా …. టైమవుతా ఉండాది పనిలోకి పోవా ఏందియ్యాళ …..” వీధికి ఆచివర ఉండి అరిచింది లచ్చమ్మఒక్కసారి స్పృహలో కి వచ్చాడు కిట్టిగాడు పుట్టినప్పుడు మంచిగా కృష్ణమోహన్‌అని పేరుపెట్టారు కాని వాడికి ఊహ తెలిసినతరువాత పిలిచే ప్రతి ఒక్కరూ కిట్టిగా అనేవాల్లేగాని అసలుపేరుతో పిలిచినవాళ్ళు లేరు
” ఆ వత్తన్నా ఎందుకంత గొంతు చించుకోని అరుత్తుండావ్‌పనిలోకి పోక సత్తాన చెప్పు ” అంటూ తల్లి కి ఎదురెల్లి చేతిలో ఉన్న సంచీ తీసుకుని బుజానికి తగిలించుకుని తనలో తానే చిన్నగా నవ్వుకుంటూ అక్కడినుండే వెనుతిరిగాడు ‘అందరూ పుస్తకాల చంచీ తగిలింకుకుంటుంటే నేను తిండిబోతోడి లా మద్దేనం తినేదానికి సంచీ తగిలించుకుంటున్నా ‘ మనసులో అనుకుంటూ నడుస్తున్నాడు,

“ఏందిరో నీలో నువ్వే తెగ నవ్వేసుకుంటున్నావ్‌….. మాకూ చెపితే మేం కూడా కొంచం నవ్వుతాంకదా ” నవ్వుతూ అడిగాడు అప్పటిదాకా కిట్టిగాడికోసమే ఎదురుచూస్తూ ఉన్న రాముడు, రాముడు వయసులో కిట్టిగాడికన్నా ఓ మూడేల్లు పెద్దవాడు ఇద్దరూ మంచి స్నేహితులు చిన్నప్పటినుండీ ఇద్దరూ ఒకే చోట పని చేస్తున్నారు.

“ఎంతసేపయిందేంది నువ్వొచ్చి ” అడిగాడు కిట్టిగాడు
” ఆ ఇప్పుడే మీ అమ్మ నీకోసం కేకేసిందే అదిని ఇంట్లో నించి బయటకొచ్చా ఇక నువ్వు రాకపోతావా అని ” చెప్పి “అదిసరే ఎందుకు నవ్వుతున్నావో చెప్పలేదు ” అడిగాడు
“ఏమీలేదురా ఊరికే సంచి తగిలించుకుంటుంటే నవ్వొచ్చింది ” అంటూ తనకు నవ్వురావడానికి గల కారణం చెప్పాడుఈ సారి నవ్వడం రాముడి వంతయింది
“ఇప్పుడు నువ్వెందుకు నవ్వుతున్నావురా …. అందుకే నేనెవరికీ ఏదీ చెప్పకూడదనుకుంటా ” చెప్పాడు కిట్టిగాడు
“అందుక్కాదులేరా నా చిన్నప్పుడు నేనూ నీలా నే అనుకునే వాడిని అది గుర్తొచ్చి నవ్వొచ్చింది అంతే ….. నిన్ను ఎగతాలి చెయ్యడానికి నవ్వలేదు ” సంజాయషీగా చెప్పాడు
“నీక్కూడా అలానే అనిపించేదా ? ” అమాయకంగా ప్రశ్నించాడు
“ఏ నేను మాత్రం నీలా మనిషిని కాదా …. నాకూ బడికెల్లి చదువుకోవాలని ఉండదా ?” చెప్పాడు
” ఒరే నాకో చిన్న అనుమానం అడగనా ? ” మెల్లగా అడిగాడు కిట్టిగాడు
“అడుగురా….”
“అదే రా మనం ఒక్కసారన్నా బడిలో అడుగుపెడతామంటావా ?? ” ప్రశ్నించాడు
“నీసంగతి నాకు తెలియదుకాని నేను మాత్రం రెండు మూడేల్ల క్రితం ఒకసారి ఓ వారం రోజులు బడికెల్లాను రా …..”నడుస్తున్నవాడల్లా ఒక్కసారిగా నిలబడిపోయి “నిజమా ” ఆశ్చర్యపోతూ అడిగాడు“నిజమేరా ” చెప్పాడు” మరి నాకెప్పుడూ చెప్పలేదే” మల్లీ తిరిగి ప్రశ్నించాడు“ఇందులో చెప్పేదానికేముంది అప్పుడేదో అట్టా జరిగింది ”
“మీ అమ్మా అయ్యా నిన్ను బడికి పంపించారా ” ఇంకా నమ్మకం కుదరనట్లు అడిగాడు
“వాల్లు పంపించలా ….. బడిలో అయ్యోర్లొచ్చి తీసుకెల్లారు ”“అదెట్టా …”“అప్పుడేదో పండగంట …. అదేంపండగబ్బా ” అని తల గోక్కుంటూ కొంచం సేపు ఆలోచించుకుని ” ఆ అదే చదువుల పండగ , ఆ పండగప్పుడు పిల్లలు పనిలోకిపోకూడదని గవర్నమెంటోల్లు రూలు పెట్టారు అందుకే సేటు ఆ వారంరోజులు సెలవిచ్చాడు మా అయ్య వేరే గత్తెంతరం లేక బడికి పంపించాడు
“చదువుల పండగా ?” నేనెప్పుడూ వినలేదే ఇది అడిగాడు కిట్టిగాడు
“నేనుకూడా అప్పుడే విన్నా … అంతక ముందుగానీ ….. ఆ తరువాతగానీ ఎప్పుడూ ఇనలా ”
“మరి అన్నీ పండగలూ పెతేడూ వత్తయి కదా మరి ఈ పండగ రాదా … ? ” అమాయకంగా ప్రశ్నించాడు
“అదే నాకూ అద్దం కావటల్లా అన్నీ పండగల్లా అది పతేడూ రావడంలేదు ఎందుకో నాకయితే తెలియదు ” చెప్పాడు
“అయినా మనం బల్లోకని వెల్తే ఇంట్లో కూడెలా వత్తదిరా చెప్పు మీ అమ్మా మాయమ్మా నాలుగిల్లలో పాసిపని చేసి ఒకపూట వాల్లు పెట్టే ముద్ద తీసుకొచ్చి మనకు పెడతండారు వాల్లు నెలకిచ్చే వందో రెండొందలో రెండో పూటా మూడో పూటా మన తిండికే సరిపోదు మరి రోగాలనీ దవాఖానాలని ఇంటి ఖర్చులని వీటన్నిటికీ డబ్బులెలా వత్తాయ్‌రా ”
“చదువుకున్నాక పెద్ద ఉద్దోగం చేత్తాం కదా, అప్పుడు మరిన్ని డబ్బులొస్తాయి కదా ” మరిన్నీ అనే పదాన్ని నొక్కిపలుకుతూ చెప్పాడు కిట్టిగాడు
” ఓ రి పిచ్చి మొద్దా పెద్ద చదువులు చదవాలంటె పుత్తకాలనీ , పీజులనీ డొనేషన్లనీ చాలా డబ్బులు కావాలి మన దగ్గర అన్ని డబ్బుల్లేవు అలా కాకుండా ఇప్పుడు బడికెల్లినా పెద్ద పీజులు కట్టే చదువుకొచ్చేటప్పటికి మనం మల్లీ ఇదే పని చెయ్యాల , అప్పుడు చదువు మద్దెలో మానేయడమంటే చాలా బాదగా ఉంటాది అందుకే ఇప్పుడునుంచే ఈ పని చేస్తే ఏ బాదా ఉండదు ” వివరంగా చెప్పాడు రాముడు
“ఇవన్నీ నీకెలా తెలుసురా “అడిగాడు కిట్టిగాడు
“మన కాలనీలో ఎంతమంది లేరు చదువుకుంటు చదువుకుంటు మద్దెలో మానేసినోల్లు వాల్లందరికీ చదువుకోవాలనే ఉం టుంది కానీ అందరూ పుత్తకాలకీ పీజులకీ డబ్బుల్లేక మద్దెలో మానేసినోల్లే ” చెప్పాడు రాముడు
“రేయ్‌ఏందిరా నీటకంగా పెళ్లి నడక నడుస్తున్నారు తొందర్రండి అవతల టైం అయిపోతుంది …. వచ్చి బండెక్కండి ” సూపర్వైజర్‌కేకతో ఈ లోకంలోకొచ్చారిద్దరూ
“అప్పుడే అడ్డాకాకికొచ్చామా ? ” ప్రశ్నించాడు కిట్టిగాడు
“ఆ …. పద వాడు తిడతాడు ” సూపర్వేజర్నుద్దేసించి చెప్పాడు రాముడు
“అదికాదురా …..” ఎదో చెప్పబోయాడు కిట్టిగాడు
“ఇప్పుడుకాదు ఆనక్క మాట్టడుకుందాం పద బండెక్కు ” అంటూ పరిగెత్తుకెల్లి బండెక్కాడు రాముడు, రామున్నే అనుసరించాడు కిట్టిగాడు , ఇద్దరూ ట్రక్కులోకెక్కారు.

ఆ ట్రక్కులో తమలాంటి పిల్లాలే ఎక్కువ మంది మొత్తం నలబై మందికి పైగా ఉన్న ఆ ట్రక్కులో ఓ ఏడెనిమిది మంది మాత్రమే పెద్దవాళ్ళుంటారు మిగిలిన అందరూ ఏడు సంవత్సరాల వయసునుండి పదిహేనేల్ల వయసు మగపిల్లలూ ఆడపిల్లలే వీల్లందరూ పనిచేసేది ఝూట్‌మిల్లులో ఎక్కిన కొంచం సేపటికే బండి కదిలింది.

బండి దిగి అందరూ లైనులో నిల్చున్నారు ఒక్కొక్కరి సంచి చెక్‌చేసి పేరు చెప్పాక రిజిస్టరులో హాజరు వేసుకుని లోపలకు పంపిస్తారు సెక్యూరిటీ వాళ్ళు. గేటులో నుండి లోపలకు అడుగుపెట్టడంతోటే ఎవరి లైనుకు వాళ్ళు వెళ్ళిపోతారు లోపలంతా దుమ్మూ ధూళి. ఒక్కోసారి నాలుగైదు అడుగుల దూరంలో ఉన్న వ్యక్తి కూడా కనిపించనంతగా దుమ్ము లేస్తుంది అదే పీల్చుతూ లోపల పనిచేసేవాల్లకు అవీ ఇవీ అందించడం ఉదయం నుండి సాయంత్రం వరకూ ఒక్కచోట నిలబడడానికి కానీ కూర్చుంటానికిగానీ ఖాలీ దొరకదు మధ్యాహ్నం అన్నం తినేందుకు కేవలం అరగంట మాత్రమే టైం ఉంటుంది ఇంతా కష్టపడితే వచ్చేది రోజుకు ఇరవై నుండి ముప్పై రూపాయలు అదీ వయసునుబట్టిఆరోజు మద్యాహ్నం అన్నం తినేటప్పుడు మల్లీ బడి ప్రస్తావన తెచ్చాడు కిట్టిగాడు
“అదిసరే రా నువ్వు పొద్దున చెప్పావే బడి మానేసినోల్లంతా పీజులు కట్టలేకో పుత్తకాలు కొనలేకో మానేసారని మరి గవన్నమెంటోల్లు మనసుంటోల్లకు పీజులు కట్టించుకోరంట అదీకాక పుస్తకాలుకూడా ఇస్తారంటకద ” అడిగాడు
“ఒరే నీకు తెలీదురా పీజులు కొన్నిరోజులే కట్టించుకోరు పుత్తకాలిత్తారు కానీ నోడుసులు అవీ ఇవీ చాలా ఉంటాయ్‌కదా అవన్నీ మనమే కొనుక్కోవాల అయినా ఆల్లు చెప్పేది ఒకటి చేసేది ఒకటి నీకివన్నీ తెలియదు ర అనవసరంగా బడిగురించి ఆలోచించకుండా పని చేసుకో ఎక్కువాలోసిత్తే పిచ్చెక్కుద్ది ”
“అవున్రా నాకు బడి పిచ్చెక్కింది ”
“అరే కిట్టిగా నీకో విషయం చెప్తా వింటావా మనం ఎంత అనుకున్నా చదువుకోలేము నేనూ చదువుల పండగప్పుడు బడికి పోయినప్పుడు ఎంతో ఆనంద పడ్డా ఇక నా జీవితం మారిపోయింది అందరిలా నేనుకూడా చదువుకోవచ్చు అని కానీ ఏమయింది వారం గడిచాక ఆ పండగ అయిపోయాక మల్లీ బడికిపోతానంటే మా అమ్మా, అయ్యా ఒప్పుకోలేదు చదువుల పండగప్పుడు పనిలో కి రానివ్వని సేటు పండగయిపోగానే ఇంటికి సూపెర్వేజర్ని పంపాడు పనిలోకి తీసుకురమ్మని పోనీ ఆ అయ్యోరన్నా వచ్చి మీ అబ్బాయిని బడికి పంపించండి అంటాడేమో అని ఓ వారం రోజులదాకా ఎదురుచూశా ఎమీ లాబం లేదు అందుకే అట్టాంటి పండగొచ్చినా ఈ సారి నేను బడికి పోదలుచుకోలేదు ”
“ఏ ఎందుకు ” అయోమయంగా అడిగాడు కిట్టిగాడు
“ఎందుకంటే వారం రోజులో పదిరోజులో పోతే కనీసం ఓ న మః లు కూడా రావు…తరువాత ఆ బడికి పోయిన రోజుల్ని గుర్తు చేసుకుంటూ చానాలు బాద పడాల ”
ఆలోచనలో పడ్డాడు కిట్టిగాడుఇంతలో అన్నం టైం అయిపోయింది మళ్లీ ఎవరి పనిలోకి వాళ్ళు వెల్లిపోయారు.
******

సాయంత్రం ఆరుగంటలకు మల్లీ ట్రక్కులో ఎక్కారు,

ఇంటికొచ్చి నీల్లుపోసుకుని అన్నంతిని పక్కమీద పడుకున్నాడు, వాడి ఆలోచనంతా ఒక్కటే ‘ నేను బడికెల్లి చదువుకోవాలంటే ఏం చేయ్యాల ?,‘అయ్యా బడికిపోతానే అంటే ఏడిచావ్‌ ఎదవ , బడి గిడి అన్నావంటే చమడాల్‌ తీత్తా అయినా చదివి నువ్వేం సేత్తావ్‌రా పని చేసుకుంటే నాలుగు డబ్బులన్నా వత్తాయి అని తన్నినంత పని చేత్తాడు పనికి పోతే నాలుగు డబ్బులొత్తాయ్‌అని చెప్పే ఆయనెందుకు పనికిపోడో అడుగుదామంటే నిజంగానే తంతాడేమో అని బయం, ఆ పసాదు గాడు చేసినట్టు చదువుకోసం దొంగతనం చేసి జైలుకెల్తే ? వచ్చాక అందరూ దొంగోడంటారు అదీకాక అమ్మ నన్ను చూడకుండా ఉండలేదు మరేం చేయాల, తెల్లారే లోగా ఏదో ఒకటి చేయ్యాలంతే ‘ ఆలోచిస్తా నిద్రలోకి జారుకున్నాడు కిట్టిగాడు.

“అమ్మా నేను బడికి పోతానే , అందరిలా చదువుకుని పెద్దయ్యాక నిన్ను మారాణిలా చూసుకుంటానే నన్ను బడికి పంపవే నీకు దణ్ణం పెడతాచూడవే అందరు పిలకాయలు బడికెల్లోచ్చి ఎంచగ్గా ఆడుకుంటున్నారు నేనలా ఆడుకోనే ఈ టైములో ఏదన్నా పనిచేసి నాలుగు డబ్బులు తెత్తానే , ఎప్పట్లాగే నీకు సాయంగా ఉంటానే నీకు పుణ్ణెముంటదే అయ్యకు ఏదోకటి చెప్పి నన్ను బడికిపంపవే … ”

మొదట్లో వాడేమంటున్నాడొ అర్దం కాకపోయినా పదే పదే ఈ విషయాన్నే కలవరిస్తుండడంతో ఒక్కసారి కళ్ల వెంట నీరు కారడం మొదలయింది లచ్చమ్మకి నిద్దర్లో ఏడుస్తున్న కిట్టిగాడి పక్కనే కూర్చుని వాన్ని తన ఒల్లో పడుకో పెట్టుకుని వాడికల్లు తుడుస్తూ ” ఏమి చెయ్యనురా నేను …చావనా చెప్పు, మీ అయ్య ఏదయినా పని చేత్తే నువ్విలా కట్టపడాల్సిన పనేముంది ఆడు పని చెయ్యడు నేను తెచ్చే సొమ్ము మనం తింటానికి సరిపోదు కన్న కొడుకు చదువుకుంటానంటే బడికి పంపలేని దరిద్రురాలి కడుపున పుట్టావు రా ఈ జనమకి మీ అయ్యా మారడు , మనకీ కట్టాలూ తప్పవు, కనీసం వచ్చే జనమలో అన్నా బడికి పంపించే చల్లని తల్లి కడుపున పుట్టి నీ కోరిక తీర్చుకో ” అంటూ తాను ఏడుస్తూనే వాన్ని సముదాయిస్తుంది లచ్చమ్మ.******

ఉదయం నిద్రలేచి పక్కమీద కిట్టిగాని కోసం చూసింది లచ్చమ్మ ఇంటి చుట్టుపక్కలవెతికి కనిపించిన వాల్లందరినీ అడిగింది ఎవరూ చూడలేదనడంతో గుండెలు బాదుకుని ఏడుస్తుంది.

ఈ కధ తొలి ప్రచురణ www.eemaata.com

Tuesday, December 04, 2007

కల చెదిరింది !!

అది 2002 వ సంవత్సరం,

వినయ్‌ ఉద్యోగం లో చేరి అప్పుడే ఆరు నెలలైంది..

అది ఊడి కూడా రెండు రోజులు కావొస్తోంది.

ఈ దేశం కాని దేశంలో, ఈ కాలం కాని కాలంలో తనకున్న క్వాలిఫికేషన్‌కి ఉద్యోగం వేటలోనే దాచిన డబ్బంతా ఐపోయేట్టు కనిపిస్తోంది. తనకి తెలిసిన వాళ్ళు చాలా మంది చేస్తున్నట్టు ఈ ముసురు తగ్గేవరకు ఇండియా గూట్లో తలదాచుకుంటే ఎలా ఉంటుంది? తీవ్రంగా ఆలోచిస్తున్నాడు వినయ్‌.
ఇది చావు బతుకుల సమస్య.

ఇంతలోఎప్పుడూ లేనిది ఇండియా నుంచి నాన్న ఫోను చేసి, వెంటనే తిరిగి చెయ్యమని చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు.
అలాగే చేశాడు వినయ్‌.

“హల్లో, నాన్నా నేను, వినయ్‌ని”
“ఆ..ఏరా బాగున్నావా..”
“నేను బాగానే ఉన్నా.. అమ్మెలా ఉంది?”
“బాగానే ఉంది గానీ నీతో ఒక విషయం మాట్లాడాలని ఫోన్‌ చేశాన్రా”
“డబ్బేమన్నా కావాలంటాడా?” గతుక్కుమన్నాడు మనసులోనే.
“అదేరా.. మీ కృష్ణమూర్తి మామయ్య వాళ్ళ అమ్మాయ్‌ ని నీకిస్తానంటున్నాడు ..
ఓ నలభయ్‌ లక్షల దాకా ఇస్తాడంట ..ఏ విషయం చెప్పమని ఫోన్‌ చేశాడు. నిన్నడిగి చెప్తామని చెప్పా .. తెలిసిన సంబంధం, మేనరికం! అదీ కాక అమ్మాయి కూడ చిన్నప్పటి నుంచి మన కళ్ళ ముందే పెరిగిన పిల్ల. ఏమంటావ్‌ ?” నాన్‌ స్టాప్‌ గా చెప్పుకుంటూ పోతున్నాడు..

ఆలోచనలో పడ్డాడు వినయ్‌.

“నేననే దేముంది గాని అమ్మేమంటుంది?” అంతిస్తామంటే అమ్మ మాత్రం వద్దంటుందా?!
“మీ అమ్మ ఓ .. సంబరపడి పోతున్నది. సొంత అన్నకూతురే కదా! ఒద్దంటుందా?”
“అది సరే, బైటైతే ఇంకా ఎక్కువిస్తారేమో?”

“అదీ నిజమే ననుకో! కాకపోతే చిన్నప్పట్నుంచీ అనుకుంటున్నాం కదా! ఇంకో విషయం వాళ్ళ కొడుకు రాంబాబు గాడెటూ అమెరికా లోనే సెటిల్‌ ఐపోయే! వీళ్ళిక్కడ సంపాయించింది అంతా ఇంక ఆ అమ్మాయికే కదా వస్త? ఇప్పుడు నలభై ఇచ్చినా, తరవాత చాలానే వస్తుంది..”

“అమ్మ నా నాన్నా … ఎంత దూరం అలోచించావ్‌ ? ఈ ఐడియా నాకు తట్టనేలేదు” మనసులో అనుకున్నాడు.
“ఏమాలోచిస్తున్నావ్‌?” సమాధానం రాకపోవడంతో రెట్టించాడు తండ్రి.
“ఆలోచించేందుకు ఏముంది? మీ ఇష్టం!”

“మరి నువ్వు రావడానికి ఎప్పుడు కుదురుతుందో చెప్తే, అప్పుడు ముహూర్తాలు పెట్టిద్దాం”
“ఒక నెల రోజుల్లో ఇక్కడ నా కాంట్రాక్ట్‌ ఐపోతుంది. అప్పుడు రావటానికి కుదురుద్ది”
“కాంట్రాక్ట్‌ ఏమిటి? పరిమినెంట్‌ ఉద్యోగం కాదా?”
“ఇక్కడలా ఉండదు”
“ఐతే తరవాత వెంటనే ఇంకో ఉద్యోగం దొరుకుద్దా?”
“ఏదొకటి దొరుకుద్దిలే!”కొద్ది సేపు ఊర్లో విషయాలు మాట్లాడి ఫోన్‌ పెట్టేశాడు. ఒక వైపు ఆనందం. మరో వైపు బాధ. ఎంతలో ఎంత మార్పు!

పుట్టగొడుగుల్లా లేచిన డాట్కాంలు కాంగా సర్దుకుంటున్నయ్‌. ఇప్పట్లో ఉద్యోగం దొరక్కపోతే? తలచుకోవడానికే భయంగా ఉంది. ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే, తన లాటి వాళ్ళే! ఒకళ్ళకొకళ్ళు వీళ్ళే పోటీ ఏ ఉద్యోగానికి వెళ్ళినా! చూస్తుంటే తనే అందర్లోకీ ఆలస్యంగా వచ్చినట్టున్నాడు!

నాలుగైదేళ్ళ క్రితం చేపల చెరువులు వేసిన వాళ్ళు లక్షలు, కోట్లు సంపాయిస్తున్నారని ఊర్లో పొలాలన్నీ చెరువులుగా మార్చి చివరకు ఇళ్ళు కూడా అమ్ముకున్నారు జనం. ఆ తరవాత కోళ్ళ ఫారాలు .. ఆ తర్వాత రొయ్యల చెరువులు .. ఆపైన నాపరాళ్ళు .. ఆ అన్నిట్నీ మించింది ఈ కంప్యూటర్‌ పిచ్చి. డిమాండ్‌ బాగా ఉన్నప్పుడు అందరూ అదే చెయ్యబోవటం మనవాళ్ళ స్వభావంలా ఉంది. ఎవరో ఒకడు ఏదో కొత్తదాన్లో ఎంతోకొంత సంపాయిస్తే ఓ వంద మంది అదే బిజినెస్‌ చేసి మనం కూడా సంపాయిద్దాం అనుకుంటారే గాని దాన్లో ఇంతమందికి అవకాశం ఉందా లేదా అని ఆలోచించరు.

కాకపోతే తండ్ర్రితో మాట్టాడిన తరవాత వినయ్‌కి కొంత ధైర్యం వచ్చింది. ఉద్యోగం దొరక్కపోయినా, కట్నం డబ్బుతో ఏదో బిజినెస్‌ ఐనా పెట్టుకోవచ్చు! తిరుగు ప్రయాణం వైపుకి మళ్ళినయ్‌ ఆలోచనలు.

వినయ్‌ తండ్రి శేషగిరి రావు కూడ అదే సమయంలో ఆలోచనల్లో విహరిస్తున్నాడు.ఎంతలో ఎంత మార్పు! నిన్న గాక మొన్నలా ఉంది వినయ్‌ కాలేజ్‌ డిగ్రీ పూర్తిచేసి పనేం లేక ఊళ్ళ మీద తిరగటం.

ఆ రోజు ..

కాలింగ్‌ బెల్‌ మోగుతుంటే, నిద్రలోంచి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశాడు తను. గోడ గడియారం మూడు గంటలైనట్టు చూపిస్తోంది. ఇప్పుడెవరై ఉంటారబ్బా అనుకుంటూ కలేమో నని ఆలోచిస్తుంటే మళ్ళీ బెల్‌ మోగిన శబ్దం. పక్కనే ఉన్న భార్యను నిద్ర లేపబోయాడు. బెల్‌ మోగిన శబ్దం కూడా వినిపించనంత గాఢ నిద్రలో ఉంది. కళ్ళు నలుపుకుంటూ.. అడుగులో అడుగు వేసుకుంటూ అతికష్టం మీద తలుపు వైపు నడిచాడు. తన ప్రమేయం లేకుండానే కుడిచేతి చూపుడు వేలు స్విచ్‌ మీద పడింది. లైటు వెలిగింది. తలుపు తెరిచి ఎదురుగా నిల్చుని వున్న కొడుకుని చూడగానే కళ్ళల్లో ఆనందం..

“ఏరా. ఇదేనా రావడం..”

నవ్వుతూ “అవును” అంటూ లోనికి నడిచాడు, “ఏమేవ్‌ . అబ్బాయొచ్చాడు లే..” తట్టి లేపాడు పార్వతమ్మను. చివుక్కున లేచి కూర్చుంది. ఆమె కళ్ళు కొడుకుకోసం వెతికాయి.
కుర్చీలో కూర్చుని షూస్‌ విప్పుతున్న కొడుకును చూడ్డం తోనే, “ఏరా..భోజనం చేసే బయల్దేరావా?” అని అడిగింది. “ఆ, తిన్నానమ్మా”
“ఏరా ఇలా చిక్కి పోయావు .. వేళకి తింటున్నావా లేదా?”
“నేను చిక్కి పోవడం ఏమిటమ్మా?”
“ఏం తింటున్నవ్‌ రా? రోజు రోజుకూ తెగ బలిసిపోతున్నావ్‌ ?” నవ్వుతాలుగా రోజూ ఫ్రెండ్స్‌ అనే మాటలు గుర్తొచ్చినయ్‌ .

ఉదయం తొమ్మిది గంటలైంది. అసలు విషయం మెల్లగా బయటపెట్టాడు వినయ్‌.శేషగిరి రావుకి తిక్కరేగింది. “చదువు అయిపోయి రెండేళ్ళయింది. ఆ సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తయ్యీ కావటంతోటే ఉద్యోగం వొచ్చేస్తుంది, ఆ తర్వాత, ఓ.. వొరగ బెట్టేస్తా నన్నావ్‌ .. సరే అని వేలకు వేలు పోసి ఆ డిగ్రీ పూర్తిచేయించా! ఆ తరవాత మళ్ళీ ఏవో జాంగ్రీలనీ గీంగ్రీలనీ ఇంకో లక్ష వాటిమీద తగలేశావ్‌! ఇప్పుడు అమెరికా పోవటానికి వాడికెవడికో రెండు లక్షలివ్వాలని వచ్చి కూర్చున్నావ్‌! ఇక్కడ డబ్బులేమన్నా చెట్లకి కాస్తున్నయ్యా? ఇక నా వల్ల కాదు. ఒక్క పైసా కూడ ఇవ్వను. నీ తరవాత చదువులు ఐపోయిన వాళ్ళు బోలెడు మంది పైసా ఖర్చు పెట్టకుండా అమెరికా వెళ్ళి లక్షలు సంపాయిస్తున్నారు. వాళ్ళని చూసైనా బుద్ధి తెచ్చుకో.”

“ఎవరినో చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం నాకులేదు, నా ఇండివిడ్యువాలిటీ నాకుంది..” మెల్లగా అన్నా అవి శేషగిరి రావు చెవుల్ని చేరినయ్‌.

“ఆ.. తల్లి దండ్రుల్ని పోషించాల్సిన ఈ వయసులో కూడా వాళ్ళ మీద ఆధారపడడమేనా నీ ఇండివిడ్యువాలిటీ? …ఇంతవరకు తగల బెట్టింది చాలు, పెట్టే బేడా సర్దుకోనొచ్చెయ్‌ , ఇక్కడే వ్యవసాయం చేసుకుని బతకొచ్చు”.

అప్పటి దాకా మాట్లాడకుండా అన్నీ వింటున్న పార్వతమ్మ ఇక తప్పదని రంగం లోకి దూకింది.

“అయిందేదో ఐంది. చెట్టంత కొడుకుని పట్టుకుని ఎందుకండీ అలా అంటారు? మనకున్నది వాడొక్కడే. రేపైనా వాడికివ్వాల్సిందే కదా? మీ మాటలకు నొచ్చుకుని రేపు వాడేమన్నా చేసుకుంటే?”

“చాలు ఆపు. దరిద్రపు నోరూ నువ్వూ!”
“ఆ.. నాది దరిద్రపు నోరే.. మరి మీ ఆలోచనలు ఏమయ్యాయ్‌? ఒక్కసారి ఆలోచించండి.. వీడు ఒక్కసారి అమెరికాలో అడుగుపెట్టి ఉద్యోగంలో చేరాడంటే చాలు.. వీడి రేటు ఇప్పుడున్న దానికి నాలుగు రెట్లవుతుంది.”
“ఆ.. ఇక్కడ రెండేళ్ళుగా రాని ఉద్యోగం అక్కడకెళ్ళగానే ఒచ్చి ఒళ్ళో పడుతుందా? వీడు అక్కడకు వెళ్ళాక కూడ ఖర్చులకు మనం పంపాల్సిందే. ఇక్కడైతే నెలకు రెండు మూడు వేలు అక్కడైతే, ఒకటి రెండు లక్షలు. అంతే తేడా!” “మీరు మరీ విడ్డూరంగా మాట్లాడకండి.. మా అన్న కొడుకు రాంబాబు . వాడేం పెద్ద తెలివైనోడా.. అమెరికా వెళ్ళి హాయిగా ఉద్యోగం చేసుకోవడం లేదూ? వాడికిచ్చినోళ్ళు మనోడికివ్వరా? ఆరునెల్ల క్రితం వాడికి పిల్లనివ్వడానికే రానివాళ్ళు, ఇప్పుడు ఇరవై లక్ష లిస్తామంటున్నారు.. మనోడికి ఉద్యోగం లేకపోయినా పిల్లనిస్తామని బోలెడు మంది అడుగుతున్నారు.. వీడొక్క సారి అమెరికా వెళ్ళాడంటే… ఇంకేమన్నా ఉందా!”
“నీ మొహం.. వీడికి పిల్లనిస్తామంటున్నది వీడి ముఖం నీ ముఖం చూసి కాదు! వీడికి ఉద్యోగం లేకపోయినా, నేను సంపాయించింది ఉందిగా, దాన్ని చూసి”

“అంటే, మీ ఆలోచనలు మీవేగానీ వాడి భవిష్యత్తు గురించి ఆలోచించరన్న మాట! ఒరే.. వినయ్‌ ఆయన మాటలు నువ్వేమి పట్టించుకోకు”

“ఆ . వాడినట్లా వెనకేసుకో నొచ్చే ఎందుకూ పనికిరాని వెధవని చేశావ్‌ ..” పైకలా అన్నా తను ఓడిపోయానని ఆయనకీ అర్థమై పోయింది.

సాఫ్ట్‌ వేర్‌ కి బోలెడు డిమాండ్‌ ఉందన్న విషయం విని కూడా ఇంతకు ముందెప్పుడూ దాన్ని గురించి ఆలోచించ లేదు వినయ్‌.. అనుకోకుండా ఇంకేదో పని మీద ఓ సారి హైదరాబాద్‌ వెళ్ళటం జరిగింది. అక్కడ దిగగానే ఎక్కడ చూసినా ముప్ఫై రోజుల్లో అది నేర్పుతాం, ఇది నేర్పుతాం అంటూ పెద్ద పెద్ద బానర్లు! పేపర్‌ తీస్తే ఫ్రీ ప్రాసెసింగ్‌ అంటూ కన్సల్టెన్సీల యాడ్స్‌! అంతా చూస్తుంటే ఏదో ఓ కన్స్ర్టక్షన్‌ కంపెనీలో చేరి ఎండలో మాడే కంటే ఓ రెండు మూడు నెలలు కష్టపడితే ఎంచక్కా సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీరై పోవచ్చు ననిపించింది. బాగా డిమాండ్‌ ఉన్న జావా ఐతే బెటర్‌ .. ఆలోచన రావడమే తరువాయి. ఇంటికి బయల్దేరటం, తండ్రి దగ్గర డబ్బు సంపాయించి తిరిగిరావటం, ఫీజు కట్టడం, అన్నీ చకచక జరిగి పోయినయ్‌ ..

మొదటి రోజు క్లాసులో అడుగు పెట్టాడు. క్లాసు రూం చూడగానే ఆశ్చర్యం.. ఓ పెద్ద హాలు. మూడొందల దాకా చైర్స్‌ . హాల్‌లో నాలుగు వైపుల స్పీకర్లు.. మధ్యలో ఓ కంప్యూటర్‌కు కనెక్ట్‌ చేసి ఓ చిన్న ప్రొజెక్టర్‌.. గోడకు వేలాడుతూ ఓ స్క్రీన్‌. చూస్తుంటే చిన్నతనంలో డేరా హాల్లో సినిమా రోజులు గుర్తొచ్చినయ్‌ .. క్లాసు మొదలయ్యే టైంకి హాలంతా నిండిపోయింది.. కొందరైతే కూర్చునేందుకు చోటు లేక నిల్చునే క్లాసు వింటున్నారు.. ఇంతకుముందు కొంచెం కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉన్నా వాళ్ళు చెప్పేదేవీ అర్ధం కావడం లేదు.

“ఇలా ఔతోంది నాకేనా?” అని అనుమానం వచ్చి ఓ ఇద్దరు ముగ్గురిని అడిగాడు.. వాళ్ళూ తన టైపే! మనసు కాస్త కుదుట పడింది.

క్లాసు ఐపోగానే లాబ్‌ లోకి వెళ్ళి చూస్తే.. అక్కడ ఓ యాభై కంప్యూటర్‌ లున్నై. ఓ రెండొందల మంది జనం. ఒక్కో సిస్టమ్‌ ముందు నలుగురైదుగురు. ఏదేదో చేసేస్తున్నారు. ఎవరేం చేస్తున్నారో వాళ్ళకైనా తెలుసో లేదో! ఓ ఐదు నిమిషాల తరవాత వాళ్ళ టైం ఐ పోయింది. వెళ్ళి ఓ సిస్టం ముందు కూర్చున్నాడు. ఏమి చెయ్యాలి? చేసేదేమీ లేదు. ఇంతలో చుట్టూ ఓ ముగ్గురు చేరారు. ఓ అరగంట టైం పాస్‌ తరువాత నలుగురూ కలిసి బైటకు నడిచారు. అదీ ఆరోజుకు ట్రైనింగ్‌!

రోజుకు ఒక్కో ఇన్‌స్టిట్యూట్‌లో నాలుగైదు బాచ్‌లు. బాచ్‌ కి రెండు మూడొందల మంది. రెణ్ణెళ్ళకో కొత్త బాచ్‌. ఓ వారం తరువాత ఉదయం క్లాసు టైంలో గేటు దగ్గర టికెట్లు చింపే వాడొకడు ప్రత్యక్షమయ్యాడు. వాడి పేరు నరేంద్రట. వాడి పని మొత్తం ఫీజు కట్టిన వాళ్ళను మాత్రమే లోపలికి పంపడం… మెల్లగా నరేంద్రతో పరిచయమైంది. దాని వల్ల ఎన్ని లాభాలున్నాయో తొందర్లోనే అర్థమైంది ఇన్‌స్టిట్యూట్‌కి కొంత మాత్రం ఫీజు కడితే, మిగిలిన దాంట్లో సగం ఫీజుకే రాత్రి వేళల్లో లాబ్‌లోకి పోనివ్వటం నరేంద్ర సైడ్‌ బిజినెస్‌! రోజులు గడుస్తున్నయ్‌, కోర్సులు ఐపోతున్నయ్‌. నరేంద్ర పుణ్యమా అని ఫీజు కట్టకుండా ఒకదాని తరవాత మరొకటిగా ఇన్‌స్టిట్యూట్‌ మార్చకుండా రెండు సంవత్సరాల పాటు పది వేల ఫీజుతోటే చాలా కోర్సులు పూర్తిచేశాడు, సర్టిఫికెట్లు సంపాయించాడు. ఇంటి దగ్గర తెచ్చుకున్న డబ్బుతో బ్రహ్మాండంగా ఎంజాయ్‌ చేశాడు. ఉద్యోగం కోసం ఊరంతా తిరిగి ఉపయోగం కనపడక ఇక లాభం లేదని ఓ తెలిసిన కన్సల్టెన్సీ ని ఆశ్రయించాడు. రెండు లక్షలు కడితే పేపర్లు ఫైల్‌ చెయ్యడానికి ఒప్పుకున్నారు వాళ్ళు.ఆ విషయం నాన్నతో చెప్పి డబ్బు తీసుకెళ్దామని వచ్చాడు. ఇక్కడి పరిస్థితి ఇలా ఉంది. ఆయననే మాటల్లో కొంత నిజం వున్నా, ఇలా అమెరికా వెళ్ళే అవకాశం చేతి దాకా వస్తే ఎలా వొదులుకోవటం?

మూడు నెలల తరువాత అమెరికా వెళ్ళే ఫ్లైట్‌లో ఉన్నాడు వినయ్‌. వెళ్ళిన పదిహేను రోజులలోనే పెద్దగా కష్టపడకుండానే జాబ్‌ దొరికింది. కల ఫలించింది!ఇక్కడ జాబ్‌ రావడం ఇంత సులభంకాబట్టే అమెరికా, అమెరికా అంటారందరూ! అనుకున్నాడు ఆనందంగా.తన అదృష్టానికి మురిసిపోయాడు వినయ్‌. ఇంట్లో తల్లిదండ్రులు కూడా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.ఇన్నాళ్ళూ ఎక్కడున్నారో కూడా తెలియని చుట్టాలకి కూడా హఠాత్తుగా వాళ్ళు గుర్తుకొచ్చారు ముఖ్యంగా ఆడపిల్లలున్న వాళ్ళకి! శేషగిరి రావుకి నిజమైన పుత్రోత్సాహం అంటే ఏమిటో ఇప్పుడు అనుభవమయ్యింది! వినయ్‌ మేనమామ కృష్ణమూర్తి ఇంట్లో ఫోన్‌ మోగింది.

“హల్లో నాన్నా! నేను, రాంబాబు ని..”
“ఏరా బాగున్నావా?”
“ఆ..బాగానే ఉన్నా.”
“ఎలా ఉంది నీ ఉద్యోగం?”
“అది చెపుదామనే ఫోన్‌ చేసా. నిన్ననే ఓ పెద్ద కంపెనీలో చేరా. ఓ ఆరునెల్ల దాకా పరవాలేదు.”
“మరి అందరూ ఉద్యోగాల్లోంచి పీకేస్తున్నా రంటున్నారు నిజమేనా?”
“ఏమీ నేర్చుకోకుండా డబ్బుల్తోటే సర్టిఫికెట్లు సంపాయించిన వాళ్ళ పని అలాగే అయిందిలే! అన్నట్టు చెల్లి పెళ్ళి విషయం ఏమౌతున్నదీ?”
“ఏమయ్యేదేముంది! వినయ్‌ రాగానే ముహూర్తాలు పెట్టుకోవడమే!”
“దాని గురించే ఆలోచించమంటున్నా.. వాడికిక్కడ జాబ్‌ పోయిందని ఎవరో అంటే విన్నా. అలా ఐతే మళ్ళీ ఇప్పట్లో రావటం కూడా కష్టం. అసలు వాడు ఇండియా వస్తున్నది అందుకనుకుంటా!”
“నువ్వేమంటున్నావో నాకర్ధం కావడం లేదు.”
“వాడు అక్కడ జాబ్‌ రాక వీసాకి రెండు లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడి కొచ్చాడు. ఇక్కడ కూడ జాబ్‌ పోవడంతో అక్కడి కొస్తున్నాడు. వాడు మనం ఇస్తామన్న డబ్బుల్తో ఏదో బిజినెస్‌ పెట్టాలని ఆలోచిస్తున్నట్టు స్నేహితుడొకడు చెప్పాడు..”
“అంటే మళ్ళీ వాడు అమెరికా రాడా?”

“అదే కదా నేను చెప్పేది! అక్కడే బిజినెస్‌ చేసుకునేట్టయితేవాడికే ఇవ్వాలనేముంది? మీరు ఊ అనండి, ఇక్కడ కాస్త దిట్టంగా సంపాయించి మంచి ఉద్యోగంలో ఉన్న వాణ్ణి నేనే చూస్తాను.. నిదానంగా ఆలోచించండి. ఈ విషయంలో తొందరపడొద్దు”

ఐతే కృష్ణమూర్తికి నిదానంగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ కనపడలేదు ఈ విషయంలో.వెంటనే శేషగిరి రావుకి ఫోన్‌ చేశాడు ఈ మోసం తేల్చేసి సంబంధం మానేస్తున్నామని చెప్పటానికి.***

ఈ కథ మొదటి ప్రచురణ 2002 సంవత్సరం జనవరి నెల ఈమాట వెబ్ పత్రిక.

Tuesday, November 27, 2007

ఏరుదాటాక....

ఈ మధ్య మా మిత్రుడొకాయన ఇండియా వెళ్ళొచ్చాడు , వచ్చినప్పటినుండి ఇండియా గురించి మనమేది మాట్లాడినా అతను దాని గురించి నెగటివ్ గా మాట్లాడ్డం నాకు కోపమూ మరియూ భాధ కలిగించింది - ఆ భాధే నాతో ఈ టపా రాయిస్తుంది.

నిజమే మనదేశం ఇంకా పూర్తిగా అభివృద్ది చెందలేదు ఇప్పుడిప్పుడే అభివృద్ది చెందుతూ ఉంది అలా అని అక్కడి ప్రతి విషయాన్ని అమెరికాతోనో ఆస్ట్రేలియాతోనో పోల్చి ఇండియాలో ఏమీలేదు అనడం ఎంతవరకు సమంజసం.

విదేశాల్లో ఉంటూ ఇండియా వెళ్ళొచ్చే చాలామంది భారతీయులు ఇండియాలో జరిగే ప్రతి చిన్నవిషయాన్నీ భూతద్దంలో చూస్తున్నారు.

ఇక మా మిత్రుని విషయానికొస్తే రెండుసంవత్సరాల క్రితం వరకూ ఆనందంగా తిరిగిన హైదరాబాదు నగరవీధులు ఇప్పుడసలు వీధుల్లానే కనిపంచడంలేదట " అసలు అవి రోడ్లేనా దుమ్మూ , ధూళి, పొగ తప్ప ఏముందక్కడ ?"అనేది ఈయనగారి ప్రశ్న - ఎవరైనా ఏమి సమాధానం చెప్పగలరు ఇతనికి బాగా ఎక్కువైంది అని మనసులో అనుకోవడం తప్ప.

ఇండియాలో ఏముంది దోమలు తప్ప అని అతనంటే నాకు కోపం రావడం లో తప్పు లేదు కదా? , మరి ఆ దోమలతోనే కదా ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా సహజీవనం సాగించాం ఏదో ఒకవిధంగా దోమలను తప్పించుకునో లేదంటే వాటిచేత కుట్టించుకునో అక్కడే బ్రతికాం కదా , రెండు సంవత్సరాలు బయట ఉండి ఇప్పుడు వెళ్ళి దోమల దెబ్బకి బతకలేక పోయాడంట అందుకే నాలుగు వారాలు ఉందామని వెళ్ళిరెండు వారాలకే తిరిగొచ్చాడట.


ఈయనగారికింకో పెద్ద కష్టమొచ్చి పడింది అదేమంటే ఇండియన్ న్యూస్ చానల్స్ లో వచ్చే ఇంగ్లీషు ఇతనికి అర్ధం కావడంలేదట....విన్నవాళ్ళకు నవ్వు , నవ్వుతో పాటు కోపం రాక ఏమవుతుంది చెప్పండి , రెండేళ్ళు అమెరికాలో ఉన్నంత మాత్రాన అక్కడి ఇంగ్లీషు అర్ధం కాకపోతే ఇంకో రెండేళ్ళుంటే బహుశా కని పెంచిన తల్లిదండ్రులను విధ్యా బుద్దులు నేర్పించిన గురువులను కూడా గుర్తుపట్టలేరేమో ఇలాంటి ప్రబుద్దులు.

(ఇలాంటి వాళ్ళు మనకు తరచూ ఎదురవుతూనే ఉంటారు ....వీళ్ళతో కొంచం జాగ్రత్త సుమా!! )

Thursday, November 22, 2007

తలరాత

"ఫోను రింగవుతుంటే వినిపించడంలేదా.....వెల్లి లిఫ్ట్ చెయ్యోచ్చు గా..."పక్కనే కూర్చుని టీ వీ చూస్తున్న కిరణ్ నుద్దేసించి పెంకులెగిరిపోయేలా అరిచింది శాంతి

పేరు చూసి మోసపోయి చేసుకున్నానురా భగవంతుడా అనుకుంటూ సీరియస్ గా ఓ చూపు చూసి మెల్లగా లేచి ఫోను అందుకున్నాడు

అవతలివైపునుండి ఏమిచెప్పారోగాని ఫోను పెట్టేసి ఓ పెద్ద వెర్రికేక పెట్టి,కల్లు తాగిన కోతిలా....... ఆహో ...ఓహో.... అంటూ కుప్పిగంతులేయడం మొదలుపెట్టాడు కిరణ్.

శాంతి మొదట్లో శాంతం గానే అడిగింది విషయమేమిటని....

వెర్రి చూపులు....పిచ్చిగంతులు....మానకపోగా.....శాంతిని పట్టుకుని గిర గిరా తిప్పుతూ.......తన గార్ధవ స్వరంతో పాటలు పాడడం మొదలెట్టాడు......

శాంతికి ఓపిక నసించించింది , ఇక లాభంలేదని పక్కనే ఉన్న చీపురు కట్ట పుచ్చుకోవడంతో దారిలోకొచ్చాడు
"నాకు ఉత్తమ రచయిత అవార్డోచ్చిందోచ్........." పెద్దగా అరిచాడు కిరణ్, కుప్పిగెంతులు మాత్రం మానలేదు
షాక్ నుండి తేరుకోవడానికి కొంచం టైం పట్టింది శాంతికి......
ఒక్క సారి గెంతులాపి "చూశావా......విన్న నీకే అంత ఆశ్చర్యం కగిలితే అవార్డొచ్చిన నేనేమై పోవాలి చెప్పు....ఈ ఆనంద సమయంలో నీకేమి కావాలో కోరుకో వెంటనే తీరుస్తా" వరమిచ్చాడు కిరణ్
"నాకేమి వద్దు గాని ఒక్కసారి ఫోను చేసి కనుక్కోండి, మరెవరికో చేయ బోయి మీకు చేసుంటారు ఆ ఫోను..."
"అదీ నిజమే సుమా........" ఆలోచనలో పడ్డాడు....

మల్లీ ఫోను రింగవడంతో ఎందుకైనా మంచిదని ఈసారి శాంతి ఫోనందుకుంది
అవతలి వైపునుండి ప్రొడ్యూసర్ పానకాలరావ్ మాట్లాడుతున్నాననడంతో శాంతి కి విషయం అర్ధమయింది...వెంటనే రిసీవర్ భర్త చేతికిచ్చి...ఆలోచనలో పడింది


***********

సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం .... పెళ్ళయ్యి మూడునెలలైంది.... కొత్తకాపురం.... ఇద్దరూ ఉదయం తొమ్మిది గంటలకు ఆఫీసు కెళ్ళడం, సాయంత్రం ఏడు గంటల కల్లా ఇల్లు చేరడం టీ వీ ముందు కూర్చుని వొచ్చే చెత్త సీరియల్స్ అన్నీ ఓపిగ్గాచూడడం , ఒకవేళ ఎవరైనా రావడం లేటైతే రెండోవ్యక్తి జరిగిన స్టొరీ ని కళ్ళకు కట్టినట్లు చెప్పడం.....మొదట్లో శాంతి యాడ్స్ చూస్తూ "మీరు వంట చేయొచ్చు కదా " అని ముఖమదోలా పెట్టి ప్రాధేయ పడినట్లు అడిగేది, దాని తో ఉబ్బి పోయిన కిరణ్ ఎగేసుకెల్లి యాడ్స్ అయిపోయే టప్పటికి వంట పూర్తి చేసొచ్చి మళ్ళీ సీరియల్ చూసేవాడు,ఏమాట కామాటే చెప్పాలి శాంతి కంటే కిరణ్ వంట చాలా బాగా చేస్తాడు, తరువాత మెల్ల మెల్లగా అది అతని నిత్య కృత్యమైంది, కాదు కూడదంటే ఇంత కట్నం ఇచ్చి నిన్ను చేసుకుంది వంట చేయడానికి కాదు వంట చేస్తావా చెయ్యవా అంటూ ఇంటి పెంకులెగిరేలా విరుచుకు పడడం మొదలెట్టేది శాంతి... నిజమేకదా కట్నం తీసుకుని పెళ్ళి చేసుకున్నందుకు ఇలాంటివన్నీ సర్దుకుపోవాలేమో అని వంట విషయంలో రాజీపడి పోయాడు.
ఓరోజు ఆఫీసులో పనేమి లేకపోవడంతో ఎంతకీ తరగని టీవీ సీరియల్స్ గురించి ఆలోచనలో పడ్డాడు కిరణ్, ఒక్కోటి రెండు మూడు సంవత్సరాలుగా వస్తూనే ఉంది, ఏరోజు కారోజు అయిపోయినట్లే ఉంటుంది కానీ అయిపోదు........ఎంత నమిలినా తరగని చూయింగ్ గం లా చూసే కొద్దీ వస్తూనే ఉంటుంది ,అర్ధ గంట టైంలో ఇరవై ఐదు నిముషాలు వ్యాపార ప్రకటనలు మిగిలిన ఐదు నిముషాలు కథ......కొత్తదనమేమైనా ఉందా అంటే అదీ లేదు .... పాతకథనే పేరు మార్చి కొత్త వాల్లతో తీస్తున్నారు "ఈ మాత్రం కథలు మనం రాయలేమా ? " తనకు తాను ప్రశ్నించుకున్నాడు
ఒక్కసారిగా ముఖంలో చెప్పలేనంత వెలుగొచ్చింది, ఎలా అయినా సరే ఓ కథ రాయాలి అని నిర్ణయించుకున్నాడు
తన రొట్టె విరిగి నేతిలో పడినట్లు రెండు రోజుల తరువాత పేపర్లో తాము తీయబోయే డైలీ సీరియల్ కు కొత్త రకం కథలు కావాలంటూ ఓ ప్రముఖ టెలీ ఫిల్మ్ వాళ్ళు ఇచ్చిన ప్రకటన చూడగానే ఎగిరిగంతెసినంత పనిచేసి, ఆలోచనలో పడ్డాడు....కథ అంటే ఏమి రాయాలి.....? తనను తాను ప్రశ్నించుకుని ఒక్క ఉదుటన లేచి బయలుదేరాడు....
ఆవారంలో వచ్చిన వార పత్రికలన్నీ కొని ఇల్లుచేరాడు,

ఎప్పుడైనా ఏదైనా పత్రిక కొందామండి అంటే , హాయిగా టీవీ లో వొచ్చే ప్రోగ్రాం లు చూడక ఎందుకా పిచ్చి పత్రికలు అనే కిరణ్ ఒక్కసారిగా బండెడు పుస్తకాలు తీసుకురావడంతో విషయమేమిటని అడిగింది శాంతి, తను చేయ బోతున్న ఘన కార్యం ఒక్క ముక్కలో చెప్పాడు.....

మొదట ఆశ్చర్యం వేసినా.....మంచి పని చేయ బోతున్నందుకు సహకారాన్నందిస్తానని హామీ ఇచ్చింది, "సరే నేనడిగేదానికి ఒప్పుకుంటావా ? " భయం భయం గా అడిగాడు కిరణ్ "చెప్పు ...... " ఏమడగ బోతున్నాడా అని ఆలోచిస్తూ అడిగింది శాంతిదొరికిందే సందనుకుని "నన్ను వంట చేయమనకపోతే నాకదే పదివేలు "చెప్పి అవతలివైపు నుండి ఏవిధమైన సమాధానం వస్తుందాని ఆలోచిస్తూ శాంతి వైపు చూశాడు"ఓసింతేనా......మీరు కథ రాయడం అయి పోయే వరకు వంట నేనే చేస్తా సరేనా..."తెలివిగా చెప్పింది శాంతి

హమ్మయ్యా కొన్ని రోజులు ఈ వంట చేసే బాధ తప్పిందని మనసులో సంతోష పడ్డాడు కిరణ్
పుస్తకాలన్నీ ఎడా పెడా చదివేసి ఓ అవగాహనకొచ్చాడు.....పెన్ను పేపరు తీసుకుని....ఒక్కసారి దేవున్ని ప్రార్దించి అంతా నీదే భారమని మొదలెట్టాడు..


ఒక్క రోజులో ఆరు పేజీల కథ పూర్తి చేసి పోస్ట్ బాక్స్ లో పడేసి చేతులు దులుపుకున్నాడు......
పదిహేను రోజుల తరువాత ప్రొడ్యూసర్ దగ్గరనుండి ఫోను రావడంతో ఇక నేల మీద నడవడం కష్టమైంది......
**************
స్టోరీ డిస్కషన్స్ లో కూర్చున్నాడు కిరణ్ , పక్కనే ప్రొడ్యూసర్ పరమేశ్వరం , రైటర్ రామ్మూర్తి , డైరెక్టర్ దివాకర్, ఇంకా యూనిట్ వాళ్ళు వాళ్ళకు కొంచెం దూరంగా శాంతి కూర్చున్నారు.

శాంతికి సినిమాలన్నా టీవీ అన్నా మహాపిచ్చి , స్టోరీ డిస్కషన్స్ అనగానే కిరణ్ కన్నా ముందు రెడీ అయి కూర్చుంది నేనూ వస్తానని.....తెలిసి తెలిసి రోకట్లో తల దూర్చడం ఇష్టం లేక సరే రా..... అని వెంట తీసుకెళ్ళాడు..........

దివాకర్ నోరు తెరిచాడు... ' తలరాత ' టైటిల్ అదిరింది , ఈ టైపు టైటిల్సే ఇప్పుడు కావాల్సింది...వినగానే ఇదేదో కష్టాల కథ అయి ఉంటుందని ఆడవాళ్ళు టీవి ముందునుండి లెగవరు....దనితో ఇక చచ్చినట్టు ఇంట్లో అందరూ చూడాల్సిందే....

ఇంకా ఏదో చెప్పబోతున్న దివాకర్ మాటల కడ్డుతగిలి "అందుకే చాలా ఆలోచించి ఈ టైటిల్ పెట్టా " కొంచెం గర్వపడుతూ చెప్పాడు...

"ఇంతకీ తమరు రాసిన కతేంటో " వెటకారంగా ప్రశ్నించాడు రామ్మూర్తి
అదేదో టివీలో వచ్చే ప్రొగ్రాములా అవాక్కయ్యాడు కిరణ్ , స్టోరీ తెలియకుండానే కూర్చున్నారా వీల్లంతా..? తనకు తాను ప్రశ్నించుకున్నాడు

"కిరణ్ గారూ మేరేమాలోచిస్తున్నారో నాకర్ధమైంది.....విషయమేమిటంటే ఇక్కడున్నోల్లెవ్వరూ మీ కథ చదవలేదండీ...."చావుకబురు చల్లగా చెప్పాడు దివాకర్

"ఏంటి ఎవరూ చదవకుండానే నాకథ సీరియల్గా తీయడానికి ఎలా సెలెక్టయింది...." వెర్రి చూపులు చూస్తూ అడిగాడు
"దీంట్లో నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరమేమీలేదు, మేమిచ్చిన ప్రకటన చూసి ఇప్పుడే బలపంపట్టిన పిల్లోడి దగ్గరనుండి అందరూ తెగరాసేసి మాముఖాన కొట్టారు....చదివితే చదవండి లేకపోతే చావండని, ఇలా అయితే లాభం లేదని మేమందరం కూర్చుని ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చి లాటరీ తీశాం అదృష్టం బాగున్నోడికి చాన్సు తగిలిద్దని......నీ అదృష్టం బాగుంది నీకథ బైటికోచ్చింది....." విషయాన్ని వివరంగా చెప్పాడు పరమేశ్వరం
విని గుడ్లు తేలేశాడు, "నువ్వు తరువాత ఆశ్చర్యపోదువు గానీ ముందు నీ కథేమిటొ చెప్పు " అడిగాడు దివాకర్
తలరాత బాగుంటే ఏమైనా చేయగలం లేదంటే ఏమి చేసినా లాభం వుండదు అనేది ఈ కథలో నీతి...

"ఏంటి ఈ కథలో నీతి కూడా ఉందేటి....." చేతులోని కథకు సంబంధించిన పేపర్లు చూస్తూ, వెటకారంగా అడిగాడు రామ్మూర్తి

అవునన్నట్లు సీరియస్ గా ఓ చూపు చూసి మళ్ళీ మొదలెట్టాడు కిరణ్...

ప్రసాద్ తన ఆస్తులన్నీ అమ్మి ఓ చిన్న వ్యాపారం పెడతాడు , మొదట్లో తలరాత బాగుండి బాగా సంపాయిస్తాడు , తరువాత వర్మ అనే వేరే వ్యక్తి కూడా అదే వ్యాపారంపెట్టి తనకున్న సమర్ధతతో ప్రసాద్ కస్టమర్లందరిని తన వైపు లాక్కుంటాడు , దానితో ప్రసాద్ ఫ్యాక్టరీ నడిపేందుకు అప్పులు చేయాల్సొస్తుంది ఆ అప్పులు తీర్చలేక ఉన్న ఆస్తులన్నీ అమ్మి రోడ్డున పడతాడు.... ఇదీ క్లుప్తం గా కథ అనగానే

"ఇంతకీ వాళ్ళు చేసే వ్యాపారమేంటో ..." ముఖమదోలా పెట్టి అడిగాడు దివాకర్
"అదే సస్పెన్స్.....ఏమైనా కావొచ్చు...." చాలా సింపుల్ గా చెప్పాడు
"అంటే మనమిప్పుడు ఈ కథని దగ్గర దగ్గర మూడొందల ఎపిసోడ్ల సీరియల్ తీయాలి " పరమేశ్వరం అనగానే మళ్ళీ ఆశ్చర్యపోయాడు కిరణ్


"మూడొందల ఎపిసోడ్లా...?" పెద్దగా అరిచాడు

"నువ్వేందయ్యా బాబు ప్రతి విషయానికి ఆశ్చర్యపోతావు...ఫీల్డ్ కి కొత్తా ఏంటి..." ప్రశ్నించాడు రామ్మూర్తి
"ఇదే నా మొదటి కథ..." మెల్లగా చెప్పాడు

"అదీ సంగతి......." అంతా అర్ధమైనట్లు ముఖం పెట్టి మళ్ళీ మొదలెట్టాడు రామ్మూర్తి "నీకు అసలు విషయం తెలియదు మేము మూడుసంవత్సరాలకు పైగా టెలీకాస్ట్ చేసిన వింతరాగాలు కథ మొదట్లో రెండు పేజీలే దాన్ని మొదట ఓ పదమూడు ఎపిసోడ్ల సీరియల్ గా తీశాం, జనం విరగబడి చూస్తుండడంతో వాళ్ళనెందుకు నిరుత్సాహ పరచాలి అని దాన్ని లాగీ లాగీ ఇక లాగలేక వదిలేశాం.........

దీన్ని మూడొందల భాగాలు చేయడం పెద్ద కష్టమైన పనేమీ కాదు, ప్రసాద్ ఫ్యామిలి గురించి, వర్మ ఫ్యామిలి గురించి ఓ 50 ఎపిసోడ్లు,

తరువాత కాలేజిలో వీల్లిద్దరికి జరిగిన గొడవ......దీన్ని చెప్పడానికి ఓ 50 ఎపిసోడ్లు,
వీల్ల పెళ్ళిళ్ళు పిల్లలు ఇంకో 50 ,

తరువాత బిజినెస్ అని ఓ 50 ఎపిసోడ్లు సాగతేస్తే మొత్తం ఓ రెండొందలవుతాయి
ప్రసాద్ కొడుకు తో వర్మ కూతురి పరిచయం ప్రేమ పెళ్ళీ వీల్ల పిల్లలు ఓ 100 ఈజీ గా మూడొందలవుతున్నాయ్ , ఇకపోతే పాత్రల విషయానికొస్తే సింపుల్ గా ఓ అరవై డెబ్బై మందైతే సరిపోతుంది........ఇకపోతే స్క్రీన్ ప్లే.... అది మనమింతవరకు ఏ సీరియల్ కూ రాయలేదు కనుక కొత్తగా దాన్ని గురించి ఆలోచించనవసరం లేదు......"

అనగానే అంతా చప్పట్లు కొట్టారు, చప్పట్లు కొట్టకపోతే అలా చెప్పుకుంటూ పోతాడన్న సంగతి అక్కడున్న అందరికీ తెలుసు ఒక్క కిరణ్కి తప్ప, కిరణ్కి మాత్రం ఏమి అర్ధమవలేదు నేను రాసిందాంట్లో ఇంతుందాని ఆలోచిస్తూ కూర్చున్నాడు ఏమీ మాట్లాడకుండా

"ఏమంటావ్ " ప్రొడ్యూసర్ భుజం మీద చేయ్యి వేసి అడగడంతో ఈలోకాని కొచ్చాడు కిరణ్
"నేననేదేముంది.......మరీ అంత పెద్ద సీరియల్ తీయడం కష్టమవుతుందెమో " ఎక్కడో ఆలోచిస్తూ తన సందేహాన్ని వెలిబుచ్చాడు

"ఆ అదీ నిజమే చివరకొచ్చేటప్పటికి మాకూ బోరుకొడుతుంది, అయినా కెమారాలు ఇక షూట్ చేయలేమనుకున్నప్పుడు మొదట్లో వొచ్చిన ఎపిసోడ్ల నుంచి కొన్ని బిట్లు తీసి మాకు కావాల్సిన విధంగా డబ్బింగు చెప్పిస్తాం...అదే టెలికాస్ట్ చేస్తాం.....ఆ సీనెప్పుడో చూసినట్టుంటుందే గాని ప్రేక్షకులు గుర్తుపట్టలేరు.....ఆవిధంగా మేం మేనేజ్ చేస్తాం అన్నమాట " చెప్పాడు దివాకర్

కిరణ్ కి విషయం అర్ధమయింది, ఇంకా ఇక్కడే ఉంటే ఇలాంటి బాంబులు చాలానే పేలేలాఉన్నాయ్ ఇక్కడనుండి నిష్క్రమించడం మంచిదనే నిర్ణయానికొచ్చి "ఇంతకీ నేనేమి చేయాలి...." అమాయకంగా అడిగాడు కిరణ్
"ఏదైనా అవసరమైతే మేమే పిలుస్తాం , ప్రస్తుతానికి అకౌంటెంట్ ని కలిసి నీకురావాల్సినవి తీసుకుని....." ఇంకా ఏదో చెప్తున్న పరమేశ్వరం మాటల కడ్డు తగులుతూ "సరే నాకు రావాల్సినవి తీసుకుని నే వెళ్ళిపోతా అంటూ శాంతి వైపు చూశాడు, ఇంట్లో ప్రతి చిన్న విషయానికి పిచ్చి పిచ్చిగా రంకెలు పెట్టే శాంతి ఇక్కడింత జరుగుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం కిరణ్ కి జీర్ణించుకోలేని విషయంగా తయారైంది, బయటకు నడుస్తూ అదే విషయాన్నడిగాడు శాంతిని

"ఎక్కడెలా ఉండాలో నాకుతెలుసండి....ఇప్పుడిక్కడ నేను నోరు తెరిస్తే ఇంతమంది ముందు మీ పరువు గంగలో కలిసి పోతుంది అందుకే ఎప్పుడూ భర్త పక్కన ఇలాంటి చోటికొచ్చిన ఇల్లాలు మౌనంగా కుర్చుంటదే గానీ ఏమీ మాట్లాడదు.....మీరెప్పుడూ టీవీ లో చూడలేదనుకుంట మీటింగ్ కి భర్తతో వచ్చినప్పుడెవరైనా ఏమైనా మాట్లాడడం చూశారా.....?"చివరగా వేసిన ప్రశ్నలో నిజముందనిపించింది కిరణ్కు అయినా అనవసరంగా ఇప్పుడు దీన్ని కదిలించాన్రా బాబు అనుకుంటూ స్కూటర్ స్టార్ట్ చేశాడు
తరువాత అప్పుడప్పుడు షూటింగ్ జరిగే ప్లేసుకెల్లి ఏమి జరుగుతుందో చూడడం తప్ప ఏమిజరుగుతుందని ఎప్పుడూ ఎవరినీ అడగలేదు

మూడొందలని మొదలుపెట్టిన సీరియల్ ఐదొందలు దాటింది , వస్తున్నన్ని రోజులు జనం ఎప్పుడైపోతుంది రా బాబూ అనుకుంటూ వేరే గత్యంతరంలేక యాడ్స్ మధ్యలో అప్పుడప్పుడూ వొస్తున్న కథను మాతలరాత అనుకుంటూ చూశారు....


******************

మరుసటి రోజు పేపర్లో తాటికాయంత అక్షరాలతో అవార్డు విషయం రావడంతో ఉన్న ఫలంగా కిరణ్ డిమాండ్ పెరిగింది, నిర్మాతలు...డైరెక్టర్లు... ఒకరి తరువాత ఒకరు మాకు కథ రాయమంటే మాకు కథ రాయమని ఫోనుల మీద ఫోనులు చేయడం మొదలెట్టారు.

కథలు రాయకూడదన్న తన నిర్ణయానికి తిలోదకాలిచ్చి , మళ్ళీ కలం పట్టి భగవంతున్ని ప్రార్ధించాడు......స్వామీ నేను మళ్ళీ కలంపట్టేనంటే ఇందులో నాతప్పేమి లేదు , నాతలరాత బాగుండి నేను సంపాయించుకునే మహత్తరమైన అవకాశం వొచ్చింది ఈఅవకాశాన్నొదులుకోలేక ఇలా జనం మీద నాకలంతో దండయాత్ర మొదలెట్టాను ఇక జనాల తలరాతను నువ్వే నిర్ణయించాలి....


**************
ఈ కధ తొలి ప్రచురణ 2002 సంవత్సరం ఆంధ్రభూమి వారపత్రిక .

Friday, November 16, 2007

జాబిల్లి - అంటే?

ఈ మధ్య నా బుర్రలో ఓ పురుగు తెగ తిరిగేస్తుంది తొందరగా ఆ పురుగును తీసి పారేయక పోతే ఎప్పుడో మంచి సమయం చూసుకుని చటుక్కున నాబుర్రలో ఉన్న (ఉందనుకుంటున్న) చిటికెడు గుజ్జు గుటుక్కుమని పిస్తుందేమో అని భయమేస్తుంది.

  • చందమామ రావే... జాబిల్లి రావే కొండెక్కిరావే గోగుపూలు తేవే....
  • జాబిలి కి వెన్నెలకీ పుట్టిన పున్నమివే....
  • జాము రాతిరి జాబిలమ్మా జోలపాడనా ఇలా....
  • జాబిలమ్మ నీకు అంతకొపమా......

ఇలా మన తెలుగులో బోలెడు పాటలున్నాయి చందమామ...జాబిల్లి....వెన్నెల అంటూ, నాకు చందమామ అంటే ఏమిటో తెలుసు..... వెన్నెల అంటే ఏమిటో తెలుసు(తెలుసు అని నేననుకుంటున్నాను సుమా) మరి ఈ జాబిల్లి (జాబిలి) అంటే ఏంటి అనేదే నాబుర్రలో తెగ తెగతిరిగేస్తున్న పురుగు.

జాబిల్లి అంటే ఏమిటి, చందమామకీ జాబిల్లి కీ సంబందము / తేడా చెప్పగలరా?

మీలో కొందరనుకోవచ్చు దీనికోసమా ఇంత హైరానా పడిపోతున్నాడు అని కానీ తెలియని విషయం తెలుసుకోవాలనుకోవడం తప్పుకాదు కదా?